Andhra Pradesh: ఏపీలో రహదారుల నిర్మాణానికి కొత్త టెక్నాలజీ.. సక్సెస్ అయితే రోడ్లకు మహర్దశే
వానోస్తే రోడ్లు డ్యామేజ్ అవుతాయి.. అస్తవ్యస్తంగా తయారవుతాయి.. వాహనదారులకి చుక్కలు చూపిస్తాయి.. ఇకపై అలా కాకుండా ఎఫ్‌డీఆర్ విధానాన్ని ఫాలో కాబోతుంది ఏపీ సర్కార్. ఈ సిస్టమ్ సక్సెస్ అయితే రహదారులకి మహర్దశే. ఇంతకీ ఏంటా టెక్నాలజీ?
AP News: చినుకు పడితే చిత్తడి. అది చిన్నదైనా పెద్దదైనా… రోడ్డంతా కొట్టుకుపోయి.. కంకర తేలి.. గుంటలుగా మారిపోతుంది. రోడ్లపై వెళ్లే వాహనదారులకి నరకయాతన. రహదారుల విధ్వంసంతో ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల నష్టం కూడా. రోడ్ల నిర్మాణంలో వినియోగిస్తున్న ముడిపదార్ధాలు లభ్యత తగ్గిపోయి.. అధిక వ్యయం అవుతున్న పరిస్థితి. ఈ క్రమంలో రోడ్లను రీసైక్లింగ్ చేయడం ద్వారా వనరుల కొరతతో పాటు వాటి జీవితకాలాన్ని పెంచాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. మనం ఇప్పటి వరకు తారు రోడ్లను చూసి ఉంటాం… సిమెంట్ రోడ్లను చూశాం.. కాని ఇపుడు కొత్త విధానంలో రోడ్ల నిర్మాణం అందుబాటులోకి వచ్చింది. అదే.. ఫుల్ డెప్త్ రిక్లమేషన్(Full-Depth Reclamation)పెర్ఫార్మెన్స్. ఈ విధానంలో పాత రోడ్డును యంత్రాల సాయంతో రెండు నుంచి మూడు అడుగుల లోతు తవ్వకాలు జరుపుతారు. ఆ తర్వాత సిమెంట్, కెమికల్‌తో మిక్స్ చేసి చదును చేస్తారు. ఆపై ఒకదానిపై మరొక లేయర్లను నిర్మిస్తారు. దీంతో రోడ్ల మన్నిక.. జీవితకాలం ఎక్కువ రోజులు ఉంటుందట. ఏలూరు జిల్లా(Eluru District)లో మొదటిసారిగా 7.6 కిలోమీటర్ల పొడవున 12.12 కోట్ల రూపాయల వ్యయంతో జర్మన్ టెక్నాలజీ రోడ్డు నిర్మాణం చివరదశకు చేరుకుంది. గోపాలపురం మండలం సగ్గొండ నుంచి తాళ్లపూడి మండలం గజ్జరం వరకు ఈ రోడ్ నిర్మాణం జరుగుతోంది. ఇవి సాధారణ రోడ్లు కంటే 15 నుంచి 20 ఏళ్లు చెక్కుచెదరకుండా ఉంటాయి. ఎఫ్‌డీఆర్ రోడ్ల నిర్మాణానికి భారీ యంత్ర పరికరాల అవసరం ఉంటుంది. ప్రస్తుతానికి దేశంలో ఇలాంటి బాహుబలి మెషిన్లు 60కి మించి లేవు. అతికష్టం మీద ఒకే ఒక్క యంత్రాన్ని ఇక్కడకి రప్పించారు. మ్యాన్ పవర్ తక్కువగా ఉండటంతో పాటు ఖర్చు చాలా తగ్గుతుంది. ఎఫ్‌డీఆర్ సిస్టమ్ చాలా చోట్ల సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుందన్నారు రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్.
ఈ తరహా రోడ్ల నిర్మాణంతో పర్యవరణానికి మేలు
సముద్ర తీరం ప్రాంతాల్లో రోడ్లు నిర్మించాలంటే ముడిసరుకుల రవాణాకే ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి ఉంటుంది. పైగా ఈ విధానంలో రోడ్లు నిర్మిస్తే పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. రాబోయే రోజుల్లో వంద కిలోమీటర్ల మేర ఈ తరహా రోడ్లు వేయాలని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇకపై రోడ్లకు మహర్ధశ అనే చెప్పాలి. ఖర్చు తక్కువ కదా అని రోడ్డు నాణ్యత విషయంలో అధికారులు ఎక్కడా రాజీ పడటం లేదు. నల్ల రేగటి భూములు ఎక్కువగా ఉండే గోదావరి జిల్లాలు, డెల్టా ప్రాంతాలకు ఈ టెక్నాలజీ వరంగా మారబోతుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..