గుంటూరు నగరంలో కరోనా పాటు ఇతర కారణాలతో మరణించిన వారి మృతదేహాలకు.. ఉచితంగా అంత్యక్రియలు జరపాలని నగరపాలక సంస్థ నిర్ణయించింది. మే 11 నుంచి నగరంలోని 7 హిందూ శ్మశాన వాటికల్లో అంత్యక్రియలు ఉచితంగా నిర్వహించనున్నట్లు నగర మేయర్ కావటి మనోహర నాయుడు వెల్లడించారు. ట్రస్టుల ఆధ్వర్యంలో నడిచే శ్మశానవాటికల్లో అంత్యక్రియలకు కార్పొరేషన్ తరపున రూ.3వేలు చెల్లించనున్నట్లు వివరించారు. ముస్లిం, క్రైస్తవ శ్మశానవాటికల్లోనూ ఉచితంగా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తామన్నారు.
అంత్యక్రియలకు అధిక మొత్తం వసూళ్లపై కంప్లైంటులు రావటంతో.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మేయర్ వివరించారు. కొరిటపాడు శ్మశాన వాటికలో అధిక వసూళ్లపై ఫిర్యాదులు అందినట్లు చెప్పారు. సంబంధిత కమిటీకి షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నట్లు చెప్పారు. వారి వివరణ అందాక తదుపరి చర్యలు ఉంటాయన్నారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల వారు గుంటూరు ఆసుపత్రుల్లో మరణిస్తుండటంతో.. ఇక్కడ శ్మశానాల్లో రద్దీ ఏర్పడిందని మున్సిపల్ కమిషనర్ అనురాధ వివరించారు. అవకాశంగా తీసుకుని కొందరు ఇష్టారాజ్యంగా వసూళ్లు చేస్తున్నట్లు చెప్పారు. అందుకే తాము నిర్దేశించిన ఫీజులు మాత్రమే వసూలు చేయాలని.. వాటికల నిర్వాహకుల్ని ఆదేశించినట్లు వెల్లడించారు. ఇకపై శ్మశానవాటికల్లో ఎలాంటి వసూళ్లు ఉండవని.. ఎవరైనా ఉల్లంఘిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తప్పవని హెచ్ఛరించారు. మృతుల బంధువులు.. నగరపాలక సంస్థ హెల్ప్ లైన్ నంబర్ల (91770 01859, 91770 01882) కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.
Also Read: లాక్డౌన్పై తెలంగాణ సర్కార్ పునరాలోచన.. మంగళవారం సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం!