Andhra News: మాకు పాఠాలు చెప్పండి మహాప్రభో.. ఉపాధ్యాయులపై విద్యార్థుల ఫిర్యాదు..!
ఉపాద్యాయులపై విద్యార్దుల ఫిర్యాదు చేశారు. సైన్స్ పాఠాలు చెప్పడం లేదంటూ డీఈవోకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది.
సైన్స్ పాఠాలు చెప్పడం లేదంటూ ఉన్నతాధికారులకు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. స్కూల్‌కు వస్తున్నాం కానీ పాఠాలు వినడం లేదని, ఉపాధ్యాయులు పాఠాలు చెబితే ఎందుకు వినమని విద్యార్థులు ఉన్నతాధికారులకు రాసిన వినతి పత్రంలో పేర్కొన్నారు.. మాకు పాఠాలు చెప్పండి మహా ప్రభో అంటూ విద్యాశాఖ ఉన్నతాధికారులను ఆ పాఠశాలలోని తొమ్మిదో తరగతి విద్యార్దులు ఆశ్రయించారు.
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం, వేంపల్లి మండలంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 9వ తరగతి బీ సెక్షన్‌కు ఫిజిక్స్ టీచర్ సైన్స్ పాఠాలు చెప్పడం లేదని విద్యార్థులంతా కలిసి ఎంఈఓకు వినతి పత్రం అందజేశారు. స్కూలులో నలుగురు సైన్స్ టీచర్లు ఉన్నప్పటికీ ఒక్క 9వ తరగతి బీ సెక్షన్‌కు మాత్రమే టీచర్లు ఎందుకు పాఠాలు చెప్పడం లేదో అర్థం కావడం లేదు. పాత టీచర్ కొత్త టీచర్ మీద నెట్టి వేయడం, కొత్తగా వచ్చిన టీచర్ పాత టీచర్ చెబుతాడు లే అని అతని మీద నెట్టి వేయడంతో విద్యార్థుల సిలబస్ కాక నానా అవస్థలు పడుతున్నారు. ఇంతవరకు ఫిజిక్స్ సబ్జెక్ట్‌లో మొదటి లెసన్ కంప్లీట్ కాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీంతో విసిగిపోయిన విద్యార్థులు స్కూల్ హెడ్‌మాస్టర్ దగ్గరకు వెళ్ళి మా పరిస్థితిని అర్థం చేసుకోండి మేడం అని చెప్పగా నాకీ తలనొప్పి పెట్టవద్దు కావాలంటే నేను కూడా మీతో పాటు సంతకం పెడతా ఎంఈఓ మేడంకు మీరు వెళ్ళి చెప్పుకోండి అని హెడ్‌మాస్టరే అన్నారంటే కనీసం ఉపాధ్యాయులను తాను కంట్రోల్లో పెట్టలేని పరిస్థితిలో ఉంది అనేది క్లియర్‌గా అర్థం అవుతుంది. ఇక అక్కడి నుంచి విద్యార్థులంతా కలిసి ఓ వినతి పత్రాన్ని ఎంఈవోకు అందించగా దానిని డీఈవోకు పంపించిన ఎంఈవో పరిస్థితిని అంతా జిల్లా అధికారికి వివరించారు. దీంతో డీఈవో స్కూల్లో విచారణ చేపట్టారు. 9వ తరగతి విద్యార్థులను పిలిచి వారు రాసిన వినతి పత్రంపై వివరణ తీసుకున్నారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. విద్యార్థులు వారి బాధలను చెప్పారని, ఇక్కడున్న హెచ్ఎం అలాగే ఉపాధ్యాయుల మధ్య సమన్వయ లోపం ఉందని విద్యార్థులకు పాఠాలు చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. వారిని వివరణ కోరినట్లు, వివరణ ఇచ్చిన తర్వాత వారిపై చర్యలు తీసుకుంటామని డీఈవో స్పష్టం చేశారు. ఏది ఏమైనా టీచర్ల మధ్య ఏమి ఉన్నా విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవడం చాలా నీచమైన పనిగా కనబడుతుంది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, స్థానికులు ఉపాధ్యాయులు తీరుపై మండిపడుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి