Water War: కృష్ణా బోర్డుకు పోటాపోటీ లేఖలు.. ఏపీ తెలంగాణ ప్రభుత్వాల మధ్య మరోసారి జల జగడం..
రెండు తెలుగు రాష్ట్రా ప్రభుత్వాల మధ్య మరోసారి జల జగడం మొదలైంది. కృష్ణా బోర్డుకు పోటాపోటీ లేఖలు రాశాయి రెండు ప్రభుత్వాలు. శ్రీశైలం, నాగార్జునసాగర్ నీటి వాడకంపై ఒకరిపై తమ హక్కులను ప్రకటించుకున్నారు.
మొత్తం కృష్ణా జలాలలో ఏపీకి దాదాపు 200 టీఎంసీలు రావాలంటోంది ప్రభుత్వం. ప్రస్తుతం శ్రీశైలం నాగార్జునసాగర్లలో 148 టీఎంసీలు మాత్రమే ఉందని, అదంతా తమ నీరే అని వాదిస్తోంది ఆంధ్రప్రదేశ్. ఈ నీటిని రబీలో పంటలను రక్షించుకునేందుకు, తాగునీటి కోసం ఏపీకి విడుదల చేయాలని కృష్ణా బోర్డు చైర్మన్ శివ నందన్ కుమార్ కి నిన్న లేఖ రాశారు ఆ రాష్ట్ర ENC నారాయణరెడ్డి. ప్రస్తుతం శ్రీశైలం నాగార్జునసాగర్లలో ఉన్న నీటిని వాడుకోకుండా తెలంగాణను కట్టడి చేయాలని లేక కోరారు. ENC నారాయణరెడ్డి లేఖపై.. తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.
శ్రీశైలం, నాగార్జునసాగర్ ఉమ్మడి జలాశయాలలో కృష్ణానది జలాల వినియోగంలో ఏపీ అడ్డగోలుగా వ్యవహరిస్తుందని, కేటాయింపులకు మించి నీటిని వాడుకుంటుందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తూ కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు స్పందించాలని లేఖ రాసింది. 66.34 నిష్పత్తి ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 641.05 టీఎంసీలు, తెలంగాణ రాష్ట్రం 330.23 టీఎంసీల నీటిని ఉపయోగించుకోవలసి ఉన్నప్పటికీ ఏపీ ప్రభుత్వం అందుకు భిన్నంగా ఫిబ్రవరి 28 నాటికి 673.60 టీఎంసీల నీటిని ఉపయోగించుకుందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపించింది. నాగార్జునసాగర్ నుంచి ఏపీ ప్రభుత్వం నీళ్లను వినియోగించకుండా నిలువరించాలని వెంటనే ఆ రాష్ట్రానికి తగు ఆదేశాలు జారీ చేయాలని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ కు లేఖ రాశారు.
ఇటీవలే కృష్ణ బోర్డుకి తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేయడం, అంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం చేస్తూ నాగార్జునసాగర్, శ్రీశైలం ఉమ్మడి జలాశయాలలో తెలంగాణ ప్రభుత్వం కృష్ణ బోర్డు అనుమతి లేకుండా విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని, దానిని నిలువరించాలని ఏపీ ప్రభుత్వం కూడా కృష్ణ బోర్డుకు లేఖ రాసింది
ఇరు రాష్ట్రాల మధ్య నీళ్ళ పంచాయితీ పరిష్కారానికి కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ కానుంది. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య చోటు చేసుకున్న నదీ జలాల పంచాయితీని పరిష్కరించడం కోసం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు చెందిన త్రిసభ్య కమిటీ ఈనెల 13వ తేదీన జరిగే ఈ భేటీలో తేల్చ నుంది. రెండు రాష్ట్రాల నుంచి జల వనరుల శాఖ అధికారులు ఈ భేటీలో పాల్గొంటారు. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలపై చర్చించి.. ఆ తర్వాత త్రిసభ్య కమిటీలో నిర్ణయాలు తీసుకుంటారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం