Chittoor: అక్కడ వన్యప్రాణులకు వేటగాళ్ల ముప్పు.. నాటు బాంబులకు బలి అవుతున్న ఏనుగులు

చిత్తూరు జిల్లాలో వన్యప్రాణులకు పెద్ద కష్టమే వచ్చింది. వేటగాళ్ల చర్యలతో నష్టం ఏనుగులకు కూడా వస్తోంది. అడవి పందుల కోసం వేట కొనసాగించే వేటగాళ్లు, మరోవైపు అటవీ ప్రాంతానికి సమీపంలో పంట పొలాలను కాపాడుకునేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెలు వన్య ప్రాణులకు శాపంగా మారింది. తరచూ ప్రమాదాలకు గురవుతున్న వన్యప్రాణులు కొన్ని వేటగాళ్లకు దొరికిపోతుండగా మరికొన్ని గాయపడి మృత్యువాత పడుతున్నాయి.

Chittoor: అక్కడ వన్యప్రాణులకు వేటగాళ్ల  ముప్పు.. నాటు బాంబులకు బలి అవుతున్న ఏనుగులు
Wild Animals Trapped Chittoor

Edited By: Surya Kala

Updated on: Apr 08, 2025 | 6:31 PM

చిత్తూరు జిల్లాలోని అటవీ ప్రాంతంలో చిరుతల నుంచి పశువులు, కుక్కలు, అడవి పందులు, జింకలు, దుప్పిలు, ఏనుగులు కూడా వేటగాళ్లు ఉచ్చుకు బలి అవుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో
రాయల్ ఎలిఫెంట్ శాంచ్యూరీ లోని వన్యప్రాణులకే ముప్పు వాటిల్లుతోంది. అడవి వదిలి ఆకలి తీర్చుకునేందుకు వచ్చే ప్రయత్నంలో వేటగాళ్ల ఉచ్చుకు వన్యప్రాణుల ప్రాణాల బలిఅవుతున్న పరిస్థితి ఉంది. ఇలాంటి ఘటనకే బంగారు పాల్యం మండలం బోడబండ్ల అటవీ ప్రాంతంలో నాటు బాంబు పేలుడుకు ఏనుగు గురైంది. నాలుగు రోజుల క్రితం ఈ ఘటన జరగ్గా చిత్తూరు జిల్లా అటవీశాఖ లోతైన దర్యాప్తు చేపట్టింది.

ఏనుగు బతికే ఉందా..

అటవీ ప్రాంతంలో నాటు బాంబు దాడికి ఏనుగు ఎలా గురైంది అసలు నాటు బాంబులు పెట్టింది ఎవరు అన్న దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. అటవీ శాఖ సిబ్బంది రెండ్రోజుల పాటు అడవిని జల్లెడ పట్టింది.
పశువైద్య సిబ్బంది తో కలిసి ఏనుగు ఆచూకీ కోసం ప్రయత్నం చేసింది. డ్రోన్ కెమెరాలతో ఏనుగును గుర్తించే ప్రయత్నం చేసిన ఫారెస్ట్ అధికారులు నాటు బాంబులు పెట్టిన వారెవరో తెలుసుకునే ప్రయత్నంలో విచారణ నిర్వహించారు. అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండే గ్రామస్తులను విచారించారు. బంగారుపాళ్యం మండలం బోడబండ్ల అటవీ ప్రాంతంలో నాటు బాంబు పేలుడుకు ఏనుగు గాయపడిందా లేక
మృతి చెందిందా అన్నదానిపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం అటవీ శాఖ చేసింది. గాయపడ్డ ఏనుగు కు ఇప్పటిదాకా వైద్యం అందక పోగా గాయపడ్డ ఏనుగు వివరాలను కూడా వెల్లడించలేక పోయింది. అయితే
14 ఏనుగుల గుంపులో ఒక ఏనుగు గాయపడినట్లుగా చిత్తూరు డీఎఫ్ఓ స్పష్టం చేశారు. ఏనుగు రక్త నమూనాలు, ఎముకను ల్యాబ్ కు పంపామన్నారు డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ భరణి. నాటు బాంబులు పెట్టిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామన్నారు.

