Konaseema Row: కోనసీమలో ‘మరో బ్లోఅవుట్’.. చలి కాచుకుంటున్న రాజకీయ పార్టీలు..

| Edited By: Janardhan Veluru

May 25, 2022 | 5:21 PM

Amalapuram News: కోనసీమ సాధన సమితి పేరుతో నాలుగైదు రోజులుగా జరుగుతున్న ఆందోళనలు మంగళవారం ఉద్రిక్త పరిస్థితులకు కారణమయ్యాయి. అప్పటి వరకూ శాంతియుతంగా చేసిన ఆందోళనలు కాస్తా శృతిమించాయి.

Konaseema Row: కోనసీమలో ‘మరో బ్లోఅవుట్’.. చలి కాచుకుంటున్న రాజకీయ పార్టీలు..
Konaseema
Follow us on

Konaseema District Renaming Row: అప్పుడెప్పుడో ఇదే గోదావరి జిల్లాలో పాశర్లపూడిలో బ్లోఅవుట్ గురించి మనందరం వినే ఉంటాం…అప్పట్లో గ్యాస్ కోసం జరిపిన తవ్వకాల్లో భారీ బ్లోఅవుట్ చెలరేగింది. దాదాపు నెలరోజుల పాటు పచ్చని కొబ్బరిచెట్లు ఆ వేడికి విలవిల్లాడాయి. చివరికి అమెరికా నుంచి నిపుణులు వచ్చి ఆ బ్లోఅవుట్ ని చల్లార్చాల్సి వచ్చింది.. ఇన్నేళ్లకు అదే కోనసీమలో మళ్లీ బ్లోఅవుట్ చెలరేగింది. కాకపోతే ఇది గ్యాస్ లైన్ లోంచి కాదు.. జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడంతో జనాల్లోంచి ఈ బ్లోఅవుట్ ఉద్భవించింది. అప్పట్లో బ్లోఅవుట్ ను చల్లార్చడానికి వేరే దేశం నుంచి నిపుణులు వచ్చారు. కానీ ఈ బ్లోఅవుట్ ను చల్లార్చడానికి వచ్చే నిపుణులు ఎవరూ లేరు..అందరూ ఆ బ్లోఅవుట్ లో చలి కాచుకునేవారే..రాజకీయ పబ్బం గడుపుకునేవారే..

అమలాపురంలో ఎందుకీ ఆగ్రహ జ్వాలలు?

పచ్చని కోనసీమ అగ్నిగుండమైంది.. అందమైన అమలాపురంలో విధ్వంసం చెలరేగింది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఇక్కడ ఇళ్లు, బస్సులు తగులబెట్టారు..ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారు.. కారణం కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టడం. ఒక మంత్రి,ఎమ్మెల్యే ఇళ్లను పూర్తిగా తగులబెట్టేశారు. ఎంతో ప్రశాతంగా ఉండే అమలాపురంలో ఊహించని విధంగా అశాంతి ఏర్పడింది. ఆదరాభిమానాలకు పెట్టింది పేరైన కోనసీమ ప్రాంతంలో నాయకులకు నిరాదరణ ఎదురైంది. ఎవరినైనా సరే చిరునవ్వుతో పలకరించే కోనసీమ ప్రజల్లో ఇంతటి కోపం దాగుంటుందని ఎవరూ ఊహించి ఉండరు. ఇందులో రాజకీయ జోక్యం ఉందా..వెనుక ఉండి ఎవరైనా రెచ్చగొట్టారా.. కుట్ర కోణాలు ఉన్నాయా.. ఇవన్నీ విచారణలో తేలాల్సిన అంశాలు, కానీ ప్రజల భావోద్వేగాల వెనుక అసలు కారణాన్ని కూడా ప్రభుత్వం వెలికి తీయాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

అంబేద్కర్ పేరు పెడితే తగులబెట్టేస్తారా?

