Andhra Pradesh: గోదావరి జిల్లాలకు ముందే వచ్చిన సంక్రాంతి.. ISTS మహిళ ఇంజనీరింగ్ కాలేజీలో అంబరాన్నంటిన వేడుకలు

| Edited By: Srilakshmi C

Jan 08, 2024 | 3:33 PM

గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు వారం రోజుల ముందే రంగ రంగ వైభవంగా జరిగాయి. విద్యాసంస్థల్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఐఎస్‌టిఎస్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి వేడుకలు అంబరానంటాయి. విద్యార్థినిలు సాంప్రదాయ దుస్తులు ధరించి ముగ్గులు, గొబ్బెమ్మలు, రంగవల్లులు, ఆటపాటలతో నృత్యాలు చేస్తూ ఆనందంగా గడిపారు. హిందువుల పండగల్లో..

రాజానగరం, జనవరి 8: గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు వారం రోజుల ముందే రంగ రంగ వైభవంగా జరిగాయి. విద్యాసంస్థల్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఐఎస్‌టిఎస్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి వేడుకలు అంబరానంటాయి. విద్యార్థినిలు సాంప్రదాయ దుస్తులు ధరించి ముగ్గులు, గొబ్బెమ్మలు, రంగవల్లులు, ఆటపాటలతో నృత్యాలు చేస్తూ ఆనందంగా గడిపారు. హిందువుల పండగల్లో సంక్రాంతి పెద్ద పండగ. మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ముఖ్యంగా సంక్రాంతి పండగ అంటే ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ, గోదావరి జిల్లాలు గుర్తుకొస్తాయి. దాదాపు నెల రోజుల ముందే సంక్రాంతి పండగ సందడి మొదలవుతుంది. ముంగిట ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దులు హడావిడీ పండగ సందడిని ప్రతి ఒక్క ఇంటికి తీసుకొస్తుంది. అలాంటి వాతావరణాన్ని రాజానగరం మండలం రాజానగరం లోని ఐఎస్‌టిఎస్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలేజీ విద్యార్థినిలు సంప్రదాయ పద్ధతిలో వస్త్రాలు ధరించి నృత్యాలతో అలరించారు. భోగి మంటలు, గంగిరెద్దులు, ముగ్గులు, బొమ్మల కొలువు, కోడి పందాలు, గాలిపటాలు మొదలైన సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించి కాలేజీ చైర్మన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆనందం వ్యక్తం చేశారు. ఆడపిల్లలతో కలిసి సరదాగా సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు. పసందైన పిండి వంటలతో సంక్రాంతి ముందే వచ్చేసిందా అన్న వాతావరణం అందరినీ ఆకట్టుకుంది.

కళాశాలలో ఉన్న విద్యార్థులంతా పట్టు పరికిణీలు, లంగా ఓణీలతో తెలుగుదనం ఉట్టిపడేలా వరిచేల మధ్యలో నుంచి సంక్రాంతి పాటలకు అలరిస్తూ గోదావరి అందాలు సోయగాలతో సందడి చేశారు. ఎప్పుడూ చదువులో మునిగిపోయే మాకు సంక్రాంతి పండుగ వాతావరణంలో ఇలా ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు కళాశాల విద్యార్థినిలు. సంక్రాంతి, భోగి, కనుమ అంటే ఏంటి అనే అంశాలను చక్కగా వివరించారు విద్యార్థులు. సంక్రాంతి పాటలకు నృత్యాలు చేస్తూ అలరించారు. కాలేజీ ప్రాంగణమంతా సంక్రాంతి వైభవంతో కళకళలాడింది. సంక్రాంతి అప్పుడే వచ్చేసిందా అన్న వాతావరణం ఉట్టిపడేలా పిండి వంటలతో రుచులు చూపించి మేము చేయగలం మా అమ్మ నాన్న తాతలే కాదు అని నిరూపించారు ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ విద్యార్థినిలు. సెలవులకి ఇంటికి వెళ్లి తినడం తప్ప ఇన్ని రకాల వెరైటీ స్వీట్స్ తయారు చేయడం ఇదే మొదటిసారి అంటున్నారు విద్యార్థులు. ఇప్పుడున్న జనరేషన్లో పిజ్జాలు, బర్గర్లు, స్వీట్ షాపుల్లో స్వీట్లు తినే యువతకు ఒక సందేశం ఇచ్చేలా ఇన్ని రకాల సంక్రాంతి స్పెషల్ స్వీట్స్ , పిండి వంటలు తయారు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. కాలేజీ యాజమాన్యం మాకు చదువుతోపాటు గోదావరి జిల్లాలో అనురాగాలు, ఆప్యాయతలను కూడా నేర్పుతుందన్నారు.

