
అద్దంకి – నార్కెట్‌పల్లి హైవే.. 1190 కోట్ల రూపాయల వ్యయంతో 212 కిలోమీటర్ల హైవే నిర్మాణం ప్రారంభించారు.. 2012లో ఈ హైవే నిర్మాణం మొదలైనా పిడుగురాళ్లలో మాత్రం వివిధ కారణాలతో బైపాస్ నిర్మాణం ఆగిపోయింది. అయితే వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత బైపాస్ నిర్మాణానికి చెందిన అన్ని అనుమతులను క్యూబ్ సంస్థకు ప్రభుత్వం ఇచ్చింది. 2021 జనవరి నాటికి బైపాస్ నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా 2022 జనవరి నాటికి పూర్తి చేయాలని సమయం ఇచ్చారు. ఆ తర్వాత 2023 జనవరి.. మార్చి ఇలా డెడ్‌లైన్ మారుతుందే తప్ప.. పనులు పూర్తి కాలేదు.
దీంతో కాంట్రాక్ట్ సంస్థ తీరుపై మండిపడ్డారు ఎమ్మెల్యే కాసు మహేష్. ఎన్నిసార్లు చెప్పినా పనులు వేగంగా చేయకపోవడంతో.. విసిగిపోయిన ఎమ్మెల్యే నేరుగా నిరసనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో దిగొచ్చిన క్యూబ్ సంస్థ ప్రతినిధులు ఎమ్మెల్యేతో బహిరంగంగానే చర్చలు జరిపారు. జూన్ 30 నాటికి బైపాస్ నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పూర్తి చేయకుంటే టోల్ నిలిపి వేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.
మే ఒకటి తర్వాత హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను బైపాస్ గుండా అనుమతించి మధ్యలో పట్టణం గుండా డైవర్ట్ చేస్తామన్నారు. నర్సరావుపేట, గుంటూరు నుంచి వచ్చే భారీ వాహనాలను మాత్రం ఉదయం ఎనిమిది నుంచి పన్నెండు గంటల వరకూ టౌన్ లోకి అనుమతించమని చెప్పారు. దీంతో నిరసన విరమించారు ఎమ్మెల్యే. జూన్ 30లోపు పూర్తి కాకపోతే ఈ సారి నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు ఎమ్మెల్యే మహేష్.
మరిన్ని ఏపీ వార్తల కోసం..