గాడిద పాలు లీటర్ 4 నుంచి 6 వేల రూపాయలట. ఏకంగా గాడిదల ఫామ్ పెట్టి మరీ పాలు అమ్ముతున్నారు. వీటిలో పోషక విలువలు ఎక్కువగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుతాయంటున్నారు. ఈ క్రమంలో గాడిద మాంసానికి కూడా గిరాకీ తెగ పెరిగిపోయింది. గాడిద మాంసం తింటే అపరిమితమైన శక్తి వస్తుందన్న అపోహలు.. అలాగే గాడిద రక్తం తాగితే ఉబ్బసం తగ్గిపోతుందని, శక్తి వస్తుందని కొందరు భావిస్తున్నారు. దీంతో గాడిద మాంసం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అయితే గత కొంతకాలంగా గాడిదలను విపరీతంగా వధించడంతో దేశంలో అంతరించిపోయే జాబితాలో ఇవి కూడా చేరిపోయాయి
గుంటూరు నగరంలోని శ్రీనివాసరావు తోట, ఓల్డ్ గుంటూరు, ప్రత్తిపాడు రోడ్డులో విచ్చలవిడిగా గాడిదలను వధించి మాంసాన్ని విక్రయిస్తున్నట్లు గుర్తించిన బ్లూ క్రాస్ సొసైటీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు చేసిన జంతు ప్రేమికులకుపై గాడిదమాంసం విక్రేతలు దాడికి యత్నించారు. గాడిద మాంసం తినకూడదని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ అఫ్ ఇండియా నిబంధలున్నా పట్టించుకోవడం లేదని, గాడిదలను వధించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు జంతు ప్రేమికులు. దీన్ని అరికట్టడానికి పోలీసులు సరైన చర్యలు తీసుకోవడం లేదంటున్నారు వాళ్లు.
గాడిద మాంసం తినడం అరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. గాడిద మాంసం తింటే కండరాలు బలోపేతం అవ్వటం, ఉబ్బసం తగ్గడం వంటి ఆలోచనలు అపోహేనని క్లారిటీ ఇచ్చారు. రెడ్ మీట్ తింటే కొవ్వు పెరిగిపోయి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువుగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. గాడిద మాంసం ఆరోగ్యానికి మంచిది కాదని న్యూట్రిషనిస్టులు కూడా స్పష్టత ఇస్తున్నారు. గాడిదలను వధించేందుకు ఎటువంటి అనుమతులు లేవంటున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఎక్కడైనా గాడిదలను వధిస్తే వెంటనే స్థానిక సంస్థల ప్రతినిధులు చర్యలు తీసుకోవచ్చంటున్నారు వాళ్లు. గాడిదల వధను అరికట్టకపోతే కొంత కాలానికి వాటిని కూడా ఏ జూలోనో చూసే పరిస్థితి దాపురిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జంతు ప్రేమికులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..