Corona Deaths in Visakhapatnam : సాగర నగరం విశాఖపట్నంలో కరోనా సెకండ్ వేవ్ మరణ మృదంగం మ్రోగిస్తోంది. రాత్రి.. పగలు అనే తేడా లేకుండా స్మశాన వాటికలలో చితి మంటలు ఆరని చిచ్చులా నిరాటంకంగా కాలుతునే ఉన్నాయి . సాధారణ రోజుల్లో రోజుకు నాలుగైదు మృతదేహాలకు దహన క్రియలు జరిగే స్మశాన వాటికలకు ఇప్పుడు కనీసం 20 వరకు మృతదేహాలు క్యూ కడుతున్నాయి. మొత్తంగా ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయిన సాగర నగరంలో కరోనా కోరలు చాస్తోంది. కరోనా సోకి చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. స్మశానాల దగ్గర ఆంబులెన్స్ లు భారీగా క్యూలు కడుతున్నాయ్.. ఒక్క శవం అంతిమ సంస్కారానికి గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గత కొద్ది రోజుల నుండి విశాఖలో స్మశానాలన్నీ ఫుల్ అయ్యాయి. ఒక్కో సారి తమ వారి అంత్యక్రియలు పూర్తి చేసుకుని తిరిగి వెళ్లేందుకు బంధువులు ఒక రోజంతా స్మశానం దగ్గరే వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు దేశమంతటా కోవిడ్ విలయతాండవం చేస్తోంది. లక్షల్లో రోగులు..వేలల్లో మరణాలతో రోజుకో రికార్డ్ నమోదవుతోంది. ఏ రాష్ట్రంలో చూసినా భయానక వాతావరణమే ఉంది. రోగులతో నిండిపోతున్న హాస్పిటల్స్ ఓవైపు, మరోవైపు శవాలతో స్మశాన వాటికలు 24 గంటలు పనిచేస్తూనే ఉన్నాయి. 24గంటలు పనిచేసినా ఇంకా డెడ్ బాడీల క్యూలైన్ మాత్రం తగ్గడం లేదంటున్నారు స్మశానవాటిక నిర్వాహకులు.
మరిన్ని ఇక్కడ చూడండి: ‘ఎవరెస్ట్ శిఖరంపై కోవిడ్’ ! నార్వే పర్వతారోహకుడికి కరోనా వైరస్ పాజిటివ్, ఇప్పుడు నెగెటివ్ అట !