ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరిస్తూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకూ ఉన్న దానికంటే సుమారు ఐదు రెట్ల మేర ఉచిత వైద్యం అందించేలా ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచారు. ఇకపై రూ. 25 లక్షల వరకూ ఆరోగ్యశ్రీ కార్డుల ద్వారా ఉచితంగా వైద్యం అందించనున్నారు. వెయ్యి రూపాయలు దాటిన ప్రతి చికిత్సకు ఉచితంగా వైద్యం అందనుంది. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఇప్పటివరకూ రూ. 5 లక్షల వరకూ ఉన్న పరిమితిని రూ. 25 లక్షలకు పెంచింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. .అంతేకాకుండా ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి….? ఉచితంగా సేవలు ఎలా చేయించుకోవాలి..? వంటి విషయాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టింది రాష్ట్ర సర్కార్.
ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరించడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోటీ 48 లక్షల కుటుంబాల్లోని నాలుగు కోట్ల 25 లక్షల మందికి ఉచిత సేవలు అందించేలా కొత్త కార్డులు జారీ చేస్తోంది. మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కార్డుల జారీని ప్రారంభించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గతంలో ఉండే ఆరోగ్యశ్రీ కార్డుల కంటే ఈసారి ఆధునిక టెక్నాలజీతో అప్ గ్రేడ్ చేసిన స్మార్ట్ కార్డులను లబ్దిదారులకు అందిస్తుంది. ఈ స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెబుతోంది రాష్ట్ర ప్రభుత్వం. స్మార్ట్ కార్డుపై క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే రోగికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి. రోగికి ఉన్న సమస్యలు, గతంలో చేయించుకున్న చికిత్సకు సంబంధించిన వివరాలు, ఉపయోగించిన మందులు, ఇలా అన్ని అంశాలు పొందుపరిచి ఉంటాయి. దీని ద్వారా పేషెంట్ ఎన్నిసార్లు ఆసుపత్రికి వెళ్లినప్పటికీ వారికి ఎలాంటి వైద్యం అవసరమవుతుందనేది డాక్టర్లు సులువుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.
ఇక ఆరోగ్య శ్రీ స్మార్ట్ కార్డుతో పాటు ఆరోగ్యశ్రీ యాప్ ను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ సమయంలోనే లబ్దిదారుల మొబైల్ ఫోన్లలో ఆరోగ్యశ్రీ యాప్ ను డౌన్ లోడ్ చేస్తారు. ఈ యాప్ లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఆసుపత్రుల వివరాలు,ఏ హాస్పిటల్‌లో ఏ రోగానికి వైద్యం అందుతుందనే అన్ని వివరాలు ఉంటాయి.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ లో కీలక మార్పులు తీసుకొచ్చింది. గతంతో పోలిస్తే చికిత్సల సంఖ్య పెంచడం, ప్యాకేజీలు పెంచడంతో పాటు హాస్పిటల్స్‌ను కూడా పెంచింది జగన్ ప్రభుత్వం. ప్రస్తుతం సంవత్సరానికి 5 లక్షల ఆదాయం ఉన్న కుటుంబాలను కూడా ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకు వచ్చింది. దీని ద్వారా కోటీ 48 లక్షల కుటుంబాలు ఆరోగ్య శ్రీ పరిధిలోకి వచ్చాయి. 4 కోట్ల 25 లక్షల మంది ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చారు. వైసీపీ అధికారంలోకి రాక ముందు 1,059 ప్రొసీజర్లకు ఆరోగ్య శ్రీ సేవలు అందేవి. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ ద్వారా 3వేల 257 ప్రొసీజర్లకు ఉచిత చికిత్సలు అందిస్తుంది జగన్ సర్కార్.
ఇక, గతంలో ఉచిత ఆరోగ్యశ్రీ సేవలు 748 ఆస్పత్రుల్లో అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం ఇతర రాష్ట్రఆల్లో కలిపి 2వేల 513 హాస్పిటల్స్‌కు ఆరోగ్యశ్రీ సేవలు విస్తరించింది. ఆంధ్రప్రదేశ్‌లో 2,309 ఆసుపత్రులతో పాటు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో కూడా రిఫరల్ ఆసుపత్రులున్నాయి. హైదరాబాద్‌లో 85, బెంగుళూరులో 35, చెన్నైలో 16 ఆస్పత్రులతో కలిపి మొత్తం 204 ఇతర రాష్ట్రాల ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సేవలు అందిస్తుంది. ఇంత పెద్ద ఎత్తున ఏ రాష్ట్రంలో కూడా ఉచిత వైద్య సేవలు అందడం లేదని ఏపీ సర్కార్ చెప్పుకొస్తుంది.
రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 19 నుంచి ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ ప్రారంభమైంది. కార్డుల పంపిణీ మాత్రమే కాకుండా ఆరోగ్యశ్రీ పరిధి పెంపు, ఇతర సౌకర్యాలపై విస్తృతంగా ప్రచారం చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రతి నియోజకవర్గంలోని ఐదు గ్రామాల్లో రోగ్యశ్రీ ప్రచార కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి వారం మండలానికి నాలుగు గ్రామాల చొప్పున ఏఎన్‌ఎంలు, సీహెచ్‌వోలు, ఆశా వర్కర్లతో పాటు ప్రజాప్రతినిధులు స్మార్ట్ కార్డుల పంపిణీతో పాటు ఆరోగ్యశ్రీ యాప్ డౌన్ లోడ్ చేసి వాటిపై ప్రచారం చేయనున్నారు. జనవరి నెలాఖరు నాటికి ఈ కార్డుల పంపిణీ పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
మరిన్ని అంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…