ఆత్మలతో మాట్లాడుతానంటాడు. బతికున్న మనుషుల ఆత్మలను కూడా కూర్చోబెడుతానంటున్నాడు. మనుషులేంటి.. దేవుళ్లతోనే దోస్తీ అంటున్నాడు. భూత వైద్యం చేస్తా.. చేతబడిని అంతం చేస్తా. దెయ్యం ఏదైనా సరే నా ముందు తగ్గాల్సిందే అంటున్నాడు రత్నకుమార్. అసలెవరీ రత్నకుమార్..? నిజంగా దెయ్యాలు వదిలిస్తాడా..? ఆత్మలతో మాట్లాడతాడా..? పాస్టర్ ముసుగులో చేస్తున్నదేంటి..? టీవీ9నిఘాలో బయటపడ్డ వాస్తవాలేంటో చూడండి.
ఆత్మలు ఉన్నాయా? ఇది సమాధానం దొరకని ప్రశ్న. కాదని ఖండించలేని వాస్తవం. ఔనని అంగీకరించలేని కల్పన. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎవరికి తోచినట్లు వారు చెబుతారు. కచ్చితమైన సమాధానాలు మాత్రం ఎవరి వద్దా ఉండవు. అయితే ఇతను చూడండి. ఆత్మలతో మాట్లాడుతున్నాడు. అది కూడా ఎదురుగా కూర్చున్న మనిషి ఆత్మతో మాట్లాడుతున్నాడు.
దెయ్యం అంటే భయపడే వాళ్ళు చాలా మందే ఉన్నారు.. దెయ్యం భయంతో ఊర్లు ఖాళీచేసి వెళ్లిపోయే జనాలు కూడా ఉన్నారు. ఇక దెయ్యాల పేరు చెప్పుకొని డబ్బులు దండుకునే వాళ్ళు, జనాలను భయపెట్టే వాళ్లు సైతం ఉన్నారు. రకరకాల ఎడిట్స్ తో.. గ్రాఫిక్స్ తో.. ఇదిగో దెయ్యం.. అదిగో దెయ్యం అంటూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుంటారు కొందరు. ఇతను కూడా అలాంటి వాడే. మానవుని బలహీనతలే అతనికి ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. మూఢనమ్మకాలే పొట్ట నింపుతున్నాయి.
గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన రత్నకుమార్ పెళ్లి చేసుకున్న అనంతరం భార్య స్వగ్రామం అయిన ఎన్టీఆర్ జిల్లా పెనుగ్రంచిపోలులో పాస్టర్‌గా స్థిరపడ్డాడు. 7 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్న రత్నం.. కొంతకాలం క్రితం భూత వైద్యం పేరుతో వెలుగులోకి వచ్చాడు. ప్రజల్లో మూఢనమ్మకాలు ఇంకా పెనవేసుకొని ఉండడం ఇంతనికి వరంగా మారింది. ప్రార్ధన పేరుతో అందరి ఇళ్లకు వెళ్లి.. మీ ఇంట్లో దెయ్యాలు వున్నాయంటాడు. ఎవరో చేతబడి చేశారని ఆందోళనకు గురి చేస్తాడు. చివరికి నేను వదిలిస్తా రండీ అంటూ డబ్బులు వసూలు చేస్తాడు. ఎప్పుడైన చర్చ్‌కు వెళ్లి.. మాకు ఈ సమస్య ఉంది ప్రార్థన చేయండి అంటే చాలు.. అతను చెప్పే సమాధానం మాత్రం ఒక్కటే.. దెయ్యం పట్టింది లేదా చేతబడి చేశారు. తర్వాత జరిగే ఎపిసోడ్ ఏంటో మీరే చూడండి.
ఈ వ్యవహారం టీవీ9 దృష్టికి చేరటంతో.. టీవీ9 టీం ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ని వెంటపెట్టుకొని పాస్టర్ దగ్గరకు వెళ్లింది. మా అమ్మాయి హాస్టల్‌లో ఉంటుంది. వారం నుంచి ఆమె ప్రవర్తన సరిగ్గా ఉండటం లేదని చెప్పటంతో రత్నాకర్ అసలు రూపం బయటపడింది. కళ్ల ముందు యాక్ట్ చేస్తున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ వలలో పడి మరింత మాయాజాలం సృష్టించాడు. ఆమె నటన గుర్తించలేని రత్నం అడ్డంగా బుక్ అయ్యాడు. అతని డ్రామాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూడండి.
నా దగ్గరకు తీసుకొచ్చి మంచి పనిచేశారు. జరగబోయే ఘోరాన్ని ఆపానంటూ పేరెంట్స్‌గా వెళ్లిన టీవీ9 నిఘా బృందాన్ని భయపెట్టాడు. కొన్ని వందల దయ్యాల్ని వదిలించానంటూ వీడియోలు చూపించాడు.
అంతేనా.. వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామిని సైతం కూర్చోపెట్టి మాట్లాడతానంటూ ప్రగల్భాలు పలికాడు. ఆత్మలన్నీ తన ఆధీనంలోనే ఉన్నాయంటూ చెప్పుకున్నాడు. ఆర్టిస్ట్‌కు ప్రార్థన చెయ్యగానే ప్లాన్ ప్రకారం ఆమె కింద పడిపోయింది. దీంతో ఇక దెయ్యం పోయిందన్నాడు. ఇక్కడ మరో ఇంట్రస్టింగ్ సీన్ ఉంది. చర్చ్ నుండి బయటకు వచ్చిన టీవీ9 టీమ్.. మళ్లీ దయ్యం వచ్చిందని లోపలికి వెళ్లింది. దీంతో ఇక్కడి నుంచి వెళ్లిన దయ్యం గుమ్మం దగ్గర రెడీగా ఉందని.. మళ్లీ పట్టేసిందన్నాడు. ఇది ఇక్కడితో పోదని మళ్లీ ప్రార్ధన చేసి, నోట్లో కొబ్బరి నూనె పోసి, కుదిరినప్పుడల్లా తీసుకురమ్మని చెప్పాడు. భూత వైద్యం పేరుతో అమాయకులను బుట్టలో వేసుకోవడం.. డబ్బులు వసూలు చేయడం. ఇది ఇతని ఆరాచకం.
నిజానికి సమస్యలు మూఢత్వంలో నుంచి పుట్టినవి అయినా, మరేరకమైన సమస్యలు అయినా.. వాటి పరిష్కారం మాత్రం భౌతిక వాస్తవికత ద్వారానే సాధ్యమవుతాయి. అంతేతప్పా.. మాయలు మంత్రాలు, క్షుద్రపూజలు వంటి అశాస్త్రీయమైన మార్గాలేవి ఉండవు. సమస్య ఏదైనా పరిష్కారం మాత్రం భౌతిక మార్గంలో ఉంటుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..