
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాను అలజడి కొనసాగుతుంది. ప్రస్తుతానికి ఇది కారైకాల్‌కి 100 కి,మీ., పుదుచ్చేరికి 110 కి.మీ, చెన్నైకి 180కి.మీ దూరంలో కేంద్రీకృతం అయింది. గడిచిన 6 గంటల్లో 12కి.మీ వేగంతో కదింది. వచ్చే 24 గంటల్లో ఇది ఉత్తర తమిళనాడు- పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా కదిలే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. దీంతో అధికారులు అలెర్టయ్యారు. తుఫాన్ తీవ్రత ఉంటుందనుకున్న ప్రాంతాల్లో రెస్క్యూ బృందాలను మోహరించారు. ముందు జాగ్రత్తగా.. నెల్లూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, అంగన్వాడీ స్కూల్స్, ప్రభుత్వ, ప్రైవేట్, జానియర్ కాలేజీలకు.. డిసెంబరు 1, సోమవారం సెలవు ప్రకటించినట్లు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు ప్రకటన విడుదల చేశారు. అన్ని స్కూల్స్, కాలేజీల యాజమాన్యుల ఈ ఆదేశాలు పాటించాలన్నారు.
Also Read: విద్యార్థులకు అలెర్ట్.. సోమవారం పాఠశాలలకు సెలవు ప్రకటించిన అధికారులు
తుఫాన్ నేపథ్యంలో అటు అన్నమయ్య జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్‌కు సోమవారం సెలవు ప్రకటించినట్టు జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో విద్యార్థులు బయటకు రాకుండా.. ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. పిల్లలు చెరువులు, కుంటలు, కాలవలు.. నదీ తీర ప్రాంతాలకు వెళ్లకుండా పేరెంట్స్ అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
తమిళనాడుపై దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ చూపిస్తోంది. దీంతో చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, తిరువళ్లూరులో కాలనీలు నీట మునిగాయి. చెన్నై మెరీనా బీచ్‌ను అధికారులు మూసివేశారు. కడలూరు, నాగపట్నం, మైలాదుతురై, విల్లుపురం, చెంగల్పట్టు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల ధాటికి ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ప్రకటించారు. ఈ తుఫాన్…ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా, ఉత్తర దిశలో కదులుతోంది. తమిళనాడులో ఐదో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఐదో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారంటే పరిస్థితి తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో అని జనం భయాందోళనకు గురవుతున్నారు.
తమిళనాడు వైపు దూసుకొస్తున్న దిత్వా తుఫాన్.. సముద్రంలోనే బలహీన పడే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. నాగపట్నంలో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. వేదారణ్యం టెంపుల్ నీట మునిగింది. సహాయక చర్యలు అందించేందుకు సిబ్బంది రంగంలోకి దిగారు. ఇక పుదుచ్చేరి, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లకు వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ జారీ చేసిన మ్యాప్ స్పష్టం చేస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..