Pawan Kalyan: పకడ్బందీగా సోషల్‌ ఆడిట్‌ చేపట్టాలి.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..

మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి సమీక్షా సమావేశాలతో బిజీ అయిపోయారు డిప్యూటీ సీఎం పవన్. శాఖలవారీగా అధికారులతో సమావేశమవుతూ.. అన్ని వివరాలు నోట్ చేసుకుంటున్నారు. త్వరలో కీలక నిర్ణయాలు తీసుకునే ఆలోచనలో ఉన్నారనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.

Pawan Kalyan: పకడ్బందీగా సోషల్‌ ఆడిట్‌ చేపట్టాలి.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..
Pawan Kalyan

Updated on: Jun 20, 2024 | 9:29 PM

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం బాధ్యతలతో పాటు తనకు కేటాయించిన మంత్రిత్వశాఖల బాధ్యతలను చేపట్టిన పవన్‌ కళ్యాణ్.. మొదటి రోజు బిజీబిజీగా గడిపారు. వరుసగా శాఖాపరమైన సమీక్షలు నిర్వహించారు. ఉదయం గ్రామీణాభివృద్ధి శాఖల హెచ్‌ఓడీలతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. మధ్యాహ్నం రెస్ట్ లేకుండా అటవీ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. తనకు కేటాయించిన శాఖల్లో అంశాల వారీగా అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు చెప్పిన విషయాలన్నీ నోట్ చేసుకున్నారు. ఇవాళ కూడా తన శాఖలకు సంబంధించిన సోషల్ ఆడిట్, ఇంజినీరింగ్, గ్రామీణ నీటి సరఫరా విభాగాల అధికారులతో సమీక్షించారు. నిధుల వినియోగం, సోషల్ ఆడిట్ నిర్వహణపై దాదాపు రెండు గంటల పాటు చర్చించారు. ఎన్ని గ్రామాల్లో సోషల్ అడిట్ సమావేశాలు జరిగాయి.. అందుకు సంబంధించిన వివరాలను పవన్‌కు వివరించారు అధికారులు. క్షేత్రస్థాయిలో జరిగిన పనుల పురోగతి, నిధుల సద్వినియోగం అంశాలతో పాటు దుర్వినియోగానికి సంబంధించిన కేసులను వివరించారు. గ్రామాల్లో పకడ్బందీగా సోషల్‌ ఆడిట్‌ చేపట్టాలని.. ఉపాధి హామీ నిధులు సద్వినియోగం కావాలని పవన్ అధికారులకు సూచించారు.

ఉపాధి హామీ పథకాన్ని మరింత విస్తృతంగా గ్రామీణ అభివృద్ధి కోసం ఎలా వినియోగించుకోవచ్చనే అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. మరోవైపు గ్రామీణ నీటి సరఫరాశాఖ ఉన్నతాధికారులతోనూ పవన్ సమీక్షించారు. అలాగే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఇంజనీరింగ్ విభాగం ఉన్నతాధికారులతో పవన్ సమావేశమై… వేర్వేరు అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు పవన్.

ఆయా శాఖల్లో అమలు చేసే కార్యాచరణపై త్వరలో మరోసారి సమీక్షా సమావేశాలు జరిపి.. పవన్‌ కల్యాణ్ కీలక నిర్ణయాలు తీసుకునే ఆలోచనలో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..