విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఏపీ సీఎం జగన్ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన పథకం జగనన్న వసతి దీవెన. ఈ పథకం ద్వారా ఏటా రెండు విడతల్లో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ అభ్యసించే వారికి రూ.20 వేల వరకు వసతి, భోజన, రవాణా ఖర్చుల కోసం వారి తల్లుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయనుంది. కాగా సోమవారం (ఏప్రిల్ 17) జగనన్న వసతి దీవెన లబ్ధిదారుల ఖాతాల్లో తదుపరి విడత నిధులు జమ కావాల్సి ఉంది. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నార్పల వేదికగా సీఎం జగన్ బటన్ నొక్కి ఈ నగదు జమ చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడీ కార్యక్రమం వాయిదా పడింది. అనివార్య కారణాల వల్ల సీఎం జగన్ అనంతపూర్ పర్యటన రీషెడ్యూల్ అయ్యింది. ఈ మేరకు నార్పల మండల కేంద్రంలో సోమవారం జరగబోయే జగనన్న వసతి దీవెన కార్యక్రమం వాయిదా వేస్తున్నట్లు అనంతపూర్ జిల్లా కలెక్టర్ ఎమ్. గౌతమి ఒక ప్రకటన విడుదల చేశారు. అలాగే సీఎం జగన్ పర్యటన రద్దు అయినట్లు శింగనమల ఎమ్మెల్యే కార్యాలయం అధికారికంగా ప్రకటించింది.
కాగా సీఎం జగన్ ఈనెల 26న అనంతపురం జిల్లా నార్పల పర్యటనకు వెళ్లనున్నట్టుగా సీఎంవో అధికారులు తెలిపారు. ఆ రోజే లబ్ధిదారుల ఖాతాల్లో జగనన్న వసతి దీవెన నిధులు జమ చేయనున్నారు. అయితే సోమవారం సాయంత్రం విజయవాడలో సీఎం జగన్ పర్యటన యథావిథిగా కొనసాగనుంది. విజయవాడ వన్ టౌన్ విద్యాధరపురంలోని మినీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.