Cyclone Asani Updates: బందర్‌ దగ్గర తీరాన్ని తాకిన తుఫాన్‌.. అనూహ్యంగా దిశ మార్చుకున్న అసని..

Balaraju Goud

|

Updated on: May 11, 2022 | 9:24 PM

మచిలీపట్నానికి ఆగ్నేయంగా 90 కి.మీ దూరంలో అసని కేంద్రీకృతమైనట్లుగా వాతావరణ కేంద్రం హెచ్చరించింది. యానాం, కాకినాడ మీదుగా తుఫాన్ పయనించే సూచనలు..

Cyclone Asani Updates: బందర్‌ దగ్గర తీరాన్ని తాకిన తుఫాన్‌.. అనూహ్యంగా దిశ మార్చుకున్న అసని..
Cyclone Asani Update

అసని తుఫాను (Cyclone Asani) ఎఫెక్ట్ మొదలైంది. మచిలీపట్నంలో సమీపంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. అప్రమత్తమైన అధికారులు విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. మచిలీపట్నానికి ఆగ్నేయంగా 90 కి.మీ దూరంలో అసని కేంద్రీకృతమైనట్లుగా వాతావరణ కేంద్రం హెచ్చరించింది. యానాం, కాకినాడ మీదుగా తుఫాన్ పయనించే సూచనలు కనిపిస్తున్నాయి. కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను అసాని ని ఎదుర్కొనేందుకు జాతీయ విపత్తు నిర్వహణ దళం (NDRF) మొత్తం 50 బృందాలను ప్రభావిత ప్రాంతాల్లో మోహరించింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు వస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

దిశ మార్చుకున్న అసని తుపాను దూసుకొస్తుందని వాతవరణ శాఖ అధికారులు తెలిపారు. తుపాను ప్రభావంలో రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నయన్నారు. కాగా నేటి ఉదయం అమలాపురం-కాట్రేనికోన మధ్య తుపాను తీరాన్ని తాకుతుందని అధికారులు అంచనా వేశారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 11 May 2022 05:50 PM (IST)

    విశాఖ నుంచి విమాన సర్వీసులు పునరుద్ధరణ

    అసని తుపాను ప్రభావంతో విశాఖ నుంచి రెండు రోజులుగా రద్దైన విమాన రాకపోకలను అధికారులు పునరుద్ధరించారు. విశాఖ నుంచి హైదరాబాద్‌ సర్వీస్‌ను పునరుద్ధరించినట్లు స్పైస్‌జెట్‌ ప్రకటించింది. అలాగే, విశాఖ – సింగపూర్‌ విమానం యధావిధిగా నడపనున్నట్టు.. స్కూప్‌ ఎయిర్‌లైన్స్‌ పేర్కొంది.

  • 11 May 2022 05:45 PM (IST)

    బాపట్ల దగ్గర తీరాన్ని తాకిన అసని తుఫాన్‌

    బందర్‌ దగ్గర అసని తుఫాన్‌ తీరాన్ని తాకింది. తీరాన్ని తాకే సమయంలో భారీ ఈదురుగాలులు వీస్తున్నాయి. మరో రెండు గంటల్లో అసని తుఫాన్ తీరాన్ని దాటనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆ తర్వాత మళ్లీ సముద్రంలోకే తుపాను గమనం ఉంటుందన్నారు. అటు రేపల్లె సమీపంలో భూ ఉపరితలానికి తుపాను చేరింది.

  • 11 May 2022 05:15 PM (IST)

    అసని తుపాను నేపధ్యంలో హెల్ప్‌ లైన్‌ నెంబర్లు

    అసని తుపాను నేపధ్యంలో హెల్ప్‌ లైన్‌ నెంబర్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో కింది నెంబర్లను సంప్రదించాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ డైరక్టర్ డా.బిఆర్ అంబేద్కర్ తెలిపారు. విపత్తుల నిర్వహణ సంస్థలో అత్యవసర సహయం కోసం 24 గంటలు అందుబాటులో హెల్ప్‌ లైన్‌ నెంబర్లు ఉంటాయని ఆయన వెల్లడించారు.

