
డిజిటల్ అరెస్ట్ అంటూ డబ్బులు దోచుకుంటున్న.. కిలాడీ సైబర్ క్రైమ్ ముఠాకు బ్యాంకు సిబ్బంది ఝలక్ ఇచ్చారు.. తిరుపతిలో ఒక రిటైర్డ్ టీచర్‌కు నకిలీ CBI ఆఫీసర్ పేరుతో బెదిరింపును SBI బ్యాంక్ సిబ్బంది ముందే గ్రహించి బట్టబయలు చేసారు. బ్యాంకు అధికారుల అప్రమత్తతతో భారీ సైబర్ మోసం తప్పింది. వివరాల్లోకి వెళితే తిరుపతి నగరంలోని ఎస్వియూ క్యాంపస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక సీనియర్ సిటిజెన్‌ను లక్ష్యంగా చేసుకొని నకిలీ CBI అధికారి పేరుతో సైబర్ నేరగాళ్లు బెదిరింపులకు పాల్పడ్డారు. తిరుపతిలో ఉంటున్న 66 ఏళ్ల రిటైర్డ్ టీచర్‌కు ఫోన్ చేసిన ఒక వ్యక్తి, తాను CBI అధికారినని చెప్పుకున్నాడు.. ఫిర్యాదుదారి ఫోన్ నంబర్ నుంచి బెంగుళూరులో మహిళలకు అనుచిత సందేశాలు పంపించారని బెదిరించారు. దీనిపై FIR నమోదు అయ్యిందని భయపెట్టాడు. వెంటనే బెంగుళూరుకు రావాలని చెప్పి మానసికంగా ఒత్తిడికి గురి చేశారు. ఆ తరువాత ఫిర్యాదుదారునికి వీడియో కాల్ చేసి, ఇంట్లో ఎవరికీ ఈ విషయం చెప్పొద్దని, గదిలోకి వెళ్లి తలుపు లాక్ చేసి మాట్లాడాలని హుకుం జారీ చేసారు. ప్రతి రెండు గంటలకు గుర్తింపు మెసేజ్ పంపాలని ఇన్వెస్టిగేషన్ పేరుతో బ్యాంక్‌లో ఉన్న డబ్బు వివరాలు వెల్లడించాలని ఆదేశిస్తూ భయభ్రాంతులకు గురి చేశారు.
మీరు నిర్దోషని నిరూపించుకోవాలంటే డబ్బులు డిపాజిట్ చేయాల్సిందే అంటూ నమ్మబలికారు.. అయితే.. సైబర్ నేరస్థుల మాటలను నమ్మిన రిటైర్డ్ టీచర్ రూ.40 లక్షల మేర వివిధ సైబర్ నేరస్థుల ఖాతాల్లో జమ చేశాడు. అనంతరం మరింత మొత్తాన్ని RTGS ద్వారా పంపించేందుకు తిరుపతిలోని ఇస్కాన్ రోడ్డు లోని SBI బ్యాంక్ ను సంప్రదించాడు. ఇంత పెద్ద మొత్తాన్ని ఇతర రాష్ట్రాల ఖాతాలకు పంపించడానికి గల కారణంపై అనుమానం వ్యక్తం చేసిన SBI బ్యాంక్ అధికారులు లీలాకృష్ణ, కృష్ణారెడ్డి లు బ్యాంకు ఖాతాదారుడైన రిటైర్డ్ టీచర్ ను ప్రశ్నించారు. నిజం చెప్పేందుకు వెనుకంజ వేసినా మోసగాళ్లు సృష్టించిన భయం కారణంగా డబ్బు పెద్ద మొత్తంలో బదిలీ చేసేందుకు సిద్ధమైనట్లు గుర్తించారు.
ఇది పక్కా డిజిటల్ అరెస్ట్ సైబర్ మోసమని భావించారు. వెంటనే లావాదేవీలను నిలిపివేసిన బ్యాంక్ అధికారులు.. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు SBI బ్యాంక్ అధికారుల సమయస్ఫూర్తి, అప్రమత్తతతో భారీ నష్టం జరగకుండా తప్పింది. ఈ ఘటనలో ప్రో-యాక్టివ్‌గా వ్యవహరించిన బ్యాంక్ అధికారులను SVU క్యాంపస్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్, సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ సత్కరించి అభినందించారు.
CBI, ED పోలీస్, కోర్టుల నుంచి ఎప్పుడూ WhatsApp వీడియో కాల్ ద్వారా విచారణ చేయవని డిజిటల్ అరెస్ట్ అనే పదం పూర్తిగా నకిలీదని ఎస్పీ స్పష్టం చేశారు. OTPలు, బ్యాంక్ ఖాతా వివరాలు, ATM PIN, ఆధార్, PAN వంటి వివరాలను ఎవరికీ చెప్పకూడదన్నారు. తెలియని వ్యక్తుల సూచనల మేరకు RTGS, IMPS, UPI ద్వారా డబ్బులు పంపవద్దని హెచ్చరించారు. అలాగే అనుమానాస్పద లింకులు క్లిక్ చేయవద్దని, తెలియని యాప్‌లు ఇన్‌స్టాల్ చేయవద్దని, ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చిన వెంటనే కాల్ కట్ చేసి కుటుంబ సభ్యులు, బ్యాంక్ సిబ్బందికి పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. వృద్ధులకు సంబంధించిన పెద్ద మొత్తాల లావాదేవీల విషయంలో బ్యాంక్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు ఎస్పీ సుబ్బారాయుడు. సైబర్ మోసం అనుమానం ఉంటే వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..