
విద్యార్థులకు శ్రీ కనకదుర్గమ్మ తల్లి దేవస్థానం శుభవార్తను తెలిపింది. ఇంద్రకీలాద్రి పై కొలువైన కనకదుర్గమ్మ ఆలయంలో ఈనెల జనవరి 23వ తేదీన అమ్మవారు సరస్వతి దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు నిరంతరంగా శ్రీ సరస్వతి దేవి అలంకరణలో భక్తులు దర్శనం ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు.
దుర్గగుడిలో శ్రీ వసంతపంచమిని పురస్కరించుకొని.. జనవరి 23న కనకదుర్గమ్మ సరస్వతి దేవిగా దర్శనం ఇవ్వనున్నారు. ఆరోజు 500 మంది విద్యార్థులకు అక్షరాభ్యాసం నిర్వహించడానికి ఏర్పాట్లను దేవస్థానం చేపట్టింది. ఉదయం 6 నుంచి రాత్రి 7:00 వరకు విద్యార్థులకు ఉచిత దర్శనం కల్పిస్తామని ఆలయ ఈవో శ్రీనా నాయక్ తెలిపారు.
మహా మండపంలోని ఆరవ అంతస్తులో ఉత్సవ మూర్తి మూలవిరాట్‌ని సరస్వతి దేవిగా అలంకరిస్తారని పేర్కొన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన విద్యార్థులకు చిన్న లడ్డు ప్రసాదం, పెన్ను , అమ్మవారి శక్తి కంకణం , పాకెట్ సైజు ఫోటో అందజేస్తామని ఈవో తెలిపారు. అలాగే సోమవారం నుంచి ఫిబ్రవరి 17వ తేదీ వరకు మాఘమాసం సందర్భంగా సూర్యోపాసన సేవ ఉంటుందని పేర్కొన్నారు. ఆదివారాలు, ఏకాదశి పర్వదినాలలో సూర్యోపాసన సేవ ఉంటుందని, అర్జిత సేవ రుసుము 1000 రూపాయలు చెల్లించి భక్తులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు.