
ఆ భార్యా భర్తలను చూసి నిన్నమొన్నటివరకు అందరూ ఆదర్శం అనుకునేరు చుట్టుపక్కల వాళ్లు. వేరే రాష్ట్రం నుంచి వచ్చి కిక్కురుమనకుండా కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని భావించారు. ఇన్నాళ్లకు వాళ్ల అసలు బాగోతం రివీల్ అయింది. ఆ జంట ఉన్న ఊరు వదిలి కేవలం గంజాయి స్మగ్లింగ్ కోసం మరో చోటుకువచ్చి పాడు పనులు చేయడం మొదలు పెట్టారు. ఉన్న ఊర్లో గంజాయి స్మగ్లింగ్ చేస్తే అందరికి తెలిపోతుందనో లేక మరో కారణమే తెలియదు కానీ.. ఊరు కానీ ఊరు వచ్చి ఇక్కడ గంజాయి స్మగ్లింగ్‌ని మూడు పువ్వులు, ఆరు కాయలు విస్తరించారు. అయితే ఆ భార్య భర్తల కతర్నాక్ లీలలు ఎట్టకేలకు పోలీసులకి తెలియడంతో ప్రస్తుతం కటకటాల్లోకి చేరారు.
నెల్లూరు జిల్లాలో గంజాయి రవాణా, విక్రయాలను సమూలంగా అరికట్టేందుకు పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో భార్యాభర్తలు కలిసి గుట్టుచప్పుడు కాకుండా సాగిస్తున్న గంజాయి అక్రమ రవాణా గుట్టును కొడవలూరు పోలీసులు రట్టు చేశారు. మండల పరిధిలోని గండవరం ఫ్లైఓవర్ వద్ద పోలీసులు నిఘా ఉంచి వాహన తనిఖీలు, పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో అటుగా వెల్తున్న భార్యభర్తలు పోలీసులను చూసి కంగారు పడుతూ, అనుమానాస్పదంగా వ్యవహరించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా 7 కిలోల గంజాయి గుర్తించారు..
తెలంగాణలోని భద్రాద్రి కొత్త గూడెంకి చెందిన చినరాజు, లక్ష్మి (భార్యాభర్తలు). కొత్తగూడెం నుంచి జీవనోపాధి కోసం ఏపీలోని నెల్లూరు నగరానికి వలస వచ్చి, ప్రస్తుతం నెల్లూరులోని బైకాస్ రోడ్డు ప్రాంతంలో నివాసం ఉంటున్నారు.. అయితే, కష్టపడి పని చేయడం కాకుండా.. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాశతో గంజాయి విక్రయాలను ఎంచుకున్నారు. కుటుంబంగా ఉండటంతో ఎవరికీ అనుమానం రాదని భావించి, భార్యాభర్తలిద్దరూ కలిసి ఈ అక్రమ వ్యాపారానికి తెరలేపారు. అయితే పోలీసుల తనిఖీల్లో వీరి బండారం బయటపడటంతో.. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు.