సింహం పరిగెత్తించి, వేటాడి, వెంటపడి చంపుతుంది. అదే కొండచిలువ ఉక్కిరిబిక్కిరి చేసి, కండరాలను బిగపట్టి, దాని శరీరానికి చిక్కిన ప్రాణికి ఎముకలు విరిగిపోయేలా మెలిపెట్టి చంపేస్తుంది. తర్వాత దాన్ని ఏకమొత్తంగా మింగేస్తుంది. తాజాగా ఆకలితో వచ్చిన కొండచిలువ మేకను చుట్టేసింది. కానీ స్ధానికులు కంటబడి ప్రాణాలు పోగొట్టుకుంది. ఏలూరు జిల్లాలో జరిగింది ఈఘటన. ఓ భారీ కొండచిలువ ఆహారం కోసం వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. స్థానికుల కంటబడటంతో కర్రలు, గుణపాలతో దాన్ని కొట్టి చంపారు. అది చనిపోవటంతో అక్కడ నివసిస్తున్న స్థానికులు సైతం ఊపిరి పీల్చుకున్నారు. కొండచిలువ కారణంగా ఓ మేకల కాపరికి నష్టంవాటిల్లింది. ఇంతకీ ఆ కొండచిలువ దేన్నీ ఆహారంగా తీసుకోవడానికి వెళ్ళింది. ఎందుకు దాని ప్రాణాలు పోగొట్టుకుంది. ఆ కాపరికి జరిగిన నష్టం ఏమిటి.. ఇప్పుడు తెలుసుకుందాం.
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల వసంత నగర్ కాలనీలో ఓ మేకల కాపరి తన మందతో కలిసి జీవిస్తున్నాడు. తన మేకల మందలను కాలనీ శివారులో ఉన్న పచ్చికబయళ్ళలో మేపుతూ ఉంటాడు. ప్రతిరోజు లాగానే బుధవారం కూడా తన మేకల మందలను తోలుకొని పచ్చిక బయళ్ళ వద్దకు వెళ్ళాడు. అయితే ఆ మేకల మంద అక్కడే తిరుగుతూ మేతమేస్తున్నాయి. ఈలోగా అక్కడే పొదలలో దాగివున్న ఓ భారీ కొండచిలువ మేకల మందల రాకని గమనించింది. తనకు ఆహారం దొరికిందని సంతోషించింది. కళ్ళెదుటే ఉన్న మందలో ఓ మేకను పట్టుకొని తన శరీరంతో గట్టిగా చుట్టుకుని ఆ మేకను ఊపిరాడకుండా చేసి చంపేసింది. ఇంకేముంది ఇక హాయిగా చంపిన మేకను ఆరగించడానికి సిద్ధమైంది. చనిపోయిన మేకను తన నోటితో మెల్లగా మింగడం ప్రారంభించింది. అయితే తోటి మేక చనిపోవడంతో మందలోని ఇతర మేకలు భయంతో బిగ్గరగా అరవడం మొదలెట్టాయి. మేకల అరుపులు విన్న ఆ కాపరి ఎందుకు అరుస్తున్నాయా అని వాటి వద్దకు వచ్చి చూసి షాక్ కి గురయ్యాడు. ఆ దృశ్యం చూడగానే కాపరికి భయంతో ఒళ్లంతా చెమటలు పట్టాయి. దాంతో బిగ్గరగా కేకలు వేశాడు. కాపరి కేకలు విన్న స్థానిక యువకులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే కర్రలు, ఇనుప గుణపాల సహాయంతో కొండచిలువను కొట్టి చంపారు.
అయితే తనకు జీవనోపాధి అయిన మేక చనిపోవడంతో కాపరి కి నష్టం జరిగింది. మరో పక్క భారీ కొండచిలువ హతమవడంతో చుట్టుపక్కల స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..