రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్లీన్ స్వీప్ చేయడం కష్టమేమీ కాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి మరోసారి పార్టీ నేతలకు స్పష్టం చేశారు. అవినీతి లేకుండా, పక్షపాతం చూపకుండా పాలన అందిస్తుంటే ఎందుకు గెలవలేమని ప్రశ్నించారు. సంక్షేమ పథకాల ద్వారా మంచి జరిగిన కుటుంబాలన్నీ మనల్ని ఆశీర్వదిస్తున్నాయని సీఎం చెప్పారు. గ్రామ సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్, ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు, నాడు–నేడుతో పల్లెల ముఖచిత్రం సంపూర్ణంగా మారుతోందన్నారు. చేసిన మంచి కళ్లెదుటే కనిపిస్తోందని.. వాటిని చూసి మనమే అధికారంలో ఉండాలని ప్రతి చోటా ప్రజలు కోరుకుంటున్నారని సీఎం జగన్ స్పష్టం చేశారు. ప్రజల్లోకి వెళ్లి చేసిన మంచిని వివరించాలని, వచ్చే ఎన్నికల్లో గెలిచాక వచ్చే 30 ఏళ్లూ మనమే అధికారంలో ఉంటామని వివరించారు. అందరం కలిసికట్టుగా ముందడుగు వేసి క్లీన్ స్వీప్ చేద్దామని పిలుపునిచ్చారు. మూడున్నరేళ్లుగా ప్రజలకు చేస్తున్న మంచిని వివరించడానికే గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టామన్న సీఎం జగన్.. గతానికి భిన్నంగా పరిపాలన కొనసాగుతోందని తెలిపారు. మంచి చేశామని సగర్వంగా తలెత్తుకునేలా మన పరిపాలన జరుగుతోందని వివరించారు.
మరో 18 నెలల్లో రానున్న ఎన్నికలకు సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. సమయం ఉంది కదా అని లైట్ తీసుకోవద్దు. ఇవాళ్టి నుంచే ఎన్నికల గురించి ఆలోచన చేయాలి. 18 నెలల తర్వాత ఎన్నికలున్నా ఆ అడుగులు ఇవాళ్టి నుంచి కరెక్ట్‌గా పడితేనే క్లీన్‌స్వీప్ చేయగలుగుతాం. ప్రతి పథకాన్ని పారదర్శకంగా అమలు చేశాం. అర్హులెవరూ మిస్ కాకుండా వాలంటీర్లు, సచివాలయం ద్వారా ఇంటింటికీ చేర్చాం. ప్రతి నియోజకవర్గం, గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకుంటే ప్రతి గ్రామంలోనూ 87 శాతం ఇళ్లకు మంచి చేశాం. మనలో మనకు ఎన్ని విభేదాలున్నా పక్కనపెట్టాలి. అందరం కలిసికట్టుగా ఒక్కటవుదాం. ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు, గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్ ద్వారా నాణ్యమైన సేవలు అందిస్తున్నాం. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ను ఉగాది నుంచి రాష్ట్రవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలవుతుంది.
– వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
మరోవైపు.. డిసెంబరు నాటికి 1.10 లక్షలు టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఫేజ్-1కు సంబంధించి దాదాపుగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ముగిసిందని అధికారులు సీఎంకు వివరించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గృహనిర్మాణ శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. టిడ్కో ఇళ్ల నిర్వహణ బాగుండాలని సీఎం ఆదేశించారు. వాటిని పట్టించుకోకపోతే మళ్లీ మురికి వాడలుగా మారే ప్రమాదం ఉంటుందన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..