CM Jagan: అనంతపురం ఘటనపై సీఎం సీరియస్.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆర్డర్స్..
అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం దర్గాహొన్నూరులో విద్యుత్ తీగలు తెగి పడి నలుగురు మహిళా కూలీలు మృతి చెందిన ఘటన పై సీఎం జగన్ స్పందించారు. ఈ మేరకు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునేందుకు..
అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం దర్గాహొన్నూరులో విద్యుత్ తీగలు తెగి పడి నలుగురు మహిళా కూలీలు మృతి చెందిన ఘటన పై సీఎం జగన్ స్పందించారు. ఈ మేరకు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. అన్ని డిస్కంల పరిధిలో ఆడిట్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియను రెండు వారాల్లోగా పూర్తి చేయాలన్న సీఎం జగన్.. ఇలాంటి సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయో తక్షణమే గుర్తించాలని ఆర్డర్స్ ఇష్యూ చేశారు. ఈ ఘటనపై సమగ్ర అధ్యయనం చేయాలని, ఆ తర్వాత తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. విద్యుత్ శాఖ ఏడీ, ఏఈ, లైన్ ఇన్స్పెక్టర్ ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం అదేశాలు జారీ చేసింది. బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించేలా తగిన చర్యలు తీసుకోవాలని డిస్కం అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. గాయపడిన వారికి చికిత్స అందించడంతో పాటు, మృతుల కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
కాగా.. అనంతపురం జిల్లాలోని దర్గా హొన్నూరు వద్ద బుధవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. గ్రామానికి సమీపంలోని పొలంలో ఆముదం పంట దిగుబడిని తీసేందుకు బుధవారం ఉదయం 8.30 గంటలకు ట్రాక్టరులో 14 మంది కూలీలు వెళ్లారు. వీరిలో ఎనిమిది మంది మహిళలు, ఆరుగురు పురుషులు ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పని పూర్తి కావడంతో ఇంటికి వచ్చేందుకు తిరుగుపయనమయ్యారు. కూలీలను ఎక్కించుకుని, ట్రాక్టర్‌ను రివర్స్ చేస్తుండగా ఊహించని ఘటన జరిగింది.
11 కేవీ విద్యుత్ తీగ షార్ట్ సర్క్యూట్ కారణంగా తెగి ట్రాక్టరుపై పడడంతో విద్యుదాఘాతం సంభవించింది. ఈ ఘటనలో వన్నక్క, రత్నమ్మ, శంకరమ్మ, పార్వతి అక్కడికక్కడే మృతి చెందారు. ఐదుగురికి గాయలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం బళ్లారికి తరలించారు. వీరిలో సుంకమ్మ అనే మహిళా కూలీ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి