ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరికొన్ని గంటల్లో నాయకుల భవితవ్యం బయటపడనుంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ఒక సందేశాన్ని అందించారు. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్పూర్తిని చాటారన్నారు. జూన్ 4న జరిగే కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్పూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. ప్రజలు తమకు వేసిన ప్రతి ఓటును వైఎస్ఆర్సీపీ ఖాతాలో పడేలా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. తద్వారా తమ పార్టీకి అఖండ విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నానన్నారు.
ఇదిలా ఉంటే ఏపీలో జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందని స్థానిక సర్వేలు ఎగ్జిట్ పోల్స్ ను వెలువరించాయి. అదే క్రమంలో కొన్ని జాతీయ పార్టీలు కూటమి అధికారం సాధిస్తుందని స్పష్టం చేసింది. ఈ రెండు సర్వేల నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ పై గందరగోళ పరిస్థితి నెలకొంది. అందుకే ప్రతి ఓటు కీలకమని భావిస్తున్నారు ఇరుపార్టీల నేతలు. ఈ తరుణంలోనే కౌంటింగ్ ఏజెంట్లను అప్రమత్తం చేస్తున్నారు. అయితే పార్టీ గెలుపుపై కీలక నేతలు సహా అధినేత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధీమాగా ఉన్నారు. తను చేసిన సంక్షేమం పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకొచ్చేలా చేస్తుందని భావిస్తున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా వైసీపీ గెలవబోతోందని, సంబరాలకు సిద్దంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు. రేపు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ… ప్రజలు మనకు వేసిన ప్రతి ఓటునూ మన పార్టీ ఖాతాలోకి వచ్చేలా అప్రమత్తంగా వ్యవహరించి మన పార్టీకి అఖండ విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నాను.
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 3, 2024
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..