AP News: బ్యాంక్‌లో తనిఖీలు చేస్తుండగా.. తాకట్టు పెట్టిన గోల్డ్‌లో ఏదో తేడా.. చెక్ చేయగా.!

బ్యాంకులలో బంగారం తాకట్టు పెట్టి ఎంతోమంది తమ అవసరాలను తీర్చుకుంటూ ఉంటారు. అయితే దీనిని ఆసరాగా తీసుకుని బ్యాంక్‌లో పని చేసే కొంతమంది గోల్డ్ అప్రైజర్లు ఖాతాదారుల పేరు మీద నకిలీ బంగారాన్ని పెట్టి తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇదే కోవలో కస్టమర్ల పేరిట ఫేక్ గోల్డ్‌ను బ్యాంక్‌లో తనఖా పెట్టి కడప జిల్లా పొద్దుటూరులోని..

AP News: బ్యాంక్‌లో తనిఖీలు చేస్తుండగా.. తాకట్టు పెట్టిన గోల్డ్‌లో ఏదో తేడా.. చెక్ చేయగా.!
Gold Appraisal

Edited By:

Updated on: Nov 07, 2023 | 4:13 PM

కడప జిల్లా, నవంబర్ 7: బ్యాంకులలో బంగారం తాకట్టు పెట్టి ఎంతోమంది తమ అవసరాలను తీర్చుకుంటూ ఉంటారు. అయితే దీనిని ఆసరాగా తీసుకుని బ్యాంక్‌లో పని చేసే కొంతమంది గోల్డ్ అప్రైజర్లు ఖాతాదారుల పేరు మీద నకిలీ బంగారాన్ని పెట్టి తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇదే కోవలో కస్టమర్ల పేరిట ఫేక్ గోల్డ్‌ను బ్యాంక్‌లో తనఖా పెట్టి కడప జిల్లా పొద్దుటూరులోని శివాలయం బ్రాంచ్‌లో పని చేస్తోన్న ఓ గోల్డ్ అప్రైజర్ ఏకంగా రూ. 3 కోట్లకు పైగా ధనాన్ని స్వాహా చేశాడు. ఆలస్యంగా బయటపడిన ఈ సంఘటనతో ఉలిక్కిపడ్డ ఖాతాదారులు.. బ్యాంకు అధికారులను ఆశ్రయించారు. సదరు బ్యాంకు సిబ్బంది కూడా చేసేదేమిలేక పోలీసుల సహాయాన్ని కోరారు.

వివరాల్లోకి వెళ్తే.. కడప జిల్లా పొద్దుటూరు నగరంలోని శివాలయం ఎస్బీఐ బ్రాంచ్‌లో గోల్డ్ అప్రైజర్‌గా పని చేస్తున్న చంద్రమోహన్ అనే వ్యక్తి గత కొంతకాలంగా బ్యాంకు ఖాతాదారులకు తెలియకుండా వారి పేరు మీద నకిలీ బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి కోట్ల రూపాయలు స్వాహా చేశాడు. సుమారు 38 మంది ఖాతాదారుల పేర్లపై ఫేక్ గోల్డ్‌ తనఖా పెట్టి రూ. 3 కోట్లను కొల్లగొట్టాడు. ఈ విషయాన్ని గమనించిన కొంతమంది ఖాతాదారులు చంద్రమోహన్‌ను నిలదీయగా.. అసలు విషయం బయటపడింది. మొత్తం బ్యాంకులో ఉన్న బంగారం అంతా చెక్ చేయగా అందులో నకిలీ బంగారం ఉన్నట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. అది కూడా తమ బ్యాంకులో పనిచేస్తున్న చంద్రమోహన్ కొంతమంది ఖాతాదారుల పేరు మీద నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి డబ్బు స్వాహా చేసినట్లు కనిపెట్టారు. తీరా విషయం అంతా బయటపడే సమయానికి.. చంద్రమోహన్ కాస్తా పరారీలో ఉన్నాడు. దీంతో బ్యాంక్ సిబ్బంది చేసేదేమిలేక పొద్దుటూరు టూ-టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

గత కొంతకాలంగా ఖాతాదారుల పేరుపై నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి కోట్ల రూపాయలను చంద్రమోహన్ దండుకోవడం.. ఈ విషయాన్ని అధికారులు గుర్తించకపోవడం ఖాతాదారులను తీవ్ర అసహనానికి గురి చేసింది. బ్యాంకులో ఎంతో నమ్మకంతో బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకుంటామని.. అలాంటిది బ్యాంకులో పనిచేసే ఉద్యోగి తమ పేర్లపై ఫేక్ గోల్డ్‌ను తాకట్టు పెట్టి రుణం తీసుకుంటుంటే బ్యాంకు అధికారులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు ఖాతాదారులు. ఇప్పటికైనా గోల్డ్ అప్రైజర్ చంద్రమోహన్‌ను అదుపులోకి తీసుకుని తమ పేరుపై ఉన్న బ్యాంకు రుణాలను క్లియర్ చేయాలని అధికారులకు.. ఖాతాదారులు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..