కోనసీమ సాధన సమితి పేరుతో నాలుగైదు రోజులుగా జరుగుతున్న ఆందోళనలు మంగళవారం ఉద్రిక్త పరిస్థితులకు కారణమయ్యాయి. అప్పటి వరకూ శాంతియుతంగా చేసిన ఆందోళనలు కాస్తా శృతిమించాయి. లాంగ్ మార్చ్ పేరుతో కోనసీమ సాధన సమితి పిలుపునిచ్చింది. మంగళవారం సాయంత్రం అమలాపురం గడియారం సెంటర్ కు చేరుకోవాలని యువకులంతా సోషల్ మీడియా, వాట్సాప్ లలో షేర్ చేసుకున్నారు. అలా అలా ఏకంగా కొన్నివేల మంది అక్కడికి చేరుకున్నారు. అయితే అంతకుముందు మాదిరిగానే ర్యాలీ చేసి పరిసమాప్తం చేస్తారనుకున్నారు. గడియరా స్తంభం దగ్గర మొదలైన ర్యాలీ కలెక్టర్ దగ్గరకు చేరుకునేప్పటికి పూర్తిగా సీన్ మారిపోయింది. వినతిపత్రం ఇవ్వడానికి కలెక్టరేట్ లోపలికి అనుమతించాలని యువకులు కోరారు. అయితే ఇరవైమందికి అనుమతిచ్చారు పోలీసులు. అయితే ఇంకా ఎక్కువమందిని పంపాలని వాళ్లు కోరడం పోలీసులు నిరాకరించడం అక్కడే వాగ్వాదం చెలరేగడం, ఆ తర్వాత తోపులాట తర్వాత గలాటా..మొదలయ్యాయి. ఇక అక్కడి నుంచి ఆపడం ఎవరి వల్లా కాలేదు. తీవ్ర ఉద్రేకంలో ఉన్న యువత పోలీసులపై రాళ్ల దాడి చేశారు. ఏకంగా ఎస్పీ సుబ్బారెడ్డి టార్గెట్ గా రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో ఎస్పీ సహా పోలీసుల్లో చాలామందికి గాయాలయ్యాయి. ఆ తర్వాత అక్కడి నుంచి ఆందోళనకారులు ముందుగా ఇంజినీరింగ్ బస్సులపై దాడికి తెగబడి నిప్పుపెట్టారు. ఇక్కడే అల్లరిమూక ఎంటరైంది. బస్సులతో మొదలైన విధ్వంసం కాస్తా మంత్రి విశ్వరూప్ ఇంటికి మళ్లింది. ఒక్కసారిగా దూసుకెళ్లిన ఆందోళనకారులు విశ్వరూప్ ఇంటిని ధ్వంసం చేశారు..నిప్పు పెట్టారు.. సరిగ్గా వాళ్లందరూ దూసుకొస్తున్న సమయంలోనే మంత్రి విశ్వరూప్ ను ఇంటి నుంచి బయటకు తరలించారు పోలీసులు. అయితే ఇంట్లో మహిళలు, పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంటిపై దాడి చేస్తారని ఎవరూ ఊహించలేదు.. అయితే అనూహ్యంగా పెట్రోల్ బాటిళ్లతో సహా విరుచుకుపడి నిప్పు పెట్టడంతో పోలీసులు విశ్వరూప్ బార్య, పిల్లలను ప్రమాదకరపరిస్థితుల్లో ఇంట్లోంచి బయటకు తీసుకొచ్చి వేరే చోటికి తరలించారు.

ఆ తర్వాత ముమ్మిడి వరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటిపై అల్లరిమూకలు దాడికి తెగబడ్డారు. ఆ సమయంలో ఆయన ఇంట్లోనే ఉన్నారు. ఆందోళనకారులు ఇంటికి నిప్పు పెట్టిన సమయంలోనే పొన్నాడ సతీష్ ను ఇంట్లోంచి కారులో బయటకు తరలించారు. ఆ తర్వాత విశ్వరూప్ కు చెందిన కొత్తగా నిర్మిస్తున్న మరో ఇంటికి నిప్పు పెట్టారు. ఇక రోడ్డు మీద వెళ్తున్న నాలుగు ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేసి నిప్పు పెట్టారు.ఈ ఘటనతో అమలాపురంలో ప్రజలంతా గజగజా వణికిపోయారు. ఎప్పుడు ఏం జరుగుతుందోననే టెన్షన్ తో ఇళ్లకు లోపల గడియలు పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కూర్చుకున్నారు.

Amalapuram Violence

అప్పుడు తుని ఇప్పుడు అమలాపురం..

