Elephants Attack: అన్నమయ్య జిల్లాలో ఏనుగుల బీభత్సం.. ముగ్గురు భక్తులు మృతి! మృతులకు రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ.5 లక్షల ఆర్ధిక సాయం

అన్నమయ్య జిల్లాలో ఓబులవారిపల్లె మండలం గుండాలకోన వద్ద ఏనుగుల గుంపు భక్తులపై మూకుమ్మడిగా దాడి చేశాయి. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. శివరాత్రి సందర్భంగా ఆలయానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఏనుగుల దాడి ఘటనలో గాయపడినవారిని స్థానికులు తిరుపతి దవాఖానకు తరలించారు..

Elephants Attack: అన్నమయ్య జిల్లాలో ఏనుగుల బీభత్సం.. ముగ్గురు భక్తులు మృతి! మృతులకు రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ.5 లక్షల ఆర్ధిక సాయం
Elephants Attack In Annamayya District

Updated on: Feb 25, 2025 | 11:07 AM

ఓబులవారిపల్లె, ఫిబ్రవరి 25: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాలో ఏనుగుల బీభత్సం సృష్టించాయి. ఓబులవారిపల్లె మండలం గుండాలకోన వద్ద భక్తులపై మూకుమ్మడిగా దాడి చేశాయి. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు తీవ్రంగా గాయడపి అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. శివరాత్రి సందర్భంగా ఆలయానికి వెళ్తుండగా ఏనుగులు దాడికి పాల్పడ్డాయి. బాధితులంతా రైల్వే కోడూరు మండలం ఉర్లగడ్డపోడుకు చెందిన భక్తులుగా గుర్తించారు. ఏనుగుల దాడి ఘటనలో గాయపడినవారిని స్థానికులు దవాఖానకు తరలించారు.

అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం వై కోట సమీపం గుండాల కోనలోని శివాలయం స్థానికంగా చాలా ప్రసిద్ధి. యేటా ఇక్కడికి శివభక్తులు వస్తుంటారు. బుధవారం శివరాత్రి కావడంతో గుండాల కోన అటవీ ప్రాంతం గుండా 14 మంది శివ భక్తులు సోమవారం రాత్రి దర్శనానికి కాలి నడకన బయలుదేరి వెళ్లారు. అయితే మార్గం మధ్యలో ఏనుగుల గుంపు దాడి చేసింది. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు అక్కడికక్కడే మృతి చెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి. గుండాల కోన నుంచి తలకోన వెళుతుండగా ఏనుగులు దాడి చేశాయి. మృతులు ఉర్లగడ్డ పోడు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. దాడి నుంచి ఎనిమిది మంది భక్తులు ప్రాణాలతో బయటపడ్డారు. పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితిని పరిశీలిస్తున్నారు.

గుండాలకోనలో ఉన్న మల్లేశ్వరాలయంలో మహాశివరాత్రిని ఘనంగా జరుపుకుంటారు. మంగళవారం 5 వేల మందికి అన్నదానం జరగనుంది. ఈ నేపథ్యంలో ఆలయానికి వెళుతున్న వారిపై ఏనుగులు దాడి చేశాయి. గుండాల కోన అటవీ ప్రాంతంలో ఏనుగుల తొక్కిసలాటలో ముగ్గురు మృతి చెందిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకి రూ.10 లక్షలు, క్షతగాత్రులకి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా అటవీ ప్రాంతాల్లో ఉన్న అలయాలను దర్శించుకునే భక్తులకి తగిన భద్రత ఏర్పాట్లు చేయాలని సూచించారు. మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించి భరోసా ఇవ్వాలని ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీ అరవ శ్రీధర్ కు దిశానిర్దేశం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.