Guntur: అత్యాశ నిండా ముంచేస్తుందంటే ఇదే కాబోలు..

గుంటూరులోని విద్యా నగర్‌కు చెందిన షాహిద్ ఎల్‌ఐసి ఏజెంట్‌గా పని చేస్తున్నారు. ఆయన భార్య నగీనాకు కొద్దిరోజుల క్రితం ఒక ఫోన్ కాల్ వచ్చింది. తమ తాతగారి ఇల్లు కూల్చివేస్తున్న సమయంలో బంగారం దొరికిందని, వాటిని తక్కువ ధరకే ఇచ్చేస్తామని ఆమెను నమ్మించారు. ఆ తర్వాత నగీనా కర్నాటకకు వెళ్లి 0.800 మిల్లీగ్రాముల బంగారం ముక్క తీసుకుని గుంటూరుకు వచ్చింది.. తర్వాత..

Guntur: అత్యాశ నిండా ముంచేస్తుందంటే ఇదే కాబోలు..
Police Station

Edited By: Ram Naramaneni

Updated on: Sep 30, 2025 | 1:33 PM

గుంటూరులోని విద్యా నగర్‌కు చెందిన షాహిద్ ఎల్‌ఐసి ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య పేరు నగీనా. నగీనాకు కొద్దిరోజుల క్రితం ఒక ఫోన్ వచ్చింది. మీరు నాకు తెలుసు..మీకో విషయం చెప్పాలి… తాత గారి ఇల్లు పడేస్తున్న సమయంలో మాకు బంగారం దొరికింది. ఇందుకు మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఆమెను నమ్మించడానికి ఏకంగా ఫోటోలు కూడా పంపారు. ఆ ఫోటోలు చూసిన తర్వాత..  ఫోన్ చేసిన అజ్ఞాత వ్యక్తులు చెప్పిన మాటలు నగీనా నమ్మింది. ఈ విషయాన్ని భర్తకు చెప్పింది. ఇద్దరూ కలిసి ఆ తర్వాత.. వారితో మాటామంతి కొనసాగించారు. కర్నాటక హోస్పేట్‌లో కుద్దీల్‌కు రావాలని అజ్ఞాత వ్యక్తులు సూచించారు. వారి సూచన మేరకు ఈ నెల ఏడో తేదిన నగీనా కర్నాటకకు వెళ్లింది. ఫోన్లో పరిచయమైన గీత, రవి, మరొక వ్యక్తి కలిసి 0.800మిల్లీ గ్రాముల బంగారం ముక్క ఇచ్చారు. కావాలంటే చెక్ చేసుకోమని తెలిపారు. ఆ బంగారం ముక్క తీసుకొని గుంటూరు వచ్చిన నగీనా బంగారు ఒరిజినాలిటీ చెక్ చేయగా అసలు బంగారమనే తేలింది. దీంతో పలు దఫాలుగా వారితో మాట్లాడిన నగీనా.. ఈ నెల 13 తేదిన మరోసారి కర్నాటక వెళ్లింది. తనతో పాటు పన్నెండు లక్షల రూపాయలను తీసుకెళ్లింది. రవి, గీత.. నగీనా వద్ద ఉన్న పన్నెండు లక్షల రూపాయల తీసుకొని అరకేజీ బంగారం ఇచ్చారు. దీంతో సంతోషంగా బంగారాన్ని తీసుకున్న నగీనా గుంటూరు వచ్చింది.

అరకేజీ బంగారాన్ని చెక్ చేయగా అది అసలు బంగారం కాదని తేలిపోయింది. రాగి, జింక్ మిశ్రమంతో తయారు చేసిందిగా గుర్తించారు. దీంతో తాము మోసం పోయామని నగీనా దంపతులు భావించి రవి, గీతాలకు ఫోన్ చేయడం మొదలు పెట్టారు. అయితే వారి ఫోన్లు స్విఛ్చాఫ్ అయ్యాయి. వెంటనే నగీనా దంపతులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన అరండల్ పేట పోలీసులు నిందితులను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. తెలిసిన వ్యక్తులే మోసం చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. బాధితులు చెప్పిన వివరాల ప్రకారం నిందితులను పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి