విశాఖపట్నం, డిసెంబర్27; విశాఖలో ఓ అధికారి.. వినియోగదారుడి అవసరాన్ని ఆసరాగా చేసుకున్నాడు. విద్యుత్ మీటర్ల కోసమని వెళ్తే.. వినియోగదారుని విసిగించాడు. కొద్దిరోజులు చుట్టూ తిప్పుకున్నాడు. చివరకు అసలు విషయాన్ని మెల్లగా చెప్పాడు. పని చేయాలంటే.. కాస్త తన వైపు చూడాలని చెప్పుకొచ్చాడు. ససేమిరా అంటే.. పని పెండింగ్ అయిపోతుందని పరోక్షంగా హెచ్చరిస్తూ.. స్పాట్ ఫిక్స్ చేసి అక్కడకు వచ్చేయమన్నాడు. చివరకు…
– విశాఖలోని అక్కయ్యపాలెం కు చెందిన నరవ సూర్య ప్రకాష్, అతని ముగ్గురు సోదరులకు చెందిన నాలుగు ఇళ్ల ప్లాట్లకు సంబంధించి ఎలక్ట్రికల్ మీటర్ల కోసం విద్యుత్ ఆఫీస్ కి వెళ్లారు. మీటర్ల జారీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. తనిఖీలకు వెళ్లిన APEPDCL దొండపర్తి సెక్షన్ అసిస్టెంట్ ఇంజనీర్ సురేష్.. అక్కడ ట్రాన్స్ఫార్మర్ కూడా వేసుకోవాలని సూచించాడు. సరే అని వినియోగదారులు చెప్పేసరికి.. మీటర్లు మంజూరు చేయాలంటే.. చేయి తడపాలని అసిస్టెంట్ ఇంజనీర్ సురేష్ సంకేతాలు ఇచ్చాడు. కస్టమర్ల అవసరాన్ని ఆసరాగా చేసుకొని.. 80వేలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు ఏఈ సురేష్ కుమార్.
అలా చిక్కాడు..
– లంచం ఇవ్వడం ఇష్టం లేకపోవడంతో బాదితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న ఏసీబీ అధికారులు.. కాపు కాశారు. ఆఫీస్ దగ్గరైతే అందరికి తెలిసిపోతుందనుకునో.. లేక మరే అనుమానం వచ్చిందో ఏమోగానీ.. రైల్వే DRM ఆఫీస్ ప్రవేశ ద్వారం దగ్గర ప్లేస్ సెట్ చేసుకున్నాడు ఏఈ సురేష్ కుమార్. ప్లేస్ విసిట్ పేరుతో.. ప్లాట్ దగ్గరకు వెళ్లి ఇన్స్పెక్షన్ చేసినట్టు నటించాడు. ఆ తర్వాత అక్కడ నుంచి రైల్వే డిఆర్ఎం కార్యాలయం వద్దకు వచ్చేయాలని సూచించాడు. అక్కడ.. అడ్వాన్స్ గా 60వేలు బాధితుని నుండి లంచంగా తీసుకుంటుండగా.. ఏఈ సురేష్ కుమార్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని ప్రకటన విడుదల చేశారు ఏసీబి అధికారులు. ఏఈ ని అదుపులోకి తీసుకుని… అతని కార్యాలయంలో సోదాలు చేశారు.
కటకటాల్లోకి అవినీతి అధికారి..
– లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఏఈ సురేష్ కుమార్ ను ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరిచారు అధికారులు. సురేష్ కుమార్ ను జనవరి 10వ తేదీ వరకు రిమాండ్ విధించింది కోర్టు. దీంతో ఏఈ సురేష్ కుమార్ ను సెంట్రల్ జైలుకు తరలించారు ఏసీబీ అధికారులు. ఏ ఈ పట్టుబడడంతో అవినీతి అధికారుల గుండెల్లో గుబులు పుడుతోంది. అవినీతి నిర్మూలించేందుకు ఏసీబీ ప్రత్యేక 14400 నెంబర్ను అందుబాటులో ఉంచిందని.. ఆ నెంబరును ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని, ఎవరైనా అధికారులు వేధింపులకు పాల్పడితే 14400 ద్వారా అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించాలని డిజిపి రాజేంద్రనాధ్ రెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..