ఒకే వేదికపై బోండా ఉమా, అంబటి రాంబాబు.. టీడీపీ నేతలకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్..

గుంటూరులో జరిగిన ముద్రగడ పద్మనాభం సంతాప సభలో టీడీపీ నేత బోండా ఉమా, వైసీపీ నేత అంబటి రాంబాబు ఒకే వేదికను పంచుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌లో స్పందిస్తూ, వైసీపీ నేతలతో ఎట్టి పరిస్థితుల్లోనూ వేదిక పంచుకోవద్దని స్పష్టం చేశారు.

ఒకే వేదికపై బోండా ఉమా, అంబటి రాంబాబు.. టీడీపీ నేతలకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్..
CM Chandrababu Naidu

Updated on: Jul 26, 2026 | 5:05 PM

ఏపీ రాజకీయల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.. గుంటూరులో నిర్వహించిన ముద్రగడ పద్మనాభం సంతాప సభలో టీడీపీ నేత, ప్రభుత్వ విప్ బోండా ఉమా, వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు వేదికను పంచుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ సభలో బోండా ఉమా, అంబటి రాంబాబు సరదా సంభాషణలతో కనిపించారు. అయితే.. ఉప్పు-నిప్పులా ఉండే పార్టీల నేతల వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే.. బోండా ఉమ, అంబటి వేదిక పంచుకోవడంపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. వైసీపీ నేతలతో ఎట్టిపరిస్థితుల్లో వేదిక పంచుకోవద్దని స్పష్టం చేశారు. పార్టీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించారు చంద్రబాబు. గొడ్డలి పార్టీ అనేది విష వృక్షం లాంటిదని.. ఈ విషయాన్ని ప్రతి టీడీపీ నేత గుర్తుంచుకోవాలని సూచించారు. నిత్యం కులాలు, మతాల పేరుతో విద్వేషాలు రగిలించడమే వైసీపీ అజెండా అన్నారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. టీడీపీ నేతలెవరూ వారి పార్టీ ట్రాప్‌లో పడొద్దని సూచించారు.

పార్టీ వ్యూహాలు, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై చర్చించిన చంద్రబాబు.. వైసీపీ నిత్యం కులాలు, మతాల పేరుతో విద్వేషాలు రగిలించడమే ఆ పార్టీ అజెండాగా మారిందని ఆరోపించారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు వారు చేస్తున్న కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. దృష్టి మొత్తం అభివృద్ధి, సంక్షేమంపై ఉండాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారమే మన ప్రధాన లక్ష్యం అంటూ నేతలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఏ కార్యక్రమంలోనూ పాల్గొనకుండా, ప్రజలకు మరింత చేరువగా వెళ్లాలని టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు.

ఇటీవల బొండా ఉమ, అంబటి రాంబాబు ఒకే వేదికను పంచుకోవడంతో పాటు వివిధ సందర్భాల్లో టీడీపీ, వైసీపీ నేతలు ఒకే వేదికపై కనిపించడం గతంలో చర్చ జరిగింది. దీంతో ఈ అంశంపై ఇటు అధికార పార్టీలోనూ చర్చ మొదలైంది. ఇది కేడర్‌కు తప్పుడు సంకేతాలు పంపుతుందన్న భావనలో ఉన్న టీడీపీ నాయకత్వం.. ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది.

Follow Us