ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో సెల్ఫీల ఛాలెంజ్ నడుస్తోంది. యువగళం పేరుతో పాద యాత్ర చేపడుతోన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శని నారా లోకేష్ సెల్ఫీలు దిగుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ధర్మవరం నియోజకవర్గంలో పాద యాత్ర చేస్తున్న నారా లోకేష్.. స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డిపై అటాక్ చేసిన విషయం తెలిసిందే. కేతిరెడ్డికి సంబంధించిన ఫామ్ హౌజ్‌ను ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు లోకేష్. దీంతో ఈ అంశం కాస్త హాట్ టాపిక్‌గా మారింది.
ఇదిలా ఉంటే తనపై వచ్చిన ఆరోపణలపై కేతిరెడ్డి తనదైన శైలిలో స్పందించారు. లోకేష్ కామెంట్స్‌పై కౌంటర్ ఎటాక్ చేశారు కేతిరెడ్డి. చంద్రబాబు,లోకేష్ కు, ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఛాలెంజ్ విసిరారు. తనపై చేసిన ఆరోపణలు 24 గంటల్లో నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, నిరూపించ లేకపొతే మీరు రాజకీయాల నుంచి తప్పుకుంటారా? అని ప్రశ్నించారు. యువగళం పాదయాత్రలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ధర్మవరంలో చెరువును ఆక్రమించుకుని ఫామ్ హౌస్ నిర్మించారని నారా లోకేష్ తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆయన ఈ కౌంటర్ ఇచ్చారు.
ఉండవల్లిలోని కరకట్ట వద్దగల చంద్రబాబు నివాస సమీపంలోకి చేరుకున్న కేతిరెడ్డి ఫేస్ బుక్ లైవ్ లో చంద్రబాబు నివాసాన్ని చూపిస్తూ ఇది అక్రమ కట్టడం కాదా అంటూ ప్రశ్నించారు. తాను రైతుల వద్ద భూములు కొనుగోలు చేసి నివాసం నిర్మించుకున్నానని, చంద్రబాబులా రైతులను బెదిరించి నది వెంట భూములు లాక్కుని ఫామ్ హౌస్‌లు నిర్మించలేదని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి విమర్శలు కురిపించారు. మరి దీనిపై లోకేష్ ఎలా స్పందిస్తారో చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..