గాయపడ్డ ఏనుగును బయటకు తీసుకుని రావడం కష్టతరమన్నారు. సహజ సిద్ధంగానే గాయపడిన ఏనుగు కోలుకుంటుందన్నారు. నాటు బాంబు దాడిలో ఒక కుక్క కూడా మరణించిందన్న డీఎఫ్ఓ
వన్యప్రణాలు వేట కోసం ఆరు నాటు బాంబులు పెట్టారని స్పష్టం చేశారు. నాలుగు బాంబులు స్వాధీనం చేసుకున్నామని ఏనుగుల బెడద నియంత్రించేందుకు యాదమరి, బంగారుపాల్యం మండలాల్లో సోలార్ ఫినిషింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు డీఎఫ్ఓ భరణి.

ఇవి కూడా చదవండి

జిల్లాలో ఇలాంటి ఘటనలెన్నో.

జిల్లాలో పంట పొలాలకు ఏర్పాటు చేసుకున్న అనధికార విద్యుత్ కంచెలు, అడవి జంతువుల ను వేటాడేందుకు వేటగాళ్ల ఉచ్చులుకు వన్యప్రాణులే కాదు మనుషులు కూడా బలవుతున్నారు. ఇలా జిల్లాలో పలు ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో చిరుతలు, ఏనుగులు, అడవి పందులు ఇతర జంతువులు, మనుషులు మృత్యువాత పడినట్లు అటవీ శాఖ లెక్కలు కూడా చెబుతున్నాయి. పోచింగ్ కు సంబంధించిన చాలా కేసులు నమోదు అయ్యాయి.

గత మూడేళ్ల క్రితం రామకుప్పం మండలంలో రెండు ఏనుగులు ఒక చిరుత వేటగాళ్ల ఉచ్చు కు బలయ్యాయి. ఏడాది క్రితం చిన్నగొట్టికల్లు మండలం భాకరాపేట వద్ద మామిడి తోటలో విద్యుత్ షాక్ కు గురై ఏనుగు మృతి చెందింది. పలమనేరు రూరల్ మండలం జగమర్ల అటవీ ప్రాంతం వద్ద పొలానికి వేసిన విద్యుత్ కంచె ఏనుగును బలి తీసుకుంది. ఐరాల మండలం అప్పుగుండు అటవీ ప్రాంతంలో అడవి పందుల బెడద నుంచి పంట పొలాలను కాపాడుకునేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ షాక్ కు గురై రెండు ఏనుగులు మృతి చెందాయి. ఈ కేసులో ఇద్దరు అరెస్టు కాగా ఐరాల మండలం మల్లంపల్లి వద్ద పొలానికి వేసిన విద్యుత్ ఇనుప కంచె ఉచ్చులో చిరుత చిక్కి గాయపడింది. తిరుపతి జూ పార్కు లో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇక యాదమరి మండలం తాళ్లమడుగులో వేటగాళ్ల ఉచ్చులో పడ్డ చిరుత మృతి చెందగా చిరుత కాళ్ల గోళ్ళను స్మగ్లర్లు అపహరించారు. ఈ కేసులో ఆరుగురు అరెస్ట్ కూడా అయ్యారు. బంగారుపాళ్యం మండలం పంట పొలాలకు వేసిన విద్యుత్ కంచె ఏనుగు బలి తీసుకోగా వేటగాళ్ల ఉచ్చుకు జంతువులే కాదు జనం కూడా బలి అయ్యారు.

ఇక గత నెలలో గంగవరం మండలం కొత్తపల్లి అటవీ ప్రాంతంలో వేటగాళ్ల ఉచ్చుకు యువకుడు కూడా బలయ్యాడు. అడవి పందుల వేట కోసం ఏర్పాటు చేసిన ఉచ్చులు, అక్రమంగా పంట పొలాలకు ఏర్పాటు చేసుకున్న విద్యుత్ తీగల కంచెలకు వన్యప్రాణులు బలి అవుతున్నాయని ఫారెస్ట్ అధికారులు అంగీకరిస్తున్నారు. వేటగాళ్లు నాటు బాంబులు కూడా వాడుతున్నారని చెబుతున్నారు. సీరియస్ ఎఫెన్స్ గా పరిగణిస్తున్నారు. నాటు తుపాకులతోనూ వేట కొనసాగు తోందని, పలు కేసులు కూడా నమోదు చేయమంటున్నారు చిత్తూరు డిఎఫ్ఓ భరణి.

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..