కుటుంబ కలహాలతో విసుగెత్తిన ఆ యువకుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. సూసైడ్ చేసుకుంటున్నానని తల్లికి చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. దీంతో కంగారు పడ్డ ఆ తల్లి తన కొడుకు ఆత్మహత్య చేసుకుంటానని వెళ్లిపోయాడని పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎంతో చాకచక్యంగా ఆ యువకుడిని రక్షించారు. ఆత్మహత్య చేసుకునేంత వరకు వెళ్లిన యువకుడిని కాపాడారు.
వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా గుంతకల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దోనుముక్కలకు చెందిన ఓ యువకుడు కుటుంబ కలహాల నేపథ్యంలో తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఆత్మహత్య చేసుకుంటానని ఇంట్లో తల్లికి చెప్పి బయటకు వెళ్లిపోయాడు. తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన అథికారులు.. తల్లితో సెల్ ఫోన్లో యువకుడిని మాటల్లో పెట్టి లైవ్ లొకేషన్ కనుగొన్నారు. రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకోవాలనుకున్న యువకుడిని కాపాడారు. తల్లి బోయ దేవి పోలీస్ స్టేషన్‌కి ఏడుస్తూ వెళ్లి తన కొడుకు చనిపోతానని ఎక్కడికో వెళ్లిపోయాడు. ఎలాగైనా కాపాడండి అంటూ పోలీసులను వేడుకుంది. వెంటనే స్పందించిన రూరల్ ఎస్ఐ సురేష్ ఆ మహిళతో కుమారుడి సెల్ నెంబర్‌కిపలు మార్లు ఫోన్ చేసి మాట్లాడటానికి యత్నించారు.
మూడుసార్లు ఫోన్ చేసిన తర్వాత లక్ష్మీదేవి కుమారుడు ఫోన్ లిఫ్ట్ చేసాడు. నెమ్మదిగా తల్లితో యువకుడిని మాటల్లో పెట్టి…. ధైర్యాన్ని చెప్తూ ఎక్కడున్నాడో అన్న సమాచారాన్ని సేకరించారు. కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన యువకుడు రానా(25) అప్పటికే కొనకొండ్ల రైల్వే బ్రిడ్జి దగ్గర రైలు పట్టాల దగ్గర ఉన్నట్లు లొకేషన్ గుర్తించారు. రానా ఉన్న ప్రాంతానికి చేరుకుని అతడికి కౌన్సిలింగ్ ఇచ్చి తల్లికి అప్పగించారు. మహిళ ఫిర్యాదును స్వీకరించిన వెంటనే స్పందించి ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడకుండా యువకుడిని కాపాడారు పోలీసులు. తన కుమారుడిని క్షేమంగా ఇంటికి చేర్చిన పోలీసులకు తల్లి కృతజ్ఞతలు తెలిపింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..