
విజయనగరం జిల్లాలో సినిమా స్టైల్‌లో సాగిన కిడ్నాప్ డ్రామాకు ఎండ్ కార్డ్ వేశారు పోలీసులు. కిడ్నాప్ చేసి లక్షలాది రూపాయలు కాజేయాలని చూసిన కిడ్నాపర్ల ఆశలు ఆవిరై కటకటాల పాలయ్యారు. నవంబర్ 23న విశాఖకు చెందిన మహేష్ కుమార్ అనే కోస్ట్ గార్డ్ ఉద్యోగి తన స్నేహితుడిని కలుసుకోవటానికి విశాఖ నుంచి విజయనగరం జిల్లా డెంకాడ వచ్చాడు. అలా స్నేహితుడిని కలిసిన తరువాత ఇద్దరూ కలిసి స్కూటీపై డెంకాడ నుంచి రామనారాయణం వైపు వెళ్తుండగా పడాలపేట రోడ్ సమీపంలో అకస్మాత్తుగా కారు వచ్చి అడ్డుకుంది. వెంటనే కారులో నుంచి దిగి వచ్చిన ఓ వ్యక్తి నేను డీఎస్పీ అని చెప్పి మహేష్‌ను కారులోకి ఎక్కాలని ఆదేశించాడు. మహేష్ తిరస్కరించగా మరికొందరు వచ్చి మహేష్‌ను బలవంతంగా కారులోకి ఎక్కించి, దుర్భాషలు ఆడుతూ, శారీరకంగా హింసించి చిత్రహింసలకు గురిచేస్తూ డబ్బులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే మెడలోని చైన్, చేతి ఉంగరం, పది వేల నగదు దోచుకుని, ఖాళీ పేపర్లపై సంతకాలు తీసుకొని, ఇరవై లక్షలు ఇవ్వకపోతే ప్రాణాలు తీస్తామని బెదిరించారు. తరువాత అతన్ని విశాఖలో విడిచిపెట్టారు. ఏదో ఒక విధంగా వారి వద్ద నుంచి బయటపడ్డ మహేష్ కుమార్ విజయనగరంలోని తన స్నేహితుడికి విషయం చెప్పి అతని సహాయంతో పోలీసులను ఆశ్రయించాడు.
కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు..ఈ కిడ్నాప్ వెనుక అసలు సూత్రధారి కొండకరకాం గ్రామానికి చెందిన బోడసింగి సుదర్శనరావు అని గుర్తించారు. విశాఖలో సుదర్శనరావు.. మహేష్ కుమార్ వద్ద శిక్షణ తీసుకుంటుండగా అక్కడ మహేష్ సంపాదన చూసి అతన్ని కిడ్నాప్ చేస్తే డబ్బు వస్తుందన్న దురాలోచనతో ఒక కిడ్నాప్ గ్యాంగ్‌ను ఏర్పాటు చేశాడు. మహేష్‌ను కిడ్నాప్ చేయడానికి సుమారు నెల రోజుల పాటు రెక్కీ నిర్వహించారు. ఎట్టకేలకు ప్లాన్ అమలు చేసి విజయవంతంగా కిడ్నాప్ చేశారు. ప్రాథమికంగా విషయం తెలుసుకున్న పోలీసులు.. రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు మొదలుపెట్టారు. డిసెంబర్ 3న చెల్లూరు బైపాస్ వద్ద ముఠా సభ్యులు కిలపర్తి నాగన్నాయుడు, పొన్నా రామకృష్ణ, బుడ్డా పరమేష్, నేలతోటి చిరంజీవిలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మూడు కార్లు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని త్వరలో అరెస్ట్ చేస్తామని అన్నారు సీఐ లక్ష్మణరావు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.