
Andhra Pradesh: సంక్షేమ హాస్టళ్లలో వసతులు, పర్యవేక్షణ పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇటీవల కాలంలో సరైన తాగునీరు ఇతర సౌకర్యాలు లేక కొందరు విద్యార్థులు తీవ్ర అనారోగ్యం పాలవగా, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వీటిపై సమీక్ష చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లల్లో తనిఖీలను మంత్రులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు మొదలుకుని క్షేత్రస్థాయి సిబ్బంది వరకు తమ విధి నిర్వహణలో భాగంగా చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లు… రెసిడెన్షియల్ స్కూళ్లల్లోని నీటి సరఫరా, పారిశుద్ధ్యం, ఇతర సదుపాయాలపై మంగళవారం సచివాలయంలో జరిపిన సమీక్షలో ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు.
ఈసందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. సంక్షేమ శాఖ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లల్లో పారిశుద్ధ్యం నూటికి నూరు శాతం నిర్వహించాలన్నారు. ఎక్కడా ఏ చిన్న పొరపాటు జరిగినా సహించేది లేదు. ఇటీవల కాలంలో హాస్టళ్లల్లో జరిగిన తప్పిదాలు మళ్లీ రిపీట్ కాకూడదు. అలాంటివి పునరావృతమైతే.. ఏం జరిగిందని తెలుసుకునేది ఉండదు.. నేరుగా బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు.
20 శాతం హాస్టళ్లల్లో టాయిలెట్ల నిర్మాణం ఇంకా జరపాల్సి ఉంది. ఈ టాయిలెట్ల నిర్మాణం కోసం అవసరమైన రూ.40 కోట్లు విడుదల చేస్తాం. టాయిలెట్ల నిర్మాణం యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి. ఆర్వో ప్లాంట్లు, టాయిలెట్లు లేకుండా హాస్టళ్లు ఉండడం సరి కాదు. గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల ఇవన్నీ జరిగాయి. ఆర్వో ప్లాంట్లు లేని ప్రతి హాస్టల్లోనూ.. ప్రతి రెసిడెన్షియల్ పాఠశాలల్లోనూ ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేయాలి. డాక్టర్లతో విద్యార్థులకు రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేయించాలన్నారు.
విద్యార్థులందరికీ బ్లడ్ టెస్ట్స్
హాస్టళ్లలోని 4.17 లక్షల మంది విద్యార్థుల రక్త నమూనాలు సేకరించి సమస్యలు ఉన్నవారిని ముందుగానే గుర్తించి చికిత్సలు అందించాలని సీఎం సూచించారు. బడుగు విద్యార్థులకు చేసే సాయాన్ని బాధ్యతగా తీసుకోవాలి. సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో హాస్టళ్లు పెట్టారు. దీనికి విఘాతం కల్గించేలా అలక్ష్యం చేస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. హాస్టళ్లల్లో పరిస్థితి పరిశీలించేందుకు క్షేత్రస్థాయి పర్యటనల చేపట్టడంతో పాటు.. పరిస్థితులపై నిత్యం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించుకోవాలన్నారు.
ప్రతి వారం ఆర్వో ప్లాంట్ల ఆడిటింగ్
“సంక్షేమ రంగానికి చెందిన శాఖలన్నీ కలిపి ఉమ్మడిగా ఓ కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసుకోవాలి. అన్ని హాస్టళ్లల్లోని విద్యార్థులకు డిజిటల్ హెల్త్ రికార్స్డ్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి. వైద్య పరీక్షలు నిర్వహించే సందర్భంగా విద్యార్థుల్లో ఏమైనా ఆరోగ్య సమస్యలు గుర్తిస్తే.. ఆ అనారోగ్య సమస్యలకు గల మూలాలను విశ్లేషించాలి. దానికి అనుగుణంగా వైద్యం అందేలా చూడాలి. ఏజెన్సీ ప్రాంతాల్లోని హాస్టళ్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెరిగేలా ప్రత్యేక కౌన్సిలర్లతో కౌన్సిలింగ్ ఇప్పించండి. బాలుర హాస్టళ్లల్లోని వారికి మగ కౌన్సిలర్ల ద్వారా.. బాలికల హాస్టళ్లలోని వారికి మహిళా కౌన్సిలర్లతో కౌన్సిలింగ్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి.
ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకునే ఆత్మస్థైర్యంతో నిలబడగలిగేలా విద్యార్థులను తీర్చి దిద్దాలి. హస్టళ్లల్లో నీటి సరఫరా విషయంలో పంచాయతీరాజ్, హెల్త్, మున్సిపల్ శాఖలు, సంక్షేమ, వైద్యారోగ్య శాఖలు కలిసి పని చేయాలి. అన్ని హాస్టళ్లల్లో వాటర్ శాంపిల్స్ కూడా తీసుకోవాలి. ఎనిమియా, సికెల్ సెల్ వ్యాధులపై అవగాహన కల్పించే బాధ్యతను అధికారులపైనే ఉంది.”అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, గుమ్మడి సంధ్యారాణి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, పంచాయతీ రాజ్, వైద్యారోగ్య శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి