
సాధారణంగా భోగి పండుగ అనగానే ఇంట్లో ఉన్న పాత సామాన్లన్నీ.. భోగి మంటల్లో పడేస్తాం. పాతదనానికి స్వస్తి చెప్పి కొత్తదనానికి జీవితాల్లో ఆహ్వానిస్తాం. భోగి పండుగ రోజున పాత, పనికిరాని వస్తువులను అగ్నిలో వేసి.. కొత్త జీవితానికి స్వాగతం పలుకుతాం. దీని ద్వారా చెడును త్యజించి, మంచిని స్వీకరిస్తాం. ఈ భోగి అగ్ని చుట్టూ చేరి చలి కాచుకోవడంతో పాటు.. సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించబోయే ముందు ప్రకృతికి కృతజ్ఞతలు తెలుపుకోవడం సాంప్రదాయం. పాత వస్తువులు, చెడు అలవాట్లు, కష్టాలను భోగి మంటల్లో వేసి దహించడం ద్వారా వాటిని త్యజించడం ద్వారా కొత్త జీవిత ప్రయాణానికి, సానుకూల శక్తితో ముందుకు సాగడానికి శ్రీకారం పుట్టడానికి పరిస్థితులు కల్పించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
అయితే ఈ భోగి మంటల్లో.. పాత వస్తువులు వేసే క్రమంలో వాటి నుంచి వెలువడే పొగ పర్యావరణంలో కలిసిపోతుంది. భోగిమంటల్లో ప్లాస్టిక్ కవర్లు, టైర్లు వేసి నిప్పు పెట్టడం వల్ల భారీగా కాలుష్యం వెలువడుతోంది. విశాఖ లాంటి నగరాల్లో ఇప్పటికే గాలి నాణ్యత.. తగ్గిపోతుంది. ఈ క్రమంలో నివారణ చర్యలు చేపడుతోంది అధికార యంత్రాంగం. అయితే పర్యావరణ పరిరక్షణ అనేది అందరి బాధ్యత. ఈ క్రమంలో ఏటా గో ఆధారిత వ్యవసాయ రైతు సంఘం ఆధ్వర్యంలో పర్యావరణహిత భోగిని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
పర్యావరణహిత భోగి అంటే..
విశాఖ బీచ్ రోడ్ లో పర్యావరణహిత బోగి వేడుకలు ఘనంగా జరిగాయి. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఒక లక్ష ఒకటి ఆవు పేడ పిడకలతో సాంప్రదాయ బద్ధంగా భోగి మంటలు వేశారు. కట్టెలు, కర్రల జోలికి పోకుండా.. పర్యావరణానికి హానిచేయని ఆవు పేడతో చేసిన పిడకలు, ఆవు నెయ్యి, హారతి కర్పూరం తో భోగి మంటలు వేశారు. తద్వారా పర్యావరణానికి మేలు చేసేలా భోగి వేడుకలు నిర్వహించారు.
పర్యావరణహిత భోగికి విశేష స్పందన లభించింది. భారీగా భోగి వేడుకల్లో పాల్గొన్నారు జనం. ఈ వేడుకలకు సిపి శంఖబ్రత బాగ్చి హాజరయ్యారు. భోగి పండగ విశిష్టత, సాంప్రదాయ పర్యావరణహిత భోగిపై పిల్లలకు అవగాహన కల్పించారు. పిల్లలకు భోగి పళ్ళు వేసి ఆశీర్వదించారు. పర్యావరణహితంగా భోగిని జరుపుకోవడం మంచి సాంప్రదాయమన్నారు సీపీ. తన జీవితంలో ఎప్పుడూ ఎటువంటి భోగి వేడుకలు తాను చూడలేదని అన్నారు.
విశాఖలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఇటువంటి భోగి వేడుకల్లో నిర్వహించడం ఆ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఇటువంటి సంప్రదాయాన్ని భావితరాలకు అందించాలంటు..సాంప్రదాయబద్ధంగా భోగి వేడుకలు నిర్వహిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం.. విశాఖను కాలుష్యం నుంచి కాపాడుకుందాం అంటూ పర్యావరణహిత భోగి వేడుకల్లో పాల్గొన్న వారంతా పిలుపునిచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.