అన్ని జిల్లాలతో పాటు ఈ జిల్లాలో అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పేరు పెట్టి ఉంటే బహుశా ఇంతలా వివాదం చెలరేగి ఉండేది కాదేమో.. ఏప్రిల్ 2న ప్రకటించిన జాబితాలో ఈ పేరు లేదు అల్లూరి, ఎన్టీఆర్, సత్యసాయి, అన్నమయ్యల పేర్లు జిల్లాలకు పెట్టినప్పుడే ఇది కూడా పెట్టి ఉంటే పెద్దగా పట్టించుకునే వారు కాదేమో.. అయితే అనూహ్యంగా సడెన్ గా అంబేద్కర్ పేరు ఎనౌన్స్ చేయడంతో అక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోయారు.. అది ఆగ్రహజ్వాలలా మారి చివరికి విధ్వంసం స్థాయికి తీసుకొచ్చింది.అప్పట్లో కాపు ఉద్యమం చెలరేగినపుడు తునిలో బహిరంగ సభ పూర్తయ్యాక ఒక్కసారిగా జనం రైల్వే ట్రాక్ పైకి దూసుకెళ్లారు.. అటుగా వెళ్తున్న ట్రైన్ ను నిలిపివేసి తగులబెట్టారు..ఆ తర్వాత తుని పోలీస్ స్టేషన్ పై దాడికి పాల్పడి నిప్పు పెట్టారు.. అప్పటి తుని ఘటనను తలపించేలా ఇప్పుడు అమలాపురం ఘటన కనిపిస్తోంది..అప్పుడు కుల అంశమే వివాదానికి కారణం.ఇప్పుడూ కులం అంశమే వివాదానికి కారణం..అయితే అప్పుడు పూర్తి స్థాయిలో కాపు ఉద్యమం న డుస్తోంది మరి ఇక్కడ అంబేద్కర్ పేరుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నది ఏ కులం అన్నది క్లారిటీ రాలేదు..

ఎందుకీ కుల రచ్చ..

గోదావరి జిల్లాల్లో దళితులకు , అగ్రకులమైన కాపులకు చాలా కాలం నుంచి విబేధాలున్నాయి.. వివాదాలున్నాయి.. పర్టిక్యులర్ గా దళితుల శిరోముండనం చేయించిన కేసులో కాపు కులానికి చెందిన మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులపై ఆరోపణలున్నాయి. ఆ కేసు ఇప్పటికీ నడుస్తోంది. ఇలాంటి ఘటనలు దళితులకు కాపులకు మధ్య గ్యా ప్ ను మరింత పెంచాయి. గత ముప్పై ఏళ్లలో రాజకీయంగా ఈ ప్రాంతంలో కులాన్ని అడ్డుబెట్టుకుని చాలామంది రాజకీయాల్లో ఎదిగారు. రాజకీయ పార్టీలు కూడా ఈ కుల చిచ్చుపై పెట్రోల్ పోసి మరింత పెంచారే తప్ప చల్లార్చే ప్రయత్నాలు చేయలేదు. తాము ఎదగడం కోసం అటు దళితుల్ని,ఇటు కాపుల్ని అడ్డుపెట్టుకున్నారు. కోనసీమ జిల్లా పేరు మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత కేవలం కాపులు మాత్రమే ఆందోళనలు చేయలేదు. కాపులతో పాటు బీసీలు రంగంలోకి దిగారు. మంగళవారం వీధుల్లోకి వచ్చిన వేలాదమందిలో కాపు కులంతో పాటు బీసీ కులాలకు చెందినవారు అనేకమంది ఉన్నారు.

Konaseema Tensions

రాజకీయ పార్టీల జోక్యం ఎంత?

సహజంగానే ఒక ఘటన జరిగితే దానిపై రాజకీయ పార్టీలు ఒకరిపై మరొకరు బురదజల్లుకోవడం సహజమే.. ఇక్కడ అధికారపార్టీపై ప్రతిపక్షం ,ప్రతిక్షంపై అధికార పక్షం ఇప్పుడు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి.ఇదంతా ప్రభుత్వమే కావాలని దళితుల్లో సింపతీ క్రియేట్ చేసుకోవడం కోసమే దాడులు చేయించిందని టీడీపీ ఆరోపిస్తే కాదు.. ఇదంతా కావాలనే చంద్రబాబే చేయించారనేది అధికార పక్షం ఆరోపణ.. మధ్యలో పవన్ కల్యాణ్ పేరును లాగారు. అంటే అక్కడ కాపులుఎక్కువగా ఉంటారు కాబట్టి అదే సామాజికవర్గానికి చెందిన పవన్ కల్యాణ్ పార్టీ జనసేనే ,టీడీపీతో కలిసి ఇదంతా చేయించిందనేది ప్రభుత్వవాదన. అసలు దాడికి పాల్పడింది ఎవరో తెలీదు కానీ…ఇప్పుడు ఒకరిపై మరొకరు చేసుకుంటున్న ఆరోపణలు చూస్తుంటే మాత్రం ఇదంతా రాజకీయ పబ్బం గడుపుకోవడానికి చేస్తున్నవే అని మాత్రం స్పష్టంగా జనాలకు అర్థమవుతోంది. అమలాపురం లో చెలరేగిన విధ్వంసంలో, మంటల్లోంచి ఓట్లను ఏరుకునే పనిలో అన్ని రాజకీయ పార్టీలు పడ్డాయి. అసలు సమస్య ఏంటి దానికి పరిష్కారం ఏంటనేది వదిలేసి తిట్టుకోవడం మొదలుపెట్టాయి. ఇంకోసారి అమలాపురంలో ఇలాంటి ఘటన జరగకుండా ఏం చేయాలనేదానిపై ఎక్కడా ఆలోచన కనిపించడం లేదు. అప్పుడు తునిలో రైలు తగులబెట్టిన ఘటనలో ఇప్పటికీ రైల్వే కేసుల్లో చిక్కుకుని కోర్టుల చుట్టూ యువకులు తిరుగుతూనే ఉన్నారు. ఇక్కడి పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను వైసీపీ ప్రభుత్వం తొలగించినప్పటికీ రైల్వే పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులనుంచి మాత్రం తప్పించుకోలేకపోయారు. ఇప్పుడు కూడా అనేకమందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

Konaseema

ఎవరికెంత లాభం..?

పోనీ ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణల ప్రకారం ఈ ఘటన అధికారపార్టీయే చేయించిందనుకుందాం.. కానీ ఇది ఊహాతీతమే కదా..స్వయంగా సొంతపార్టీ ఎమ్మెల్యే, మంత్రి ఇంటికి ప్రభుత్వం నిప్పు పెట్టిస్తుందా..? అది సాధ్యమేనా..? పోనీ ఇదంతా స్క్రీన్ ప్లే అనుకుందాం..ఎందుకు..దానివల్ల ప్రభుత్వానికి వచ్చే అదనపు ప్రయోజనమేంటి..అనేది కూడా చర్చించాలి..పోనీ అంబేద్కర్ పేరు కోసం దళితులవైపు ప్రభుత్వం నిలబడిందే అనుకుందాం..మరి కాపు,శెట్టిబలిజ, బీసీ, ఓసీల ఓట్లు ప్రభుత్వానికి అక్కర్లేదా..కేవలం దళిత ఓట్ల కోసమే ఇదంతా చేస్తే ఆ ఓట్లతో అక్కడ విజయం సాధించడం సాధ్యమేనా.. కానేకాదు పోనీ ప్రభుత్వ ఆరోపణ ప్రకారం ఇదంతా టీడీపీ, జనసేన కావాలని చేయించాయనుకుందాం.. అలా చేస్తే ఆ రెండు పార్టీలకు కొత్తగా ఒనగూరే ప్రయోజనాలేంటి.. మెజారిటీ కులాలైన కాపు, శెట్టిబలిజ ఓట్లలో దాదాపు సింహభాగం గత ఎన్నికల్లో జనసేకు పడ్డాయి..ఆ పార్టీ గెలవకపోవచ్చుకానీ గోదావరి జిల్లాల్లో కాపుల్లో ఎక్కువభాగం జనసేనకు, టీడీపీ కి వేశారు. వైసీపీకి సీట్లు వచ్చి ఉండొచ్చుగానీ అందులో కాపు ఓట్ల శాతం తక్కువే.మరి అలాంటప్పుడు కొత్తగా కాపు ఓట్ల కోసం టీడీపీ,జనసేన పాకులాడాల్సిన అవసరం లేనేలేదు. అలాగే ఈ పేరు బూచిగా చూపి అక్కడ ఎన్నికల్లో తీవ్ర ప్రభావాన్ని చూపే దళిత ఓట్లను వదులుకునే సాహసం టీడీపీ,జనసేన ఎట్టిపరిస్తితుల్లోనూ చేయవు.. అందువల్ల అటు అధికారపక్షంగానీ, ఇటు ప్రతిపక్షాలు గానీ ఇలాంటి చర్యలకు ఎట్టిపరిస్తితుల్లోనూ పాల్పడే అవకాశం లేనే లేదు.ఇదంతా బావోద్వేగాల్లోంచి పుట్టిన ఆగ్రహ జ్వాలలే గానీ కుట్రపూరితంగా జరిగిన విధ్వంసాలు కాకపోవచ్చనేది పొలిటికల్ విశ్లేషకులు చెబుతున్నమాట. మరి పోలీసులు ఏం తేలుస్తారో వేచిచూడాల్సిందే.

-అశోక్ వేముపల్లి, డిప్యూటీ ఇన్ పుట్ ఎడిటర్, టీవీ9

మరిన్ని ఏపీ వార్తలు చదవండి..