Andhra Pradesh: ఏపీలోని ఆరోగ్య మిత్రలకు సీఎం జగన్ గుడ్ న్యూస్ .. ఇకపై వారికి కూడా..

దశాబ్దాలుగా మార్పులకు నోచుకోని విద్య, వైద్యం లాంటి రంగాల్లోని వ్యవస్థలను మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం జగన్ చెప్పారు. విద్య, వైద్యం, వ్యవసాయ, గృహనిర్మాణం తదితర కీలక రంగాల్లో తీసుకొచ్చిన మార్పులు చరిత్రాత్మకం అన్నారు.

Andhra Pradesh: ఏపీలోని ఆరోగ్య మిత్రలకు సీఎం జగన్ గుడ్ న్యూస్ .. ఇకపై వారికి కూడా..
Cm Jagan
Follow us

|

Updated on: Apr 12, 2022 | 4:30 PM

వైద్య, ఆరోగ్యశాఖపై తాడేపల్లి(Tadepalli) క్యాంప్ ఆఫీస్‌లో సీఎం జగన్‌(CM Jagan) సమీక్ష నిర్వహించారు.  ఆరోగ్యశ్రీ ఆసుపత్రులలో ఏర్పాటు చేయనున్న సమాచార కియోస్క్‌ మోడల్‌ను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఆరోగ్యశ్రీలో మరింత సులువుగా వైద్య సేవలు పొందడం ఎలా అనే విధంగా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. రాష్ట్రంలో కోవిడ్‌(Coronavirus) పరిస్థితులను అధికారులు సీఎంకు వివరించారు. డైలీ యాక్టివిటీ రేటు 0.13శాతానికి గణనీయంగా పడిపోయిందని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కీలక కామెంట్స్ చేశారు. ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని స్పష్టం చేశారు. ప్రజలకు మంచి జీవన ప్రమాణాలు అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు.  విద్య, వైద్యం, వ్యవసాయ, గృహనిర్మాణం రంగాల్లో తీసుకొచ్చిన మార్పులు చరిత్రాత్మకం అని వెల్లడించారు. .విలేజ్‌ / వార్డు క్లినిక్స్‌, టీచింగ్‌ ఆస్పత్రుల్లో నాడు – నేడు కింద అభివృద్ధి పనులు చేపడుతున్న విషయాన్ని గుర్తుచేశారు.  ఆరోగ్య శ్రీ కింద ఎలాంటి పెండింగ్‌ బిల్లులు లేకుండా ఎప్పటికప్పుడు చెల్లింపులు జరుపుతున్నట్లు చెప్పారు. ఆరోగ్య శ్రీ కింద చికిత్సల సంఖ్యను గణనీయంగా పెంచామన్నారు. కొత్తగా 16 టీచింగ్‌ ఆస్పత్రులను తీసుకువస్తున్నట్లు జగన్ చెప్పారు. ల‌క్ష్యాల‌ను అందుకునేందుకు అధికారులు యజ్ఞంలా పనిచేయాలన్నారు. ప్రజలకు తప్పకుండా వైద్యుల సేవలు అందుబాటులో ఉండేందుకు గతంలో జీతాలు పెంచుతూ కొన్ని నిర్ణయాలు తీసుకుని ఆమేరకు వారికి జీతాలు ఇచ్చేలా నిర్ణయాలు తీసుకున్నామన్నారు. అందుకనే ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్‌పై నిషేధం విధించామని సీఎం జగన్‌ తెలిపారు.

ఇక  వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై సీఎం ఆరా తీశారు.  మే నెలాఖరు నాటికి అన్ని నియామకాలు పూర్తిచేయాలని సూచించారు. 16 మెడికల్‌ కాలేజీల్లో 6 చోట్ల జోరుగా నిర్మాణాలు సాగుతున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఆస్పత్రుల్లో సౌకర్యాలను, సదుపాయాలను పర్యవేక్షించాలని అధికారులకు సీఎం సూచించారు. టాయిలెట్ల దగ్గరనుంచి ప్రతి విభాగం పరిశుభ్రంగా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆరోగ్యశ్రీలో అవసరమైన మేరకు ఇంకా ప్రొసీజర్లను పెంచాలనుకుంటే పెంచాలని సూచించారు. ప్రతిభ ఆధారంగా వాలంటీర్ల మాదిరిగా ఆరోగ్య మిత్రలకు కూడా నగదు ప్రోత్సహకాలు ఇవ్వాలని… సీఎం అధికారులకు సూచించారు. దీని ద్వారా ఆరోగ్య మిత్రల సేవలనూ గుర్తించినట్టు అవుతుందని చెప్పారు. ఏడాదిలో ఒక రోజు ఎంపిక చేసి, ఆరోజు నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలని సీఎం వైఎస్‌ జగన్‌ సూచించారు.

Also Read: Krishna District: మంత్రి జోగి రమేష్ ఊరేగింపులో అపశృతి.. సర్పంచ్ గుండెపోటుతో మృతి