అమ్మ బాబోయ్..! ఊర్లపై పడ్డ ఏనుగుల గుంపు.. భయంతో వణికిపోతున్న మన్యం జనం..!

పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం కొనసాగుతోంది. ‎కొమరాడ మండలం కుమ్మరిగుంటలో సంచరిస్తూ, ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. పంట పొలాల్లోకి ప్రవేశించి వాణిజ్య పంటలను నాశనం చేస్తున్నాయి. ఏనుగుల గుంపు కారణంగా టమాటా, పామాయిల్‌, కూరగాయల పంటలు ధ్వంసమయ్యాయి. నెలల తరబడి కష్టపడి పండించిన పంటలు ఏనుగుల కారణంగా నేలపాలవుతున్నాయని రైతులు వాపోతున్నారు రైతులు.

అమ్మ బాబోయ్..! ఊర్లపై పడ్డ ఏనుగుల గుంపు.. భయంతో వణికిపోతున్న మన్యం జనం..!
Elephants Damage Crops

Edited By:

Updated on: Jan 10, 2026 | 8:56 PM

పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం కొనసాగుతోంది. ‎కొమరాడ మండలం కుమ్మరిగుంటలో సంచరిస్తూ, ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. పంట పొలాల్లోకి ప్రవేశించి వాణిజ్య పంటలను నాశనం చేస్తున్నాయి. ఏనుగుల గుంపు కారణంగా టమాటా, పామాయిల్‌, కూరగాయల పంటలు ధ్వంసమయ్యాయి. నెలల తరబడి కష్టపడి పండించిన పంటలు ఏనుగుల కారణంగా నేలపాలవుతున్నాయని రైతులు వాపోతున్నారు రైతులు. తక్షణమే ఏనుగుల గుంపును అటవీ ప్రాంతంలోకి తరలించాలని కోరుతున్నారు.

రాత్రి వేళల్లో అడవుల నుంచి బయలుదేరుతున్న ఏనుగుల గుంపు, పొలాల్లోకి చొరబడి పంటలను నాశనం చేస్తున్నాయి. ఏనుగుల దెబ్బకు టమాటా తోటలు, ఆనపకాయ తీగలు, ఏళ్ల తరబడి శ్రమపడి పెంచిన పామాయిల్ మొక్కలు నేలమట్టమయ్యాయి. కొన్నిచోట్ల పంటలతో పాటు నీటి పైపులు, కంచెలు కూడా ధ్వంసమయ్యాయి. రాత్రి వేళ పొలాలకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో పాటు ఏనుగుల దాడి భయంతో గ్రామస్తులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఇప్పటికే సాగు ఖర్చులు, అప్పులతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఈ ఏనుగుల దాడులు మరింత కష్టాలను తెచ్చిపెట్టాయి.

ఏనుగులు గ్రామాల్లోకి రాకుండా కంచెలు ఏర్పాటు చేయాలని, సోలార్ ఫెన్సింగ్, ట్రెంచ్‌ల నిర్మాణం చేయాలని, నష్టపరిహారం వెంటనే అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కొన్నాళ్లుగా కొనసాగుతున్న ఏనుగుల దాడిలో ఇప్పటివరకు పదిమందికి పైగా చనిపోగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. సుమారు పదేళ్ల క్రితం ఒడిశాలోని లఖేరి అటవీ ప్రాంతం నుంచి మన్యం జిల్లాకు వచ్చిన ఏనుగుల గుంపు అప్పటి నుండి ఇక్కడే సంచరిస్తున్నాయి. మొక్కజొన్నతో పాటు ఇతర ఆహార పంటలు అందుబాటులో ఉండడం, నాగావళిలో పుష్కలంగా నీరు ఉండడంతో అవి ఇక్కడే తిష్ట వేశాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని అటవీ శాఖను రైతులు వేడుకుంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..