పోలీసులమంటూ పలువురిని బెదిరింపులకు పాల్పడుతూ బంగారం, నగదును దోచుకుంటున్న ఆరుగురు అంతరాష్ట్ర ముఠా సభ్యులను పోలీసులు పట్టుకున్నట్లు ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు. గుడివాడ 1వటౌన్ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విరవాలు వెల్లడించారు. ఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లాలోని ముసునూరు వెంకన్నకోటిబాబు, ఏవూరి నరేష్, కిలారి సోమవెంకట దుర్గ గణేష్ కుమార్ (ఇబ్రాహీంపట్నం-విజయవాడ), దారపురెడ్డి రామకృష్ణ (విశాఖ), ముసునూరు కాశీవిశ్వనాథ్ (గుంటూరు), ముసునూరు మురళీ కృష్ణ (బోడుప్పల్-రంగారెడ్డి జిల్లా) కలిసి ముఠాగ ఏర్పడ్డారు. వారు తాము పోలీసులమని, ఐడీ పార్టీ, స్పెషల్ బ్రాంచ్, విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ అంటూ వాహనదారులను, ప్రయాణికులను బెదిరించి నగదు, బంగారం, వాహనాలను దొంగిలించారు. గుడివాడ టీచర్స్ కాలనీలో ఒంటరిగా ఉన్న ఓ మహిళ ఇంట్లో చొరబడి తుపాకీతో బెదిరించి నాలుగు బంగారు గాజులు, నానుతాడును దోచుకున్నారు. ఇలా వారిపై గుడ్లవల్లేరు, గుడివాడలలో ఒక్కొక్కటి చొప్పున, హనుమాన్ జంక్షన్, ముదినేపల్లిలో, మండవల్లి, అగిరిపల్లి, నూజీవీడులలో రెండు చొప్పున జిల్లాలో 12, ఇతర ప్రాంతాలలో కలిపి 20 కేసులు నమోదైనట్లు ఎస్పీ వివరించారు.
ఇక తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా వీరిపై కేసులు నమోదైనట్లు తెలిపారు. వారి నుంచి తుపాకీ, రూ.17 లక్షల విలువైన 250 గ్రాముల బంగారు నగదు, రెండు కార్లు, నాలుగు ద్విచక్ర వాహనాలు, రూ.51 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కాగా, నిందితులను అరెస్టు చేయడంలో తీవ్రంగా కృషి చేసిన క్రైమ్ సీఐ మురళీ కృష్ణ, రూరల్ సీఐ అబ్దుల్ నబీ, సీసీఎస్ ఎస్సై టీవీ వెంకటేశ్వరరావు, సిబ్బందిని అభినందించి రివార్డులు అందజేశారు. ఇలా నకిలీ పోలీసుల ముఠా చాలా ప్రాంతాల్లో జనాలను, వాహనదారులను బెదిరిస్తూ ఈ చోరీలకు పాల్పడుతున్నారు. ఇలా అంతరాష్ట్ర ముఠాలు తెలుగు రాష్ట్రాల్లో సంచరిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ముఠాపై ఇప్పటికే పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
ఇవీ చదవండి: ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పి సొరంగ మార్గాన్ని ఢీకొట్టిన రైలు.. 36 మంది మృతి.. 72 మందికి గాయాలు..!