Godavari: పోలవరానికి భారీగా వరద.. ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరికకు ఛాన్స్

|

Jul 13, 2022 | 8:38 PM

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు వాగులూ, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఫలితంగా నదుల్లో వరద ప్రవాహం ఎక్కవవుతోంది. వీటికి తోడు.. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు....

Godavari: పోలవరానికి భారీగా వరద.. ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరికకు ఛాన్స్
Polavaram
Follow us on

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు వాగులూ, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఫలితంగా నదుల్లో వరద ప్రవాహం ఎక్కవవుతోంది. వీటికి తోడు.. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరిలో (Godavari) భారీగా వరద వస్తోంది. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి ఉరకలేస్తోంది. ప్రాజెక్టు నుంచి ప్రస్తుతం 15 లక్షలకు పైగా క్యూసెక్కుల నీరు స్పిల్ వే ద్వారా బంగాళాఖాతం వైపు పరుగులు పెడుతోంది. భారీగా వస్తున్న వరదను దృష్టిలో ఉంచుకుని పోలవరం ప్రాజెక్టులోని 48 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా.. 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకునేలా పోలవరం (Polavaram) ప్రాజెక్టు స్పిల్ వే గేట్లను నిర్మించారు. ఒక్కో గేటును 16 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పుతో ఏర్పాటు చేశారు. వీటిని నియంత్రించేందుకు 96 హైడ్రాలిక్ సిలిండర్లు వినియోగంలో ఉన్నాయి. మరోవైపు.. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో గోదావరిలో వరద ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 15.07 లక్షల క్యూసెక్కులు ఉందని అధికారులు చెబుతున్నారు.

మరోవైపు.. గోదావరి నదీపాయలకు వరద నీరు పోటెత్తింది. దీంతో పది లంక గ్రామాలు వరద నీటి తాకిడికి గురయ్యాయి. గోగుల్లంక, భైరవలంక, కేసనకుర్రు, పొగాకు లంక, పల్లెగూడాల. కూనలంక, గురజాపులంక, కమిని, సలాదివారి పాలెం గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. ఇళ్ల మధ్య నుంచి నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో తాగేందుకు నీరు కూడా దొరకడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోదావరిలో పెరుగుతున్న వరద కారణంగా రేపు (గురువారం) ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..