Viral News: పారిశుధ్య కార్మికులుగా మారిన సర్పంచ్.. పంచాయతీ పాలకవర్గం.. ఎందుకో తెలిస్తే మైండ్ బ్లాంక్..
నిరసన తెలపడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ప్రభుత్వంపై నిరసన తెలిపేందుకు ప్రతిపక్షాలు ఓ విధమైన కార్యాచరణతో ముందుకుళ్లే, సామాన్య ప్రజానీకం తమ స్థాయిలో నిరసనలు..
Andhrapradesh: నిరసన తెలపడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ప్రభుత్వంపై నిరసన తెలిపేందుకు ప్రతిపక్షాలు ఓ విధమైన కార్యాచరణతో ముందుకుళ్లే, సామాన్య ప్రజానీకం తమ స్థాయిలో నిరసనలు తెలపడం, ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడం సాధారణం. గ్రామాల్లో ఎవరికైనా సమస్యవస్తే తక్షణమే గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్ దృష్టికి తీసుకెళ్తాం. సర్పంచ్ మండల స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తారు. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ.. మరి పాలకులు నిరసన తెలిపాలంటే.. నేరుగా స్థానిక ఎమ్మెల్యేనో లేదా ఇతర ప్రభుత్వంలో పరపతి ఉన్న నాయకుల దగ్గరకు వెళ్లి తమ సమస్యలు చెప్పి.. పరిష్కరించమని అడుగుతారు. అయితే ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో ఓ సర్పంచ్ మాత్రం వినూత్నంగా తమ నిరసనను తెలిపారు. కేవలం సర్పంచ్ ఒక్కరే కాదు. పాలక వర్గం మొత్తం ఈనిరసనలో పాల్గొన్నారు. ఇంతకీ వారేం చేశారనుకుంటున్నారా.. గ్రామంలో పారిశుధ్య కార్మికులకుగా మారి తమ నిరసనను తెలిపారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలోని కాట్రపాడు గ్రామ సర్పంచి మేదరమెట్ల శంకర్, పంచాయతీ పాలకవర్గ సభ్యులు పారిశుద్ధ్య కార్మికులుగా మారి గ్రామంలో ఇంటింటింకి తిరిగి చెత్త సేకరించారు. ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించిన సర్పంచి తమ పంచాయతీకి నిధులు లేవు.. పనులెలా చేయించాలంటూ నిరసన తెలిపారు. ప్రభుత్వం అందించిన మూడు చక్రాల చెత్త సేకరణ బండి నడిపిస్తూ విజిల్ వేస్తూ గ్రామం మొత్తం తిరిగారు. సర్పంచి చెత్త సేకరిస్తున్న విషయం తెలుసుకున్న స్థానికులు ఆయనను అనుసరించారు. పంచాయతీకి ఏ విధమైన సొంత ఆర్థిక వనరులు లేవని, గ్రామానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 14, 15 ఆర్థిక సంఘం నిధులు రూ.6,00,000లను రాష్ట్ర ప్రభుత్వం అక్రమ మార్గంలో తీసుకుందని సర్పంచ్ మేదరమెట్ల శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు కూడా ఇవ్వకపోవడంతో పారిశుద్ధ్య కార్మికులు పనులకు రావడం లేదని, దీంతో ఇళ్ల వద్ద చెత్త పేరుకుపోయిందని సర్పంచ్ ఆరోపించారు.
విద్యుత్తు దీపాల కొనుగోలుకు డబ్బులు లేక పాతవాటినే మరమ్మతులు చేసి, స్తంభాలకు బిగిస్తున్నట్లు కాట్రపాడు గ్రామ సర్పంచి మేదరమెట్ల శంకర్ తెలిపారు. సర్పంచులు చేయాల్సిన పనులు వాలంటీర్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ నిరసనను ప్రభుత్వం గుర్తించి పంచాయతీకి నిధులు తిరిగివ్వాలని కోరారు. సర్పంచ్ వినూత్నంగా చేపట్టిన ఈనిరసన జిల్లాలో సర్వత్రా చర్చనీయాంశమైంది. పంచాయతీల నిధులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని ఇటీవల విమర్శలు వస్తున్నాయి. అయితే చాలామంది సర్పంచ్ లు తమ పంచాయతీ నిధులు తమకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ఇవ్వాలని అడుగుతున్నారు. అయినా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో సర్పంచ్, పంచాయతీ పాలకవర్గం నిరసనబాట పట్టింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..