AP Rains: ఏపీకి వర్ష గండం.. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఈ జిల్లాలకు
వాతావరణశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న అల్పపీడనమే కాకుండా… సోమవారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ ప్రభావంతో మరో 3 రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆ వివరాలు ఇలా..

ఏపీకి వచ్చే మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం వాయువ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అలాగే చత్తీస్గడ్ పరిసర ప్రాంతాల్లో మరో అల్పపీడనం కొనసాగుతోంది. అటు అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. బికనేర్ నుంచి కళింగపట్నం మీదుగా బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో మూడు రోజులపాటు కోస్తాలో చెదురు మదురు నుంచి భారీ వర్షాలు.. కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంది. అటు రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవనున్నాయి. ఎల్లుండి మంగళవారం వరకు సముద్రంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. ఆదివారం అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు.. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, కోనసీమ,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు.. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయ్.
ఇక తెలంగాణ విషయానికొస్తే.. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. 7 జిల్లాలకు రెడ్, 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 17 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. హనుమకొండ, మహబూబాబాద్, ములుగు,వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, మెదక్, నల్గొండ నిజామాబాద్, సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్ భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.
