
కృష్ణాజలాల్లో కలుషిత బూడిద అవశేషాలు కలుస్తున్నాయన్న ఆరోపణలతో మరోసారి ఎన్టీఆర్ జిల్లా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణాజలాలతో పచ్చగా ఉండాల్సిన నేల ఇప్పుడు బూడిద నీటి బాధతో బీభత్సంగా మారిపోయింది. ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం, జి.కొండూరు, రెడ్డిగూడెం, ఇబ్రహీంపట్నం మండలాలు, కొండపల్లి మున్సిపాలిటీ, తిరువూరు నియోజకవర్గంలోని ఎ.కొండూరు మండలాలు కలిపి మొత్తం 143 గ్రామాలు ఇప్పటికీ అదే బూడిద నీరే తాగుతున్నాయి.
ఎన్టీటీపీఎస్ నుంచి వెలువడే బూడిద నీరు డ్రెయినేజీ ద్వారా నేరుగా కృష్ణా నదిలో కలుస్తోందని స్థానికులు చెబుతున్నారు.. అదే నీరు తిరిగి గ్రామాల ఫిల్టర్ బెడ్స్‌కి చేరుతోంది. ప్రజలు తాగేది నీరే అయినా, ఆ నీటిలో కలిసినది బూడిద అవశేషాలే. ఈ నీళ్లను చూసి భయమేస్తుంది. పిల్లలకి చర్మ వ్యాధులు వస్తున్నాయి. వాసన భరించలేకపోతున్నాం… తాగకపోతే దాహం, తాగితే వ్యాధి అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారుల పరిశీలించారు… కానీ పరిస్థితి మాత్రం మారలేదు. కొద్ది రోజుల క్రితం కలెక్టర్ ఆదేశాలతో విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య పరిశీలించారు. బూడిద నీరు పంప్ హౌస్ వద్ద కలుస్తోందని ప్రత్యక్షంగా చూశారు… పంప్ హౌస్‌ను ఎగువ వైపున మార్చాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రజల్లో ఆశ కలిగింది.. ఇకనైనా సమస్య తీరుతుంది అని. కానీ నెలలు గడిచాయి. కానీ పరిస్థితి మాత్రం మారలేదు.
ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్టు క్లియర్‌గా కనిపిస్తుంది. అధికారులు మాత్రం మౌనంగా ఉన్నారు. చర్మ వ్యాధులు, కడుపు సమస్యలు, నీటి వాసనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయినా అధికారులు మాత్రం మౌనం వహిస్తున్నారు. ప్రతి సారి ఫిర్యాదులు, వాగ్దానాలు, ఆపై మళ్లీ అదే నిర్లక్ష్యం. ప్రజలు బూడిద నీరు తాగుతున్నారు… ఇది నిర్లక్ష్యం కాదు, నేరం అని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..