
ఏపీ ప్రజలకు కూటమి సర్కార్ శుభవార్త అందించింది. ఈ మేరకు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఏపీలోని రైల్వే ప్రాజెక్టులపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. రాయలసీమ ప్రాంతాలను కోస్తాంధ్రలోని ప్రాంతాలతో అనుసంధానించేలా రైల్వే కనెక్టివిటీపై చర్చించారు. ఈ క్రమంలో రైల్వే అభివృద్ది ప్రణాళికలపై అధికారులను అడిగి చంద్రబాబు వివరాలు తెలుసుకున్నారు. అలాగే పలు రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించే అంశంపై చర్చించారు.
హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు, చెన్నై-బెంగళూరు మార్గాల్లోని లైన్లను హైస్పీడ్ రైల్వే కారిడార్లుగా అభివృద్ది చేయడంపై చంద్రబాబు చర్చించారు. దీనికి సంబంధించిన ప్రణాళికల గురించి అధికారులను అడిగి అన్ని వివరాలు తెలుసుకున్నారు. అటు విజయవాడ, రేణిగుంట, గుంటూరు, విశాఖపట్నం లాంటి ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఇక్కడ రద్దీని తగ్గించే విషయంపై అధికారులను అడిగి తెలుసున్నారు. ఈ భేటీలో దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే, దక్షిణ కోస్తా రైల్వే అధికారులు పాల్గొన్నారు.
అటు హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ కారిడార్ ప్రాజెక్ట్, ప్యూచర్ సిటీ-అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే మార్గంలో హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ కారిడార్ రైలు కనెక్టివిటీ ఉండాలని సూచించారు. ఈ రైలు నెట్‌వర్క్ ఏపీ మీదుగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించారు. ఇక ఏపీలోని వివిధ పోర్టులను రైలు కనెక్టివిటీతో అనుసంధానం చేయడంపై చంద్రబాబు చర్చించారు. అలాగే తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలకు చెందిన హింటర్ ల్యాండ్ నుంచి రైలు రవాణాపై రైల్వేశాఖ ఉన్నతాధికారులతో చంద్రబాబు చర్చలు జరిపారు.