కాఫీ సాగు చేసే ప్రాంతాల్లో ముందంజలో ఉన్న ప్రాంతం అరకు. అరకు కాఫీ అంటే ఆ క్రేజే వేరు.. అంతటి ప్రాముఖ్యం ఉన్న అరకు కాఫీకి ధీటుగా ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా కాఫీ తోటల సాగు విస్తృతంగా చేస్తున్నారు. అంతేకాదు అలా పండించిన కాఫీ తోటల సాగుతో లక్షాధికారులు అవుతున్నారు గిరిజనులు. ఇంతకీ గిరిజనులు సాగు చేస్తున్న కాఫీ సాగుకు మన్యం జిల్లా అనుకూలమేనా? పండించిన కాఫీ గింజలు ఎక్కడ విక్రయిస్తున్నారు. కాఫీ సాగుకు ఆ ప్రాంతంలో ఉన్న అనుకూల పరిస్థితులు ఏంటి? ప్రతికూల పరిస్థితులు ఏంటి? పూర్తి స్టోరీలోకి వెళ్లాల్సిందే..
నిద్ర లేవగానే కొందరికి కాఫీ తో దినచర్య ప్రారంభమైతే మరికొందరికి కుదిరితే కప్పు కాఫీ వీలైతే నాలుగు మాటలు అంటూ కాలక్షేపం కోసం కాఫీ కావాల్సి వస్తుంది. బాల్యం నుండి వృద్ధాప్యం వరకు ప్రతి మనిషి ఏదో సమయంలో కాఫీ త్రాగటం సర్వసాధారణం. అలాంటి కాఫీలో అగ్రగామి అరకు కాఫీ. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ సైతం అరకు కాఫీకి ప్రశంసలు కురిపించారంటే అరకు కాఫీ ప్రాధాన్యం మనకు అర్థమవుతుంది. అంతటి ఫేమస్ అయిన అరకు కాఫీకి ధీటుగా ఇప్పుడు మన్యం కాఫీ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు అరకు ప్రాంతంలో అత్యధికంగా కాఫీ సాగు అవుతుంటే ఇప్పుడు అందుకు ధీటుగా పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా కాఫీ సాగును విస్తృతంగా చేస్తున్నారు గిరిజనులు.
కాఫీ సాగుకు చల్లని వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వాతావరణం ఎక్కడ చల్లగా ఉంటే అక్కడ దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. అరకు ప్రాంతం లాంటి చల్లని వాతావరణం ఉన్న ప్రాంతం మన్యం జిల్లాలో కూడా కొంత మేర ఉంటుంది. అలాంటి ప్రదేశాన్ని గుర్తించిన అధికారులు రైతులకు కాఫీ పంట పై అవగాహన కల్పించి ఉచితంగా కాఫీ సాగుకు కావాల్సిన గింజలు, ఇతర సదుపాయాలు గిరిజన సహకార సంస్థ ద్వారా ఏర్పాటు చేశారు. దీంతో సాలూరు ఏజెన్సీ లోనే పాచిపెంట, సాలూరు మండలాల్లో పలు గ్రామాల్లో కాఫీ సాగు ప్రారంభించారు గిరిజనులు. వాటిలో ప్రధానంగా గిరిశిఖర గ్రామాలైన సదాబి, తంగలాం, చిల్లిమామిడి గ్రామాల్లో అధికంగా ఈ కాఫీ సాగు చేస్తున్నారు. ఇక్కడ వందల ఎకరాల్లో కాఫీ పంట పండిస్తూ అరకుకు ధీటుగా అంతే స్థాయిలో కాఫీ సాగు చేస్తున్నారు. గిరిజనులు పండించిన కాఫీ గింజలు కేజీ సుమారు 300 నుండి 350 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. అలా ఒక ఎకరానికి సుమారు డెబ్భై వేల వరకు లబ్ధి పొందుతున్నారు గిరిజనులు.
అయితే వీరు పండించిన కాఫీ గింజలను అరకుకు వెళ్లి అమ్ముకోవడం తప్పా మరో మార్గం లేదు. ఇక్కడ నుండి అరకు వెళ్లి అమ్ముకోవటం వల్ల రవాణా ఖర్చులు భారంగా మారాయి. తమకు తమ మండలంలోనే గిరిజన సహకార సంస్థ ద్వారా తాము పండించిన కాఫీ గింజలను కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని కోరుతున్నారు ఇక్కడి గిరిజన రైతులు. తమకు మరిన్ని ప్రోత్సాహకాలు ఇస్తే కాఫీ సాగును మరింత అధికంగా చేస్తామని అంటున్నారు రైతులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..