Andhra Pradesh: కొత్త జిల్లాల ఏర్పాటు అంశంపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.. మరోసారి..

ఏపీ జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. మంత్రుల కమిటీ విస్తృతంగా చర్చించి, ప్రజల సూచనలు, అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించారు. మార్కాపురం, మదనపల్లె సహా కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ల సరిహద్దులపై చర్చించి తుది నివేదిక సమర్పించనుంది. సీఎం ఆమోదం తర్వాత కీలక ప్రకటన చేయనున్నారు.

Andhra Pradesh: కొత్త జిల్లాల ఏర్పాటు అంశంపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.. మరోసారి..
Ap District Reorganization

Edited By: Krishna S

Updated on: Nov 24, 2025 | 6:32 PM

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేశారు. ఈ అంశంపై ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ ఇంకా విస్తృతంగా చర్చించాలని సీఎం ఆదేశించారు. కమిటీ మళ్లీ సమావేశమై ప్రతిపాదనలు, అభ్యంతరాలు, ప్రజల నుంచి వచ్చిన సూచనలను పరిశీలించాలని సూచించారు. తుది నిర్ణయాన్ని ముఖ్యమంత్రి అధ్యక్షతన తీసుకోనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. జిల్లాల విభజనపై సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం జరిగింది. మార్కాపురం, మదనపల్లె జిల్లాల ఏర్పాటు తో పాటు మంత్రుల కమిటీ ముందుకు వచ్చిన పలు జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. అలాగే కొత్త జిల్లాల సరిహద్దులు, రెవెన్యూ డివిజన్ల పునర్విభజన, నియోజకవర్గ విస్తరణ వంటి అంశాలపై సీఎంతో మంత్రుల కమిటీ సమాలోచనలు చేసింది.

సీఎం ఆదేశాల మేరకు జిల్లాల పునర్వవస్తీకరణపై మంత్రివర్గ ఉపసంఘం వివరణాత్మక నివేదికను సమర్పించింది. మంత్రులు అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్థన్ రెడ్డి, వంగలపూడి అనిత, నారాయణ, సత్యకుమార్ యాదవ్‌లతో కూడిన కమిటీ ఈ నివేదికను సీఎంకు అందించింది. గత ప్రభుత్వ కాలంలో అశాస్త్రీయంగా జరిగిన విభజనను సరిచేయాలనే దృష్టితో ఈ నివేదిక రూపొందించినట్టు ఉపసంఘం వివరించింది. ముఖ్యంగా మండలాలు, పంచాయతీలను విడదీయకుండా నియోజకవర్గానికి చెందిన ప్రాంతం ఒకే రెవెన్యూ డివిజన్‌లో ఉండేలా నిర్ణయం తీసుకున్నారు.

మార్కాపురం, మదనపల్లె కేంద్రాలుగా కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ఉపసంఘం సానుకూలత తెలిపిన విషయంతో పాటు నూజివీడు నియోజకవర్గంను ఎన్టీఆర్ జిల్లాలోకి, కైకలూరును కృష్ణా జిల్లాలోకి, గూడూరును తిరుపతి నుంచి నెల్లూరులోకి తిరిగి చేర్చడంపై నివేదికలో పేర్కొంది. గన్నవరం నియోజకవర్గంను ఎన్టీఆర్ జిల్లాలో కలపడాన్ని స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించి ఉపసంఘం తీసుకున్న నిర్ణయాన్ని సమావేశంలో ప్రస్తావించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 77 రెవెన్యూ డివిజన్లు ఉండగా మరో ఆరు కొత్త డివిజన్లు చేరే అవకాశాన్ని కూడా నివేదికలో తెలిపింది.

జనగణన ప్రకారం ఈ ప్రక్రియను డిసెంబర్ 31లోగా పూర్తి చేయాల్సి ఉంది. ఇందుకోసం ఉపసంఘం రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన దాదాపు 200 వినతులను పరిశీలించింది. కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంఘాలతో పాటు నేరుగా ప్రజల సూచనలను కూడా పరిగణలోకి తీసుకుంది. వీటన్నింటినీ సీఎం దృష్టికి తీసుకెళ్లగా మరింత విస్తృతంగా చర్చించాలని మంత్రి వర్గ ఉపసంఘానికి సీఎం సూచించారు. దీంతో మరోసారి మంత్రుల కమిటీ సమావేశం కానుంది. అనంతరం సీఎంతో చర్చించి ప్రకటన చేయనుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.