Gulab Cyclone Updates: బంగాళాఖాతంలో బలపడిన గులాబ్ తుపాను ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ శ్రీకాకుళం జిల్లాలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. తుపాను ముప్పు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొలాకి మండలం సముద్ర తీర ప్రాంతాలు గుల్లవానిపేట, గుప్పిడిపేట, రాజారాంపురం ప్రాంతాల్లో ధర్మాన పర్యటించి అధికారులకు పలు సూచనలు చేశారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో సౌకర్యాలకు లోటు ఉండరాదని స్పష్టం చేశారు.
గులాబ్ తుఫాన్ టెక్కలి, పలాస నియోజకవర్గాల మద్య తీరం దాటే అవకాశం వుందన్న వాతావరణ శాఖ హెచ్చరికతో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు మంత్రి సిదీరి అప్పలరాజు తెలిపారు. తుఫాన్ తీరం దాటే సమయంలో ఈదురు గాలులు బలంగా వీచే అవకాశం ఉందని తెలిపారు. ఈ క్రమంలో విద్యుత్ సరఫరాకి అంతరాయం కలిగే అవకాశం వుందని.. తదనుగుణంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రాకుండా ఉండాలని సూచించారు. జిల్లాలో ఎనిమిది ఎన్డీఆర్ఎఫ్, ఎనిమిది ఎస్టీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయన్నారు. అధికారులు అంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్నారని తెలిపారు.
కాగా.. తుపాను హెచ్చరికల నేపథ్యంలో క్షేత్రస్థాయి అధికారులను జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అప్రమత్తం చేశారు. జాతీయ విపత్తు నిర్వహణ బృందాలను సైతం సిద్ధం చేసినట్లు వెల్లడించారు. జిల్లా పరిధిలోనే తుపాను తీరం దాటే పరిస్థితి ఉండటంతో గార, కవిటి తీర ప్రాంతాలకు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు చేరుకున్నట్లు తెలిపారు. మత్స్యకారులంతా అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు.
తుపాను పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో రెవెన్యూ, పోలీసు, మెరైన్ పోలీసు, విద్యుత్, ఆర్‌అండ్‌బీ, అగ్నిమాపక, వైద్య-ఆరోగ్యశాఖ అధికారులకు ఈరోజు సెలవును రద్దు చేశారు. జిల్లాలోని అన్ని మండలాలతో పాటు కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూం ఏర్పాటు చేశారు. తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ.. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
Also Read: