Dharmavaram constituency: ఇంకా ఎన్నికలకు చాలా టైం ఉంది.. కానీ ఆ నియోజకవర్గంలో సీటు కోసం ఇద్దరు నేతల మధ్య వార్ ఒక రేంజ్ లో నడుస్తోంది. అది కూడా పార్టీ వదిలేసి వెళ్లిన నేత మళ్లీ తిరిగి వస్తాడని ప్రచారం చేస్తుంటే.. వస్తే రావినవ్వండి చూద్దాం.. ఇక్కడ కండువ కప్పేది నేనే.. పోటీలో ఉండేది కూడా నేనే అంటున్నారు ఆ యువనేత. హీటెక్కించి మాటలు ఓ వైపు.. కవ్వింపులు చేసే ప్రచారం మరోవైపు ఆ నియోజకవర్గంలో రాజకీయ రగడ రాజేస్తోంది. ఇంతకీ రెండేళ్ల ముందుగానే అక్కడ టికెట్ గోల మొదలుకావడం చర్చనీయాంశంగా మారింది. అనంతపురంలో రాజకీయ వేడి పుట్టాలంటే పెద్ద రీజన్స్ ఏమీ అక్కర్లేదు.. ఎవరైనా ఎవర్నైనా ఒక్క మాట అంటే చాలు.. ఆటోమేటిక్ గా అక్కడ సీన్ మారుతుంది. పచ్చగా ఉన్న ప్రాంతం సైతం ఎరుపెక్కుతుంది. అక్కడ పాలిటిక్స్ లో కూడా ఇలాంటి సీన్లే కనిపిస్తుంటాయి. తాజాగా ధర్మవరం నియోజకవర్గంలో అసలు మ్యాటర్ లేకుండానే పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. దీనికి కారణం ధర్మవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ టికెట్ ఎవరికి ఇస్తారన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. అయితే టీడీపీలో ఇద్దరో ముగ్గరో టికెట్ ఆశిస్తున్నారనుకుంటే పొరుబాటే. ఇక్కడ టికెట్ రేసులో ఉన్న ఒకే ఒక్కరు.. అది కూడా పరిటాల శ్రీరామ్ లాంటి పవర్ ఫుల్ లీడర్. మరి ఇంక ఏంటి సమస్య.. అంటే. ఇప్పుడు పక్క పార్టీ నుంచి ఒక నేత టీడీపీలోకి వస్తారట.. ఇప్పుడు ఇదే ప్రచారం.. టీడీపీలో ఆగ్రహాన్ని.. అలాగే కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేస్తోంది…
ధర్మవరంలో మొన్నటి వరకు టీడీపీలో కీలకంగా కనిపించిన సూర్యనారాయణ… 2014లో ధర్మవరంలో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత నియోజకవర్గాన్ని మొత్తం తన గ్రిప్ లో తీసుకున్నారు. ఇక్కడ టీడీపీ అంటే నేనే అన్నట్టుగా వ్యవహరించారు. అయితే 2019ఎన్నికల్లో ఎమ్మెల్యే కేతిరెడ్డితో పోటీ పడి భారీ ఓటమి చవి చూశారు. అప్పటి వరకు సూర్యనారాయణ అండగా ఉంటారనే నమ్మకంతో బలంగా నిలిచిన నేతలు, కార్యకర్తలు నైరాశ్యంలో పడిపోయారు. ఇలాంటి సమయంలో వారికి అండగా ఉంటారనుకున్న సూర్యనారాయణ.. కేవలం నెల రోజుల వ్యవధిలోపే కండువా మార్చేశారు. టీడీపీ నుంచి కాషాయం గూటికి వెళ్లారు. దీంతో యంగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డికి ధర్మవరంలో ఎదురే లేకుండా పోయింది. టీడీపీలో తీవ్ర నైరాశ్యం.. అసలు కష్టమొస్తే చెప్పుకునే నాయకుడు లేకుండా పోయారు. అప్పుడు సరిగ్గా ఎంట్రీ ఇచ్చారు పరిటాల శ్రీరామ్. కొన్ని రోజులు శ్రీరామ్ సైలెంట్ గా కనిపించారు. కానీ అధినేత చంద్రబాబే ధర్మవరంకు నియోజకవర్గ ఇన్ ఛార్జిగా పరిటాల శ్రీరామ్ ను నియమిస్తూ బహిరంగ ప్రకటన చేశారు. ఇది కూడా ధర్మవరంలోనే ఈ ప్రకటన చేశారు.
దీంతో ధర్మవరం పై పరిటాల శ్రీరామ్ పూర్తిగా గ్రిప్ సాధించారు. కానీ రెండు నెలల నుంచి శ్రీరామ్ దూకుడు పెంచారు. మరోవైపు ముందస్తు ఎన్నికలు అంటూ వార్తలు రావడంతో ధర్మవరంలో ఒక ప్రచారం మళ్లీ కాకరేపుతోంది. అదేంటంటే.. టీడీపీ ఓటమి తర్వాత పార్టీ నుంచి వెళ్లిపోయిన సూర్యనారాయణ తిరిగి ధర్మవరంకి వస్తారని.. టికెట్ కూడా ఆయనకేనంటూ ప్రచారం సాగుతోంది. దీనిని సూర్యనారాయణ ఎక్కడా ధృవీకరించలేదు. అటు పార్టీ నుంచి కూడా ఎలాంటి సంకేతాలు రాలేదు. కానీ ఈ ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. గతంలో ఇలాంటి మాటలపై పరిటాల శ్రీరామ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఒకయాన పార్టీలోకి వస్తారని.. ప్రతి పబ్లిక్ హాలిడేకీ ప్రచారం చేస్తుంటారు. వస్తే రానివ్వండి.. పార్టీ కండువా కప్పుతా.. కష్టపడి పని చేస్తే ఏదో ఒక పదవి ఇస్తానన్నారు. ఆ తర్వాత ఇలాంటి ప్రచారం ఆగింది. కానీ మళ్లీ ఈ ప్రచారం మొదలు పెట్టడంతో పరిటాల సునీత తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఇలాంటి ప్రచారం చేస్తున్న వారికి త్వరలోనే బుద్ధి చెబుతామని.. ధర్మవరంలో శ్రీరామ్ పోటీ చేసి తీరుతారని స్పష్టం చేశారు.
ఎంత మంది ఇలాంటి మాటలు మాట్లాడినా శ్రీరామ్ ధర్మవరం బరిలో ఉంటారన్నది మాత్రం వాస్తవమని టీడీపీ నేతలంటున్నారు. ఏదేమైనా రెండేళ్ల ముందే ఎన్నికల టికెట్ పై ప్రచారాలు సాగడం.. దానికి కౌంటర్లు ఇవ్వడం మాత్రం ధర్మవరం రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నాయి.
-లక్ష్మీకాంత్ రెడ్డి, టీవీ9 తెలుగు రిపోర్టర్, అనంతపురం
Also Read: