ప్రభుత్వ డబ్బును డ్రా చేసేందుకు బ్యాంక్‌కు వెళ్లగా.. అకౌంట్‌ స్టేట్‌మెంట్ చూసి దెబ్బకు కంగుతిన్నారు.!

ఏజెన్సీలోని గిరిశిఖర గ్రామాల గిరిజనుల అమాయకత్వం పలువురు కేటుగాళ్లకు ఆదాయ వనరుగా మారుతుంది. వృద్దులు, మహిళలే టార్గెట్‌గా దొరికినకాడికి దోచుకుంటున్నారు. మాయమాటలు చెప్పి ప్రభుత్వ సంక్షేమ పథకాల సొమ్మును బ్యాంకుల నుండి స్వాహా చేస్తున్నారు. తాము మోసపోయామని తెలిసేలోపే ఖాతాలన్నీ ఖాళీ అవుతున్నాయి.

ప్రభుత్వ డబ్బును డ్రా చేసేందుకు బ్యాంక్‌కు వెళ్లగా.. అకౌంట్‌ స్టేట్‌మెంట్ చూసి దెబ్బకు కంగుతిన్నారు.!
Criminals Looting The Cash Receive Through Government Schemes In Parvathipuram Manyam District

Edited By: Ravi Kiran

Updated on: Dec 01, 2023 | 1:16 PM

ఏజెన్సీలోని గిరిశిఖర గ్రామాల గిరిజనుల అమాయకత్వం పలువురు కేటుగాళ్లకు ఆదాయ వనరుగా మారుతుంది. వృద్దులు, మహిళలే టార్గెట్‌గా దొరికినకాడికి దోచుకుంటున్నారు. మాయమాటలు చెప్పి ప్రభుత్వ సంక్షేమ పథకాల సొమ్మును బ్యాంకుల నుండి స్వాహా చేస్తున్నారు. తాము మోసపోయామని తెలిసేలోపే ఖాతాలన్నీ ఖాళీ అవుతున్నాయి.

పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం శ్రీరంగపాడులో జరిగిన ఘరానా మోసం గిరిజనులను ఆందోళనకు గురి చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాల ద్వారా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలకు డబ్బు నేరుగా జమ చేస్తుంది. సుమారు యాభైకి పైగా పేద గిరిజన కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఇక్కడ గిరిజనులకు రైతు భరోసా, ఆసరా, పీఎం కిసాన్ తో పాటు పలు పథకాలకు చెందిన నగదు ఇటీవల ప్రభుత్వం నుండి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో పడ్డాయి. అలా ఖాతాలకు వచ్చిన నగదును విత్ డ్రా చేసుకునేందుకు బ్యాంక్‌కు వెళ్లారు లబ్ధిదారులు. బ్యాంక్‌కి వెళ్లి తమ ఖాతాలు చెక్ చేసుకున్న లబ్ధిదారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. నగదు విత్ డ్రా చేసుకుందాం అని బ్యాంక్‌కి వెళ్తే అప్పటికే ఖాతాల్లో ఉన్న డబ్బంతా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కాజేశారు. దీంతో లబోదిబోమంటూ ఇంటికి వచ్చి తమ కుటుంబసభ్యులకు తెలియజేశారు లబ్ధిదారులు.

ఇలా ఒకటి రెండు నెలలు కాదు సుమారు ఐదు నెలల నుండి ఇదే విధంగా సంక్షేమ పథకాల నగదు పడిన వెంటనే తమ ఖాతాల నుండి కేటుగాళ్లు కాజేస్తున్నట్లు గుర్తించారు బాధితులు. దీంతో తమకు జరిగిన అన్యాయం పై పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే శ్రీ రంగపాడు గిరిశిఖర గిరిజన గ్రామం కావడంతో ఈ గ్రామానికి బ్యాంక్ సదుపాయం ఉండదు. బ్యాంక్‌కి వెళ్లాలి అంటే కొండల మీద నుండి కిలోమీటర్ల మేర క్రిందకి నడుచుకొని బ్యాంక్ ఉన్న ప్రాంతానికి వెళ్లాలి. ఇలా నగదు విత్ డ్రా చేసుకునేందుకు బ్యాంక్‌కి వెళ్లలేని గ్రామస్తులు.. బ్యాంక్‌కి అనుసంధానంగా ఉండే బ్యాంక్ పిసి సెంటర్స్ నిర్వాహకులను ఆశ్రయిస్తారు. ఇక్కడ ఉన్న గిరిజన గ్రామాలన్నీ ఒడిశా సరిహద్దు గ్రామాలు కావడంతో ఒడిశాలోని రాయగడ, కోరాపుట్‌తో పాటు ఇతర పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు బ్యాంక్ పిసి సెంటర్స్ నిర్వాహకులు ఈ గ్రామాలకు సర్వీస్ ఇస్తుంటారు. ముందుగా వారికి డబ్బులు కావాలని పిసి సెంటర్స్‌కు సమాచారం ఇస్తే వారు గ్రామానికి చేరుకొని తమ వద్ద ఉండే బయోమెట్రిక్ మిషన్ పై వేలిముద్రలు వేయించి ఖాతాల్లో ఉన్న డబ్బులు వెంటనే ఇచ్చేస్తారు.

ఇవి కూడా చదవండి

ఇలా గిరిజనులు పిసి సెంటర్స్‌ను ఆశ్రయించడమే పలువురు మాయగాళ్లకు అవకాశంగా మారింది. లబ్ధిదారులు ముందు బయోమెట్రిక్ మిషన్ పై వేలిముద్రలు వేస్తేనే ప్రభుత్వం వాటిని గుర్తించి సంక్షేమ పథకాలకు చెందిన నగదు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో వేస్తారని అమాయక గిరిజనులకు మాయమాటలు చెప్పి ఖాతాల్లో ఉన్న డబ్బు స్వాహా చేస్తున్నారు. గతంలో కూడా పలువురు పిసి సెంటర్స్ నిర్వాహకులు ఈ తరహా దందాలకు పాల్పడిన ఘటనలు అనేకం ఉన్నాయి. దీంతో జరిగిన ఘటన పై పిసి సెంటర్స్ నిర్వాహకులతో పాటు స్థానిక వాలంటీర్స్ ను కూడా పిలిచి విచారిస్తున్నారు పోలీసులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..