సొమ్ము కొట్టు.. స్పోర్ట్స్‌ సర్టిఫికెట్ల పట్టు.. ఆటలే ఆడని వారికి నేషనల్స్‌ ఆడినట్టు సర్టిఫికెట్ల జారీ!

ప్రకాశం జిల్లాలో ఏం జరుగుతుందో తెలుసుకుంటే చాలు మనకు పతకాలు ఎందుకు రావటం లేదో ఇట్టే అర్థమైపోతుంది. దేశానికి పతకాలు రాకపోవటానికి ప్రకాశం జిల్లాకు ఏం సంబంధమంటారా?

సొమ్ము కొట్టు.. స్పోర్ట్స్‌ సర్టిఫికెట్ల పట్టు.. ఆటలే ఆడని వారికి నేషనల్స్‌ ఆడినట్టు సర్టిఫికెట్ల జారీ!
Fake Sports Certificate
Follow us
Fairoz Baig

| Edited By: Balaraju Goud

Updated on: Aug 24, 2024 | 2:02 PM

ఇటీవల ముగిసిన ఒలింపిక్స్‌లో మన దేశానికి ఆశించిన స్థాయిలో పతకాలు రాలేదు. మన కన్నా చిన్న చిన్న దేశాలు బంగారు పతకాలు ఎగరేసుకుపోతుంటే, మనం ఒక్కటి కూడా సాధించలేకపోయాం. ఇలా ఎందుకు జరుగుతుంది? అని అందరూ మదనపడి ఉంటారు. ఇదేం రాకెట్‌ సైన్స్‌ కాదు. సులభంగా అర్థం కాకపోవటానికి.. ప్రకాశం జిల్లాలో ఏం జరుగుతుందో తెలుసుకుంటే చాలు మనకు పతకాలు ఎందుకు రావటం లేదో ఇట్టే అర్థమైపోతుంది. దేశానికి పతకాలు రాకపోవటానికి ప్రకాశం జిల్లాకు ఏం సంబంధమంటారా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే..!

వివిధ క్రీడల్లో రాణించాలనుకునే క్రీడాకారులను గుర్తించి, వారిని సాన పట్టి పతక విజేతలుగా మలచటానికి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్‌ అథారిటీని ఏర్పాటు చేసింది. ఏపీలో కూడా ఇలాగే స్పోర్ట్స్‌ అథారిటీ ఏళ్లుగా పనిచేస్తూ ఉంది. అన్ని విభాగాల్లాగే ఇందులోనూ అవినీతి తిష్ట వేసుకోవడంతో ఆశించిన లక్ష్యానికి ఆమడ దూరంలోనే ఆగిపోయింది. తాజాగా ప్రకాశం జిల్లాలో నకిలీ స్పోర్ట్స్‌ సర్టిఫికెట్ల దందా ఒకటి వెలుగు చూసింది. తీగ లాగితో డొంక కదులుతోంది.

అసలు ఆటలే ఆడని వారు కూడా నేషనల్స్‌ ఆడినట్టు సర్టిఫికెట్లు పుట్టిస్తున్నారని, తద్వారా కోట్లు వెనకేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్క ప్రకాశం జిల్లాలోనే గత పదేళ్లలో 3వందల బోగస్‌ సర్టిఫికెట్లు ఇచ్చినట్టు పలు క్రీడా సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ప్రకాశం జిల్లా సాఫ్ట్‌ బాల్‌ అసోసియేషన్‌లో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ పీఈటీ టీచర్‌ శాప్‌ అధికారులతో కుమ్మక్కై ఈ దందా సాగిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో సాఫ్ట్‌బాల్‌ క్రీడా సంఘం పేరుతో పీఈటీగా పనిచేస్తున్న ఓ వ్యక్తి నకిలీ సర్టిఫికెట్ల బాగోతానికి తెరలేపినట్టు ఫిర్యాదులు రావటంతో క్రీడాకారుల్లో కలకలం రేగింది. అసలు ఆట తెలియకపోయినా.. సాఫ్ట్‌ బాల్‌ క్రీడలో జాతీయస్థాయిలో పతకాలు సాధించినట్టు సర్టిఫికెట్లు సృష్టిస్తున్నారు. ఇందుకోసం లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారని బాధిత క్రీడాకారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. నకిలీ సర్టిఫికెట్లతో ఎంతో మంది ఉద్యోగాలు తెచ్చుకున్నారని ఆరోపించారు. ఈ బోగస్‌ సర్టిఫికెట్ల బాగోతంపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని వాపోతున్నారు. మరీ ముఖ్యంగా సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ సెక్రటరీ నిజమైన క్రీడాకారులకు అన్యాయం చేస్తున్నాడని, దీనిపై ప్రశ్నిస్తే తనపై ఫిర్యాదు చేసినందుకని సమాధానమిచ్చాడని మరికొందరు బాధితులు చెబుతున్నారు. సర్టిఫికెట్లు అమ్ముకుంటూ అర్హులకు అన్యాయం చేస్తున్నాడని మండిపడుతున్నారు.

