AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో 17, తెలంగాణలో 9 పార్టీల రిజిస్ట్రేషన్‌ రద్దు..! ఈసీ సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా ఎన్ని పార్టీలంటే?

భారత ఎన్నికల సంఘం (ఈసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో పోటీ చేయని 474 రాజకీయ పార్టీల నమోదును రద్దు చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుండి 17, తెలంగాణ నుండి 9 పార్టీలు ఉన్నాయి. ఆరు సంవత్సరాలుగా ఎన్నికల్లో పాల్గొనని పార్టీల నమోదును రద్దు చేసింది.

ఏపీలో 17, తెలంగాణలో 9 పార్టీల రిజిస్ట్రేషన్‌ రద్దు..! ఈసీ సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా ఎన్ని పార్టీలంటే?
Election Commission Of Indi
SN Pasha
|

Updated on: Sep 20, 2025 | 5:23 PM

Share

భారత ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసకుంది. ఎన్నికల్లో పోటీ చేయకుండా, యాక్టివ్‌గా లేని రాజకీయ పార్టీల రిజిస్టేషన్‌ను రద్దు చేసింది. ఒకటి కాదు రెండు కాదు.. దేశవ్యాప్తంగా ఏకంగా 474 పార్టీల రిజిస్టేషన్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ 474లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిసి ఏకంగా 26 పార్టీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి 17, తెలంగాణ నుంచి 9 పార్టీలు ఉన్నాయి. ఆరేళ్లలో ఒక్క ఎన్నికల్లో కూడా పోటీ చేయకపోవడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.

ఆగస్టులో 334 పార్టీలను రద్దు చేయగా.. తాజాగా రద్దు చేసిన 474తో కలిపి మొత్తంగా రెండు నెలల్లో 808 పార్టీలను ఈసీ రద్దు చేసింది. రిజిస్టేషన్‌ రద్దు అయిన పార్టీలు చాలా కాలంగా ఎన్నికల్లో పాల్గొనడం లేదు. అందుకే వాటిని జాబితా నుంచి తొలగించాలని ఈసీ నిర్ణయించింది. ఆంధ్ర ప్రదేశ్ నుండి ఆల్ ఇండియా లిబరల్ పార్టీ, ఆల్ ఇండియా మంచి పార్టీ, భారత ప్రజా స్పందన పార్టీ, భారతీయ చైతన్య పార్టీ, భారతీయ సధర్మ స్థాపన పార్టీ, గ్రేట్ ఇండియా పార్టీ, జై ఆంధ్రా పార్టీ, జై సమైక్యాంధ్ర పార్టీ, పెడల పార్టీ, పేదరిక నిర్మూలన పార్టీ, రాజకీయ ఎసెన్షియల్ పార్టీ, ప్రజాపాలనా పార్టీ, కచ్చితత్వ పార్టీ, రాయలసీమ పరిరక్షణ సమితి, సమైక్య తెలుగు రాజ్యం, వెనుకబడిన తరగతుల మహిళా రైతుల పార్టీ, వైఎస్ఆర్ బహుజన పార్టీల రిజిస్ట్రేషన్‌ రద్దు అయింది.

ఇక తెలంగాణలో లోక్ సత్తా పార్టీ రిజిస్టేషన్‌ కూడా రద్దు అయింది. మాజీ ఐఏఎస్‌ జయప్రకాశ్‌ నారయణ స్థాపించిన లోక్‌సత్తా పార్టీ గతంలో రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించింది. లోక్‌ సత్తాతో పాటు ఆల్ ఇండియా ఆజాద్ పార్టీ, ఆల్ ఇండియా బిసి ఓబిసి పార్టీ, బిసి భారత్ దేశం పార్టీ, భారత్ లేబర్ ప్రజా పార్టీ, మహాజన మండలి పార్టీ, నవభారత్ నేషనల్ పార్టీ, తెలంగాణ ప్రగతి సమితి వంటి పార్టీల రిజిస్ట్రేషన్‌ రద్దు చేసింది ఈసీ. అలాగే మరి కొన్ని నెలల్లో ఎన్నికల జరగనున్న తమిళనాడులో ఏకంగా 42 పార్టీల రిజిస్ట్రేషన్‌ రద్దు చేసింది. ఈ రద్దు తర్వాత దేశంలో ఇప్పుడు ఆరు గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు, 67 రాష్ట్ర గుర్తింపు పొందిన పార్టీలు ఉన్నాయి. ఇవి కాకుండా 2,046 రిజిస్టర్‌ పార్టీలు ఉన్నాయి.

మరిన్ని రాజకీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి