AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అదిరిందయ్యా రైతన్నా.. ఒక రకంగా పొలంలో డబ్బులు పండిస్తున్నట్లే..

గుంటూరు జిల్లాకు చెందిన రైతు వెంకటేశ్వరరావు పంటల వైవిధ్యాన్ని, దశలవారీ సాగును అనుసరించి రోజువారీ ఆదాయాన్ని పొందుతున్నారు. ఒక ఎకరంలో దీర్ఘకాల చామదుంప పంటను, మరో ఎకరంలో రకరకాల ఆకుకూరలను చిన్న చిన్న విస్తీర్ణాల్లో పండిస్తూ, ప్రధాన పంట దిగుబడి కోసం వేచిచూడకుండా నిత్యం ఆదాయాన్ని ఆర్జిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

అదిరిందయ్యా రైతన్నా.. ఒక రకంగా పొలంలో డబ్బులు పండిస్తున్నట్లే..
Farming
Ram Naramaneni
|

Updated on: Sep 02, 2026 | 4:42 PM

Share

సాధారణంగా రైతులు ఒక పంట దిగుబడి కోసం చాలా కాలం ఎదురుచూడాల్సి వస్తుంది. ఈ సుదీర్ఘ కాలంలో ఆదాయం లేక అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే, గుంటూరు జిల్లా, మంగళగిరి మండలం, ఎర్రబాలెం గ్రామానికి చెందిన రైతు వెంకటేశ్వరరావు ఈ సంప్రదాయ విధానానికి భిన్నంగా వినూత్న సాగు పద్ధతులను అవలంబిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. పంటల వైవిధ్యాన్ని, దశలవారీ సాగును అనుసరిస్తూ నిత్య ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. వెంకటేశ్వరరావు తన వ్యవసాయ క్షేత్రంలో రెండు ఎకరాలను సాగు చేస్తున్నారు. ఒక ఎకరంలో సుమారు ఎనిమిది నెలల కాలపరిమితి ఉన్న చామదుంపను ప్రధాన పంటగా ఎంచుకున్నారు. మరో ఎకరంలో మాత్రం రకరకాల ఆకుకూరలను పండిస్తున్నారు. చామదుంప పంట దిగుబడి కోసం వేచిచూసే ఎనిమిది నెలల కాలాన్ని ఆయన వృథా చేయకుండా, ఆకుకూరల సాగుతో రోజువారీ ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ రైతు చుక్కకూర, పాలకూర, తోటకూర, గోంగూర, కొత్తిమీర, పుదీనా వంటి ఆరు రకాల ఆకుకూరలను సాగు చేస్తున్నారు. వీటిని రెండు నుంచి ఐదు సెంట్ల విస్తీర్ణంలో చిన్న చిన్న కమతాలుగా విడదీసి, దశలవారీగా పండిస్తున్నారు. ఒక ఆకుకూర పంట కోత పూర్తయ్యే లోపే మరో పంట కోతకు సిద్ధంగా ఉండేలా ప్రణాళిక బద్ధంగా సాగు చేస్తున్నారు. దీని వల్ల పొలంలో ఎల్లప్పుడూ పంట, పంటతో పాటు నిరంతర ఆదాయం, ఆదాయంతో రైతు చేతిలో నగదు ఉంటున్నాయి.

మంగళగిరి మార్కెట్‌లో రిటైల్‌గా, హోల్‌సేల్‌గా ఆకుకూరలను విక్రయిస్తూ లాభాలు పొందుతున్నారు. ఉదాహరణకు, చుక్కకూర కిలో 300 రూపాయలు, పాలకూర 150 రూపాయలు, గోంగూర 200 రూపాయలు, తోటకూర 250 రూపాయలు, బచ్చలకూర 400 రూపాయలు వరకు ధర పలుకుతున్నాయి. చామదుంప సాగుకు పెట్టుబడి లక్ష రూపాయల కౌలుతో కలిపి రెండు లక్షల రూపాయలు అయినప్పటికీ, ఆకుకూరల ద్వారా వచ్చే రోజువారీ ఆదాయం రైతు కుటుంబ అవసరాలను తీరుస్తోంది. పెద్ద పంటతో భారీ ఆదాయం కోసం ఎదురుచూడటం కంటే, చిన్న చిన్న పంటల ద్వారా నిరంతర ఆదాయం పొందడం మేలని వెంకటేశ్వరరావు తన సాగు ద్వారా సందేశాన్ని ఇస్తున్నారు. మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నా, ఆకుకూరల సాగు రైతుకు ఆర్థికంగా అండగా నిలుస్తోందని ఆయన చెబుతున్నారు. మందుల ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడం, మార్కెట్ ధరల్లో హెచ్చుతగ్గులు వంటి సమస్యలు ఉన్నప్పటికీ, ప్రణాళికాబద్ధమైన పంటల వైవిధ్యం వ్యవసాయంలో స్థిరమైన లాభాలకు భరోసా ఇస్తుందని ఆయన అనుభవం చాటుతోంది. ఈ రైతు సాగు విధానం ఇతర రైతులకు కూడా నిత్య ఆదాయ ప్రణాళికకు ఒక ఆదర్శనీయమైన ఉదాహరణ.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us