అసోసియేషన్‌ సెక్రటరీ బొడ్డు సుబ్బారావు వల్లే తమకు స్పోర్ట్స్‌ కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలు రాకుండా పోయాయని మరొక బాధితుడు ఆరోపించారు. దీనిపై తాము హైకోర్టును కూడా ఆశ్రయించామని, ఎలాగైనా సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇలా జారీ చేసిన 3వందల బోగస్‌ సర్టిఫికెట్లలో 150 వరకూ ఎంబీబీఎస్‌లో స్పోర్ట్స్‌ కోటా కింద సీట్లు సాధించేందుకు అమ్ముకున్నారని అనుమానిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో తమ వద్ద ఉన్న ఆధారాలను జిల్లా కలెక్టర్‌, క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌లకు స్వయంగా కలిసి ఇచ్చామని బాధితులు చెప్పారు. దీనిపై స్పందించిన కలెక్టర్‌ విచారణకు ఆదేశించినట్టు తెలిపారు.

లోథా కమిటీ నిబంధనల మేరకు క్రీడా సంఘంలో సభ్యులుగా ఒకరు నాలుగు సంవత్సరాలు మాత్రమే ఉండాలి. వాళ్లు ప్రభుత్వ ఉద్యోగి అయితే.. ఆయన కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ కేవలం ఒకసారికి మించి కమిటీలో కొనసాగరాదు. కానీ నకిలీ ధృవీకరణ పత్రాల మంజూరులో కీలకంగా వ్యవహరించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బొడ్డు సుబ్బారావు 1999 నుంచి 2018 వరకు జిల్లా సాఫ్ట్ బాల్‌ అసోసియేషన్‌ ప్రతినిధిగా కొనసాగారు. అనంతరం కొన్ని సంవత్సరాల బాటు ఆయన కుటుంబ సభ్యులే ప్రతినిధులుగా వ్యవహరించారు. ప్రస్తుతం మళ్లీ ఆయనే అసోసియేషన్‌ జాయింట్‌ పెక్రటరీ పదవిలో కొనసాగుతున్నారు. క్రీడా సంఘాలు ఏర్పాటు చేసి పోటీలు పెట్టకుండానే నిర్వహించినట్టు చూపి క్రీడా సర్టిఫికెట్లు అమ్ముకున్నట్టు ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కానీ ఆయన మాత్రం తనకే పాపం తెలీదని, విచారించి తప్పు చేసినట్టయితే శిక్షించండని చెబుతున్నారు.

అసోసియేషన్‌ ప్రతినిధిగా ఉన్న గురుకుల పాఠశాల పీఈటీ కుమారుడు, కుమార్తె, మరో ఇద్దరు ఆయన బంధువులు ఇదే తరహా సర్టిఫికెట్లు పొంది ఎంబీబీఎస్‌ పూర్తి చేసి డాక్టర్లుగా పనిచేస్తున్న ఫిర్యాదులు కూడా ఉన్నాయి. అలాగే మరికొందరు దొంగ సర్టిఫికెట్లతో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు పొందినట్లు ఆరోపణలున్నాయి. ఈ సర్టిఫికెట్ల కుంభకోణం జిల్లాకే పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో సాఫ్ట్‌ బాల్‌ అసోసియేషన్‌ ప్రతినిధుల ఆధ్వర్యంలో నడిచినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు శాప్‌ ప్రతినిధులు కూడా సహకరించినట్టు పలువురు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం మొత్తం మీద విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకుంటామని రాష్ర్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి హామీ ఇచ్చారు.

కేవలం ఒక్క జిల్లాలోనే 3వందల మంది జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొన్నారని నకిలీ సర్టిఫికెట్లు పుట్టించి లబ్ది పొందారంటే.. ఇక దేశవ్యాప్తంగా స్పోర్ట్స్‌ విషయంలో ఎంత అవినీతి చోటు చేసుకుని ఉంటుందో ఊహించవచ్చు. నిజమైన క్రీడాకారులెందరో ఇలాంటి అవినీతికి బలైపోవడం వల్లే భారత్‌ పతకాల సాధనలో వెనకపడి ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..