    హెల్ప్‌ లైన్‌ నెంబర్లు

    • 1070

    • 08645246600

  • 11 May 2022 05:12 PM (IST)

    కొనసాగుతున్న రెడ్ అలెర్ట్

    భూభాగంపైకి వచ్చిన అనంతరం క్రమంగా బలహీన పడి తీవ్ర వాయుగుండంగా మారే సూచనలు ఉన్నట్లు ఐఎండీ అధికారులు తెలిపారు. పూర్తిగా బలహీనపడే వరకూ తీరం వెంబడే పయనిస్తుందని పేర్కొన్నారు. కోస్తాంధ్ర తీరానికి అతి దగ్గరగా రావటంతో గాలుల తీవ్రత తగ్గింది. తుపాను పరిసర ప్రాంతాల్లో గంటకు 75 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయి. తుపాను తీవ్రత దృష్ట్యా కోస్తాంధ్ర తీర ప్రాంత జిల్లాల్లో రెడ్ అలెర్ట్ కొనసాగుతోంది.

  • 11 May 2022 05:10 PM (IST)

    దిశ మార్చుకుంటున్న తుపాను అసని..

    అనూహ్యంగా దిశ మార్చుకుంటున్న తుపాను అసని.. నర్సాపురం తీరానికి దిగువన అల్లవరానికి సమీపంలో భూభాగంపైకి వచ్చే అవకాశాలు ఉన్నట్టు ఐఎండీ అంచనా వేసింది. ప్రస్తుతం గంటకు 6కి.మీ.వేగంతో కదులుతున్నట్టు తెలిపింది. భూభాగంపైకి వచ్చిన అనంతరం సాయంత్రంలోగా యానాం వద్ద తిరిగి సముద్రంలోకి తుపాను ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు.

  • 11 May 2022 05:10 PM (IST)

    బంగాళాఖాతంలో బలహీనపడిన తుపాను

    ఆగ్నేయ బంగాళాఖాతంలో అసని తుపాను బలహీనపడింది. మచిలీపట్నానికి ఆగ్నేయంగా 50కి.మీ., నర్సాపురానికి 30కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది.

  • 11 May 2022 05:05 PM (IST)

    అనకాపల్లి జిల్లాలో విషాదం

    అనకాపల్లి జిల్లా.. యస్ .రాయవరం మండలంలో విషాదం నెలకొంది. రాయవరం నుండి ఉప్పరాపల్లి వెల్తుండగా కొబ్బరి చెట్టు పడి ఉప్పరాపల్లి MPTC తుంపాల కాసు మృతి చెందాడు. దీంతో ఆయన కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి.

  • 11 May 2022 05:04 PM (IST)

    సముద్రపు ఆటుపోట్లతో ఇళ్లలోకి వరద నీరు

    అసని ఎఫెక్ట్‌ కృష్ణా జిల్లా తీర ప్రాంతంపై స్పష్టంగా కనిపిస్తోంది. బలమైన గాలులకు పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలమట్టమయ్యాయి. తీరప్రాంతం గిలకలదిండిలో సముద్రపు ఆటుపోట్లతో ఇళ్లలోకి చేరింది వరదనీరు. తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.

  • 11 May 2022 05:03 PM (IST)

    వాతావరణ శాఖ అధికారుల విస్మయం

    తుఫాన్లు తీరాన్ని తాకిన తర్వాత విధ్వంసం సృష్టిస్తాయి. పెను వేగంతో గాలులు వీయడంతో పాటు భారీ వర్షాలు కురుస్తాయి. అయితే అసని తుఫాను ఓ సారి బలహీనపడటం మరోసారి దిశలు మార్చుకోవడం వాతావరణ శాఖ అధికారుల్ని సైతం విస్మయానికి గురిచేస్తోంది.

  • 11 May 2022 05:02 PM (IST)

    ఎప్పటికప్పుడు సీఎం జగన్ సమీక్ష

    తుపానుపై సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షించారు. తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలిచ్చారు. తుపాను బలహీన పడినా నిర్లక్ష్యం వద్దన్నారు సీఎం జగన్‌. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో సహాయకచర్యలు చేపడుతున్నామన్నారు హోంమంత్రి తానేటి వనిత. భారీ వర్షాలకు ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టామని..పునరావాస కేంద్రాల్లోని కుటుంబాలకు ఆర్థికసాయం అందిస్తామని ప్రకటించారు.

  • 11 May 2022 05:01 PM (IST)

    కృష్ణా జిల్లాకు రానున్న 8 గంటలు కీలకం

    కృష్ణా జిల్లాకు రానున్న 8 గంటలు కీలకమని ప్రకటించారు అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు మునిగే ప్రమాదముందని ప్రకటించారు. వరి, అరటి, బొప్పాయి పంటలు దెబ్బతినే అవకాశముందని హెచ్చరించారు.

  • 11 May 2022 05:00 PM (IST)

    కోస్తాంధ్ర తీర ప్రాంత జిల్లాల్లో రెడ్ అలెర్ట్

    మరికాసేపట్లో అసని తుఫాన్‌ కోనసీమ, అంతర్వేది భూభాగంలోకొచ్చే అవకాశముంది. సాయంత్రానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి రానుంది. తుపాను పరిసర ప్రాంతాల్లో గంటకు 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తుపాను తీవ్రత దృష్ట్యా కోస్తాంధ్ర తీర ప్రాంత జిల్లాల్లో రెడ్ అలెర్ట్ కొనసాగుతోంది.

  • 11 May 2022 05:00 PM (IST)

    తీరప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు

    అసని ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రపై విరుచుకుపడుతోంది. తుఫాన్‌ ప్రభావంతో తీరప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. విశాఖ, గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ కొనసాగుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

  • 11 May 2022 04:46 PM (IST)

    అమలాపురం తీరంలో ఎగిసిపడుతున్న రాకాసి అలలు

    తుఫాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉన్నా.. నరసాపురం..అంతర్వేది మీదుగా కాకినాడ వైపు తీరం దాటుతుంది అని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ప్రస్తుతం అమలాపురం ఓడ రేవు సముద్రతీరం వద్ద విపరీతమైన రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి.

  • 11 May 2022 04:45 PM (IST)

    సముద్ర తీరం అల్లకల్లోలం

    కోనసీమ జిల్లా ఓడ రేవు సముద్రం ఉదయం నుండి అల్లకల్లోలంగా ఉంది…పెద్దఎత్తున గాలులు, రాకాసి అలలతో కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. ఒక పక్క ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అధికారులు తుఫాను ప్రభావంతో అప్రమత్తమైన అప్పటికీ .. ఓడలరేవు సముద్రతీరం వద్ద అలలతో చెలగాటం ఆటలాడుతున్నారు యువకులు..

  • 11 May 2022 04:39 PM (IST)

    5మీటర్ల ముందుకు నర్సాపురం తీరం

    అసని ప్రభావంతో నర్సాపురం తీర ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. పైదమైనవానిలంక వద్ద సముద్రం 5మీటర్లు ముందుకొచ్చింది.

  • 11 May 2022 04:34 PM (IST)

    అధికారుల ముందస్తు జాగ్రత్తలు

    రాబోయే కొద్ది రోజుల పాటు మత్స్యకారులు ఈ ప్రాంతానికి దూరంగా ఉండాలని అధికారులు కోరారు. ఈ తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు, పుదుచ్చేరిలోని యానాంలో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందన్నారు. కాగా IMD తుఫానును పర్యవేక్షిస్తోంది. తుఫాను గురించి, దానిని ఎలా ఎదుర్కోవాలో స్థానిక అధికారులకు తెలియజేయడానికి మే 7 నుండి 30 జాతీయ బులెటిన్‌లను విడుదల చేసింది.

  • 11 May 2022 04:32 PM (IST)

    వాయువ్య బంగాళాఖాతంలో అల్లకల్లోలం

    తుపాను ప్రభావంతో పశ్చిమ బెంగాల్‌లోని గెలాక్సీ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కోల్‌కతాలోని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు, పశ్చిమ మేదినీపూర్, ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, నదియా జిల్లాల్లో గురువారం ఉదయం వరకు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. కోల్‌కతాలో ఉదయం 8.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో 44.8 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని ఆ శాఖ తెలిపింది. బుధవారం సాయంత్రం వరకు పశ్చిమ మధ్య, ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో సముద్రంలో కదలికలు ఎక్కువగా ఉంటాయని, ఆ తర్వాత గురువారం కూడా అదే ప్రాంతంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.

  • 11 May 2022 04:31 PM (IST)

    ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధం

    రాష్ట్రంలో తలెత్తుతున్న పరిస్థితుల దృష్ట్యా 60 యూనిట్ల ‘ఒడిశా డిజాస్టర్ రాపిడ్ యాక్షన్ ఫోర్స్’ (ODRAF),132 అగ్నిమాపక సిబ్బంది బృందాలను మోహరించినట్లు ప్రత్యేక సహాయ కమిషనర్ పి.కె.జెనా చెప్పారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ, రిలీఫ్ కార్యకలాపాలను నిర్వహించడానికి మొత్తం 50 బృందాలను ఏర్పాటు చేసింది. పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లలో 50 బృందాలకు గాను 22 బృందాలను గ్రౌండ్ లెవల్‌లో మోహరించినట్లు, ఈ రాష్ట్రాల్లో మరో 28 బృందాలు సిద్ధంగా ఉండాలని కోరినట్లు ఎన్‌డిఆర్‌ఎఫ్ ప్రతినిధి తెలిపారు.

  • 11 May 2022 04:29 PM (IST)

    రానున్న రెండు రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు

    ప్రాంతీయ వాతావరణ శాఖ ప్రకారం, మల్కన్‌గిరి, కోరాపుట్, రాయగడ, కలహండి, గంజాం, గజపతి, కంధమాల్, నయాగర్, ఖుర్దా, పూరి, కటక్, భువనేశ్వర్‌లలో రానున్న రెండు రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది.

  • 11 May 2022 04:28 PM (IST)

    ఈ జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించిన ఒడిశా ప్రభుత్వం

    ఆసని తుఫాన్ పట్ల ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. మల్కన్‌గిరి, కోరాపుట్‌, రాయగడ, గంజాం, గజపతి వంటి ఐదు దక్షిణ జిల్లాల్లో ఒడిశా ప్రభుత్వం ‘హై అలర్ట్‌’ ప్రకటించింది. ఒడిశాకు 200 కిలోమీటర్ల దూరంలో కాకినాడ-విశాఖపట్నం మధ్య తుపాను ప్రభావం ఈ ప్రాంతాల్లో కనిపించే అవకాశం ఉంది.

  • 11 May 2022 04:25 PM (IST)

    రానున్న కొద్ది గంటల్లో ఉత్తర దిశగా పయనం

    రానున్న కొద్ది గంటల్లో ఇది ఉత్తర దిశగా పయనించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తన జాతీయ బులెటిన్‌లో పేర్కొంది. బుధవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మరోసారి ఊపందుకుని నర్సాపూర్, యానాం, కాకినాడ, తుని, విశాఖపట్నం తీరాల వెంబడి ఉత్తర-ఈశాన్య దిశగా రాత్రికి ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వైపు కదులుతుందని వాతావరణ శాఖ పేర్కొంది.

  • 11 May 2022 04:23 PM (IST)

    ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీరంలో భారీ వర్షాలు

    ‘అసని’ తుఫాను కారణంగా, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ‘అసని’ అల్పపీడనం బుధవారం తుపానుగా బలపడి ఉత్తర కోస్తాంధ్ర వైపు పయనిస్తోంది. ఈ సమయంలో ఆ ప్రాంతంలో గంటకు 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఇది మరింత బలహీనపడి మలుపు తిరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

  • 11 May 2022 03:52 PM (IST)

    కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

    ఈరోజు కోస్తాంధ్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ భారీ నుంచి అతిభారీవర్షాలు పడే అవకాశం ఉంది. రేపు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీవర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 50-60 కిమీ వేగంతో ఈదురగాలులు వీస్తాయని విపత్తుల సంస్థ డైరక్టర్ డా. బిఆర్ అంబేద్కర్ వెల్లడించారు.

  • 11 May 2022 03:48 PM (IST)

    అంతర్వేది వద్ద తీరం దాటనున్న తుఫాన్

    ప్రస్తుతం మచిలీపట్నంకు 40 కి.మీ., నరసాపురంకు 50 కి.మీ., కాకినాడకు 130 కి.మీ., విశాఖపట్నంకు 270 కి.మీ. దూరంలో ఆసని తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. కొన్ని గంటల్లో వాయువ్య దిశగా పయనించి కొనసీమ అంతర్వేది వద్ద తీరం దాటి భూభాగంపైకి వచ్చే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

    Asani Cyclone

    Asani Cyclone

  • 11 May 2022 02:01 PM (IST)

    అసని తుపాన్.. రేపు తీవ్ర వాయుగుండంగా బ‌ల‌హీన‌ప‌డే అవకాశం

    అసని తుపాన్ గురువారం ఉద‌యానికి తీవ్ర వాయుగుండంగా బ‌ల‌హీన‌ప‌డే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో తీర ప్రాంతంలో చర్యలు తీసుకోవాలని.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఏపీ ప్రభుత్వం అధికారులకు పలు సూచనలు చేసింది.

  • 11 May 2022 01:58 PM (IST)

    తీర ప్రాంతంలో అల్లకల్లోలం.. 7వ నెంబ‌ర్ ప్రమాద హెచ్చరికలు జారీ

    అస‌ని తుపాను ప్రభావం కార‌ణంగా ఏపీ స‌ముద్ర తీరం ప్రాంతం అల్లకల్లోలంగా మారిపోయింది. ఈ మేరకు ఏపీలోని మ‌చిలీప‌ట్నం, కాకినాడ‌, విశాఖ‌, గంగ‌వ‌రం, భీమునిప‌ట్నం పోర్టుల్లో 7వ నెంబ‌ర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మిగిలిన పోర్టుల్లో 5 వ నెంబ‌ర్ హెచ్చరికలను జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

  • 11 May 2022 01:49 PM (IST)

    మన్యంలో నేలకొరిగిన భారీ వృక్షాలు..

    ఆంధ్రప్రదేశ్ లో ఆసాని తుపాను అల్లకల్లోలం సృష్టిస్తోంది. బలమైన గాలుల ధాటికి ఆంధ్రాలోని మన్యంలో చెట్లు హైవేపై నేలకొరిగాయి. దీంతో వాహనాలు స్తంభించిపోయాయి.

  • 11 May 2022 01:45 PM (IST)

    కంట్రోల్ రూమ్‌ నంబర్లు ఇవే..