సంక్రాంతి అంటేనే కోనసీమ అంటారు. అలాంటి కోనసీమ వాతావరణం మొత్తాన్ని కొన్ని రోజుల ముందే కొలువు తీర్చారు. గంగిరెద్దులు హరిదాసు కీర్తనలు, భోగిమంటల మధ్య మహిళా విద్యార్థులు సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. భోగి మంటలు వెలిగించి సంక్రాంతి పాటలకు నృత్యాలు చేశారు. పల్లె వాతావరణం, సంక్రాంతి శోభ మధ్య విద్యార్థినులు సందడి చేశారు. భోగిమంటల చుట్టూ తిరుగుతూ నృత్యాలు చేశారు. ఒకే వేదికపై సంక్రాంతి పాటలకు 3,000 మంది విద్యార్థులు ఒకేసారి నృత్యాలు చేసి అలరించారు. ఇన్ని వేల మంది విద్యార్థులు ఇలా సంక్రాంతి సంబరాలు చేసుకోవడం పూర్వజన్మ సుకృతం అన్నారు విద్యార్థినులు. ఇంటికి వెళితే కేవలం కుటుంబ సభ్యులతో మాత్రమే ఉంటాము. కానీ కళాశాల ప్రాంగణంలో వేలమంది ఒకే తాటిపైకి చేరి సంబరాలు చేసుకోవడం పట్ల చాలా ఆనందం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

అంతేకాదు సంక్రాంతి అంటే కోనసీమ పంట పొలాల్లో అందరికీ గుర్తొచ్చేది ప్రభలు. ఆ ప్రభలను వరి చేలా గట్ల మధ్య నుంచి మోసుకు వస్తే చాలా ఉధృత వాతావరణం నెలకొంటుంది. అలాంటి ప్రభలను మహిళా విద్యార్థులు ఊరికి తీసుకొచ్చారు. ప్రభలు మోసుకు వస్తున్న తీరుని చూసి అందరూ ఆశ్చర్యానికి గురి అయ్యారు. సంక్రాంతి శోభను కళ్ళకు కట్టినట్లు చూపించారు ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ విద్యార్థినిలు. ఏది ఏమైనా వారం రోజుల ముందే సంక్రాంతి వచ్చేసిందా అన్నట్లుగా ఏర్పాట్లను చూపించిన విద్యార్థులకు హేట్సాప్ చెప్పాల్సిందే. ఈ పాశ్చాత్య ప్రపంచంలో ఇంజనీరింగ్ విద్యార్థినులు, యువత పెడదోవ పడుతున్న ఇలాంటి తరుణంలో వారికి గుణపాఠం వచ్చేలా సాంప్రదాయ దుస్తులతో సాంప్రదాయ పిండి వంటకాలతో సంక్రాంతి వాతావరణ ఉట్టిపడేలా ఒక మెసేజ్ ను ఇస్తూ చేసిన వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.సెలవులు వస్తే ఊరికి వెళ్ళిపోవడమే తప్ప .. ఇలాంటి సంబరాలు అందరితో కలిసి మెలిసి చేసుకోవడం అనేది మరుగున పడిపోయింది అనేవారు ఈ మహిళా కళాశాలలో చేసిన వేడుకలు చూస్తే ఆశ్చర్యానికి గురికావాల్సిందే.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.