Sankranti Cock Fights: సంక్రాంతి పండక్కి మొదలైన కోడి పందెం హంగామా..! రూ.40 కోట్లకుపైగా బెట్టింగ్‌లు షురూ

ఈ ఏడాది కూడా కోడి పందాల నిర్వహణకు అనుమతిలేదంటూ పోలీసులు చెబుతున్నా.. మరోవైపు బహిరంగంగానే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని..

Sankranti Cock Fights: సంక్రాంతి పండక్కి మొదలైన కోడి పందెం హంగామా..! రూ.40 కోట్లకుపైగా బెట్టింగ్‌లు షురూ
Cock Fighting
Follow us

|

Updated on: Jan 12, 2023 | 9:31 AM

ప్రతి ఏటా ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా సంక్రాంతి పండగ సీజన్‌లో పోలీసులు వంద కళ్లతో గస్తీకాసినా పందెం రాయుళ్లు కోడి పందాలకు కాలు దువ్వుతూనే ఉంటారు. ఒకప్పుడు పౌరుషాలకు, పంతాలకు ప్రతీకగా భావించే కోడి పందాలు.. ప్రస్తుతం కోట్లు కుమ్మరించే వ్యాపారంగా పరిణమించింది. కోళ్ల అమ్మకాల నుంచి బరిలో దింపిన కోడిపుంజులపై కాసే పందాల వరకూ పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. పందాల కోసం కోళ్లను సిద్ధం చేసే ప్రక్రియలో అనేకమంది ఉపాధి పొందుతున్నారు. పందెం కోడిని గుర్తించడం, దానికి తగిన ఆహారం అందించడం, కసరత్తులు చేయించి, పందాలకు పురిగొల్పడం ఓ విద్యగా మారింది. అది తెలిసిన వారికి గ్రామాల్లో కొంత గిరాకీ కూడా ఉంటుంది. బరుల్లో రోజుకి ఒక్కో చోట నాలుగైదు కోట్ల రూపాయల పందాలు జరుగుతాయి. వీటికి బడా నాయకులు, సెలబ్రిటీలు హాజరవుతుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడు రోజులకు కలిపి మొత్తం రూ.40 కోట్లకు పైగా పందాలు జరుగుతాయి.

పండగకు కొద్దిరోజుల ముందు పోలీసులు కాస్త హంగామా చేసినా.. పందెం నిర్వహించే ఆ మూడు రోజులు మాత్రం పోలీస్ స్టేషన్లకు అతి సమీపంలోనే పందాలు జరుగుతున్న చూసీచూడనట్టు వ్యవహరిస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఏడాది కూడా కోడి పందాల నిర్వహణకు అనుమతిలేదంటూ పోలీసులు చెబుతున్నా.. మరోవైపు బహిరంగంగానే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి, బాపట్ల, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, భీమవరం జిల్లాల్లో ఎక్కువగా ఉంటుంది. ఒక్కో బరిలో కనీసంగా గంటకు నాలుగైదు పందాలు నడుస్తాయి. రోజులో 100 పందాల వరకూ సాగేందుకు అవకాశం ఉంటుంది. ప్రతీ పందెంలోనూ గెలిచిన వారు అందులోంచి కొంత మొత్తం నిర్వాహకులకు అందిస్తారు. బరుల నిర్వాహకుల నుంచి పోలీసులకు, ప్రజా ప్రతినిధులకు కూడా మామూళ్లు అందించాల్సి ఉంటుందని స్థానికులు మీడియాకు తెలిపారు. ఇదంతా బహిరంగ రహస్యంగా జరిగిపోతుంది. రానురానూ సంక్రాంతి అంటే కోడిపందాలు అన్నట్టుగా మారిపోయింది. చాలా చోట్ల సందడి అంతా పందాల బరుల దగ్గరే కనిపిస్తుంది. జనసందోహంతో పగలూ, రాత్రి తేడా లేకుండా సాగిపోతుందని కోనసీమ స్థానికులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.