    తుపాను నేప‌థ్యంలో కొన్ని ప్రాంతాల్లో అధికారులు కంట్రోల్ రూమ్‌ల‌ను ఏర్పాటు చేశారు. సహాయం కోసం ప్రజలు ఈ నెంబర్లకు సంప్రదించాలని సూచనలు చేశారు.
    శ్రీకాకుళం 08942-240557,
    విజయనగరం కలెక్టరేట్-08922-236947, 08922-276888,
    చీపురుపల్లి-9440717534,
    భోగాపురం-8074400947,
    విశాఖ-0891-2590100, 2590102
    దీంతోపాటు ఒంగోలు కలెక్టరేట్‌లోని కలెక్టరేట్ కంట్రోల్ రూం నంబర్ : 1077, పోలీస్ వాట్సప్ నంబర్ : 9121102266, పార్వతీపురం మన్యం: 7286881293 గా పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంట‌నే ఫోన్ చేయాల‌ని అధికారులు సూచించారు
  • 11 May 2022 01:20 PM (IST)

    తుఫాన్ ప్రభావిత కుటుంబాలకు రూ.2 వేల సాయం..

    అసని తుపాను ప్రభావిత కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్‌ బుధవారం సమీక్ష నిర్వహించారు. తుపాను దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై ఆయన ఆదేశాలు జారీ చేశారు. సహాయ శిబిరాలకు తరలించిన వ్యక్తికి రూ.1000, కుటుంబానికి రూ.2వేలు చొప్పున సాయం చేయాలని జగన్‌ అధికారులకు సూచించారు. సహాయక శిబిరాల్లో సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

  • 11 May 2022 01:16 PM (IST)

    సీఎం జగన్ కీలక ప్రకటన

    అసని తుపాను నేపథ్యంలో సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. తుఫాన్ ప్రభావిత కుటుంబాలకు పరిహారం ప్రకటించారు.

  • 11 May 2022 11:05 AM (IST)

    తీవ్రతుపాను నుంచి తుపానుగా బలహీనపడిన అసని

    అంతు చూస్తానంటూ దూసుకొచ్చిన అసని తుపాను.. అంత లేదంటూ క్రమంగా బలహీనపడుతోంది. కోస్తాంద్ర తీరంవైపు దూసుకొచ్చినట్టే వచ్చి తీరాన్ని తాకక ముందే… దిశ మార్చుకుంటూ ఎప్పటికప్పుడు భయపెట్టినా… ఏకంగా ఐదుసార్లు రూట్ మార్చుకున్నా… చివరకు బలహీన పడుతోంది.

  • 11 May 2022 09:24 AM (IST)

    తెలంగాణలో కురుస్తున్న వర్షాలు.. ఇవాళ, రేపు..

    తెలంగాణలోని తొమ్మిది జిల్లాల్లో బుధ, గురువారాల్లో ఉరుములు, మెరుపులతో వానలు పడే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాలతోపాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంటూ.. ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాలకు ప్రాథమిక హెచ్చరిక జారీ చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అసని’ తుఫాను మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారనున్నదని, ప్రస్తుతం అది కాకినాడకు 260 కిలోమీటర్ల దూరం లో కేంద్రీకృతమైందని తెలిపింది.

  • 11 May 2022 09:21 AM (IST)

    మచిలీపట్నానికి ఆగ్నేయంగా 50కిలోమీటర్ల దూరంలో..

    జెట్‌స్పీడ్‌గా కోస్తాంద్ర తీరంవైపు దూసుకొచ్చిన.. అసని తుపాను బలహీనపడింది. తీరాన్ని తాకకుండానే దిశ మార్చుకుంది. ప్రస్తుతం మచిలీపట్నానికి ఆగ్నేయంగా 50కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైంది. గంటకు 12కిలోమీటర్ల వేగంతో.. ఈశాన్యం వైపు కదులుతోంది. నర్సాపురం సమీపంలో పూర్తిగా భూభాగంపైకి వచ్చే ఛాన్సెస్‌ ఉన్నాయని వాతావరణ శాఖాధికారులు అంచనా వేస్తున్నారు.

  • 11 May 2022 08:23 AM (IST)

    ఉత్తరాంధ్ర జిల్లాల్లో హై అలెర్ట్..

    అసని తుఫాన్ నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో హై అలెర్ట్ ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు. ప్రాణ, అస్తి నష్టాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లుగా వెల్లడించింది ప్రభుత్వ యంత్రాంగం. విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం చూపుతున్న అసాని తీవ్ర తుఫాన్.

  • 11 May 2022 08:15 AM (IST)

    3మీటర్ల ఎత్తున ఎగసిపడుతున్న అలలు

    తుపాను కాకినాడ దగ్గర సముద్రంలోకి రానుంది. గురువారం సాయంత్రానికి వాయుగుండంగా బలహీనపడనుంది. ప్రస్తుతం తుపాను పరిసర ప్రాంతాల్లో 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అసని ఎఫెక్ట్‌తో సముద్రపు అలలు 3మీటర్ల ఎత్తున ఎగసిపడుతున్నాయి. పూర్తిగా బలహీనపడే వరకు తీరం వెంట పయనించనుంది అసని తుపాను. తీరానికి అతి దగ్గరగా రావడంతో గాలుల తీవ్రత తగ్గింది.

  • 11 May 2022 08:14 AM (IST)

    ఉత్తరాంధ్రలో హై అలర్ట్..

    అసని తుఫాన్ ప్రభావంతో ఉత్తరాంధ్రలో హై అలర్ట్ కొనసాగుతోంది. ప్రాణ, అస్తి నష్టం జరక్కుండా అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. తుపాను ఎఫెక్ట్‌తో విశాఖ నుంచి వరుసగా మూడో రోజు విమాన సర్వీసులు రద్దయ్యాయి. విమానయాన సంస్థలు ఏటీఆర్‌ సర్వీసులను నిలిపివేశాయి.

  • 11 May 2022 08:14 AM (IST)

    కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు..

    కోనసీమ జిల్లాపై తుఫాన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అంతర్వేది ,శంకరగుప్తం ఓడలరేవు తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరి పంటకు అపార నష్టం వాటిల్లింది.

  • 11 May 2022 07:47 AM (IST)

    ఇవాళ్టి ఇంటర్‌ ఫస్ట్ ఇయర్ పరీక్షలు వాయిదా..

    బుధవారం నిర్వహించాల్సిన ఇంటర్‌ ఫస్ట్ ఇయర్ పరీక్షలను అసని తుపాను కారణంగా ఈ నెల 25కు వాయిదా వేస్తున్నట్లు ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి శేషగిరిబాబు తెలిపారు. మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మ్యాథ్స్, వృక్షశాస్త్రం, పౌరశాస్త్రం పరీక్షలు బుధవారం జరగాల్సి ఉంది. వీటిని అన్ని పరీక్షలూ పూర్తయ్యాక 25న నిర్వహిస్తారు.

  • 11 May 2022 07:43 AM (IST)

    తుపాను కాకినాడ దగ్గర సముద్రంలోకి అసని

    తుపాను కాకినాడ దగ్గర సముద్రంలోకి అసని రానుంది. రేపు సాయంత్రానికి వాయుగుండంగా బలహీనపడనుంది. ప్రస్తుతం తుపాను పరిసర ప్రాంతాల్లో 85కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అసని ఎఫెక్ట్‌తో సముద్రపు అలలు 3మీటర్ల ఎత్తున ఎగసిపడుతున్నాయి. పూర్తిగా బలహీనపడే వరకు తీవరం వెంట పయనించనుంది అసని తుపాను. తీరానికి అతి దగ్గరగా రావడంతో గాలుల తీవ్రత తగ్గింది.

  • 11 May 2022 07:42 AM (IST)

    తీవ్ర తుపాను నుంచి తుపానుగా..

    తీవ్ర తుపాను నుంచి తుపానుగా బలహీనపడింది అసని. తీరాన్ని తాకకుండానే దిశ మార్చుకుంది. ప్రస్తుతం మచిలీపట్నానికి ఆగ్నేయంగా 50కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైంది. దిశ మార్చుకున్న అసని.. గంటకు 12కిలోమీటర్ల వేగంతో.. ఈశాన్యం వైపు కదులుతోంది. నర్సాపురం సమీపంలో పూర్తిగా భూభాగంపైకి వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు అంచనా వేస్తున్నారు

  • 11 May 2022 07:38 AM (IST)

    ప్రకాశం జిల్లా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు..

    ప్రకాశం జిల్లా సముద్ర తీరప్రాంత గ్రామాల్లో భయంకరమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. జిల్లాలోని గిద్దలూరు, మార్కాపురం ప్రాంతాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు. ఒంగోలు కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నెంబర్ 1077విద్యుత్‌ స్తంభాలు ఒరిగితే తెలియజేయాలని స్థానిక ప్రజలను అధికారులు కోరారు. ఇందుకోసం టోల్ ఫ్రీ నెంబర్ 1912 ఏర్పాటు చేశారు. అయితే విద్యుత్‌ సమస్యలపై సంప్రదించాల్సిన నెంబర్ 9493 178718 ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు జిల్లా కలెక్టర్.

  • 11 May 2022 07:33 AM (IST)

    విశాఖ నుంచి అన్ని విమాన సర్వీసులు రద్దు

    అసని తుపాను దృష్ట్యా ఇవాళ విశాఖ నుంచి అన్ని విమాన సర్వీసులు రద్దు చేశారు. కోనసీమ జిల్లాపై తుపాను తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అంతర్వేది, శంకరగుప్తం, ఓడలరేవు తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుండటంతో తీర ప్రాంత గ్రామాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

  • 11 May 2022 07:18 AM (IST)

    అసని తుఫాన్ అప్డేట్..

    అసని తుఫాన్ ప్రభావం కారణంగా కృష్ణ, గుంటూరు, గోదావరి జిల్లాలు, యానాం,విశాఖ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మిగతా కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం. కోస్తా తీరం వెంబడి గంటకు 75 నుంచి 95 కిలోమీటర్లు మేర గాలులు వీచే అవకాశం

  • 11 May 2022 07:18 AM (IST)

    అసని తుఫాన్‌పై వాతావరణశాఖ తాజా బులిటెన్..

    అతి తీవ్ర తుఫాన్ నుంచి తీవ్ర తుఫాన్‌గా అసని తుఫాన్ బలహీనపడిందని వెల్లడించిన వాతావరణ శాఖ. ప్రస్తుతం మచిలీపట్నంకు 60 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడి. మరికొన్ని గంటల్లో రీ-కర్వ్ తీసుకుని మచిలీపట్నం, నర్సీపట్నం, యానాం, కాకినాడ, తుని విశాఖ మీదుగా తిరిగి సముద్రంలోకి అసని తుఫాన్ ప్రవేశిస్తుందని స్పష్టత. రేపు ఉదయానికి పూర్తిగా బలహీనపడి అల్పపీడనంగా మారనున్న అసని తుఫాన్.

  • 11 May 2022 07:02 AM (IST)

    అసని తుఫాన్‌ ఎఫెక్ట్‌తో పలు రైళ్లు రద్దు

    ఒడిశా తీరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు ఐఎండీ ఆఫీసర్లు. గంటకు 85 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. దీంతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు వాతావరణశాఖ అధికారులు. అసని తుఫాన్‌ ఎఫెక్ట్‌తో పలు రైళ్లు రద్దయ్యాయి.

  • 11 May 2022 07:02 AM (IST)

    తీవ్ర తుపానుగా మారుతున్న అసని..

    అసని తుఫాను ప్రభావంతో, కోనసీమ జిల్లా వ్యాప్తంగా భారీ ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. వర్షం, గాలుల తీవ్రతతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను తీరం దాటుతుందన్న హెచ్చరికలతో, అధికారులు అప్రమత్తమయ్యారు. తుఫాన్‌ ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు.

Published On - May 11,2022 6:57 AM

Follow us
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు